భ్రాంతి 646

ఈ సంబరం అంతా చూసుకుంటూ తిరుగుతున్నారు మన మిత్రులు. గోరు ఇంకా దిగాలుగా వుండటం చూసి కిరీటి వాడి భుజం పైన చెయ్యి వేసి ‘ఒరేయ్ నువ్వు ముందు కాస్త ఆ లోకం నుంచి బయటకు రారా. మీ అమ్మా, నాన్న ఎలాగో ఒకలా ఫీజు విషయం సర్దుబాటు చేస్తారులేరా’ అంటూ వాడి మూడ్ మార్చడానికి ట్రై చేస్తున్నాడు. గోరు మిగతా ఇద్దరికీ వినబడకుండా కిరీటితో మెల్లిగా ‘అది కాదురా, అక్కని కాలేజీ నుంచి ఇంటికి తెచ్చేశారురా. ఊళ్ళో బయట తిరగటం ఇష్టంలేక వారంనుంచి ఇంట్లోనే వుంది. ఇయ్యాల సంతకి వస్తానంది. కానీ అదీ ఆళ్ల కాలేజీ ఫ్రెండ్స్ ఎవరో వస్తేనే’ అన్నాడు. ఇక యే రకంగా వాడిని సముదాయించలో కిరీటికి అర్ధం కాలేదు.

‘ఒరేయ్, నేను ఒకసారి స్టేజ్ దగ్గరికి వెళ్లొస్తానురా. యవరెవరు యేసాలు కడతన్నారో చూసొత్తా’ అంటూ కిట్టి స్టేజ్ వైపు వెళ్ళాడు. ‘రేయ్, ఆ అంగళ్ళ కాడికి వచ్చేయ్. ఈ సారి యెవరో పట్నం వోల్లు మూడు కొట్లు పెట్టినారంట. ఇందాకే నాయుడుగోరి పిలగాడు చెప్తుండే’ అంటూ రంగ అరిచిన అరుపు విన్నట్లు చెయ్యి వూపాడు కిట్టి.

మిగిలిన ముగ్గురూ అక్కడ పెట్టిన షాపులు చూసుకుంటూ ముందుకు సాగారు. కొంతసేపటికి కిట్టి వీళ్లవైపు ఆదరా బాదరా గా పరిగెట్టుకుంటూ వచ్చాడు. ఆయాసంతో రొప్పుతూ ‘దుర్యోధన ఏకపాత్రాభినయం వుందిరా రేత్తిరికి. యే నా కొడుకో చెంకీల దండలు యెత్తుకుపోయినాడు. యేషమ్ కట్టే బాబాయి కంగారు పడతాండు. రాండి, యెతుకులాడితే యాదో ఒక అంగట్లో దొరుకుతాయి’ అంటూ వీళ్ళని లాక్కుపోబోయాడు.
కిరీటి అందరినీ ఆపి ‘అందరూ కలిసి ఒక్కొక్క అంగడి వెదికేబదులు విడివిడిగా వెళ్దామురా. కిట్టికి దొరికితే వాడు కొనేస్తాడు. మిగతా మనలో యెవరికన్నా కనిపిస్తే యే షాపులో చూశారో గుర్తు పెట్టుకోండి. అరగంటలో ఆ పెద్ద ప్రభ దగ్గరికి రండి. యే షాపులోనూ లేకపోతే యేం చెయ్యాలో అప్పుడు ఆలోచిద్దాం. నాటకానికి ఇంకా చాలా టైమ్ వుందిరా కిట్టీ, కంగారు పడకు’ అన్నాడు.

‘రేయ్, ఈడు లేకపోతే మన బుర్రలు పనిచెయ్యవురా. అట్టానే కానియ్యండి’ అంటూ నలుగురూ తలో దిక్కు బయలుదేరారు.

ఒక్కొక్క అంగడి చూసుకుంటూ ముందుకు పోతున్న కిరీటి వున్నట్టుండి ఒక అంగడి దగ్గర ఆగిపోయాడు. చుట్టూ వున్న అంగళ్ళకంటే చాలా చిన్నగా వుంది ఆ షాపు. ఒక చిన్న బోర్డు మీద ‘మ్యాజిక్’ అన్న ఒక్క పదం మాత్రం రాసివుంది అక్కడ. అంగట్లో ఒక బల్ల, కుర్చీ, ఒక చిన్న బుక్ షెల్ఫ్ వున్నాయి అంతే. అక్కడ వున్న అతను తల బల్ల మీద పెట్టుకొని నిద్రపోతున్నాడు. మెల్లిగా అంగట్లోకి వెళ్ళిన కిరీటి ఆ షెల్ఫ్ లో ఏముందో అని ఆసక్తిగా చూస్తున్నాడు.

‘30 రోజుల్లో card tricks నేర్చుకోండి’, ‘Dice లో చీట్ చెయ్యడం ఎలా’, ‘హస్త లాఘవం’ లాంటి విచిత్రమైన పుస్తకాలు, playing cards, సంకెళ్ళు, పెద్ద పెద్ద రింగులు ఇలా విచిత్రమైన వస్తువులు అన్నీ వున్నాయి అక్కడ. ‘Misdirection’ అన్న ఒక పుస్తకం బయటకు తీసి పేజీలు తిరగేస్తున్నాడు.

‘ఏమన్నా నచ్చాయా?’ అంటూ ఒక సన్న గొంతుక పలకరించేసరికి వులిక్కిపడి వెనుతిరిగి చూశాడు. బల్లమీద తలపెట్టుకొని పడుకొన్నది అబ్బాయి కాదు, ఒక అమ్మాయి! పిక్సీ కట్ తో మొదటిచూపులో అబ్బాయిలా కనిపిస్తోంది. ఆ అమ్మాయి ముఖంలో మొట్టమొదటగా కిరీటి గమనించింది ఆమె కళ్ళు. తేనె రంగు కళ్ళు జీవితంలో మొదటిసారిగా చూడటం అదే కిరీటికి. కోటేరు లాంటి ముక్కు అని ఎవరు వర్ణించారోగాని అది ఈమె ముక్కు చూసే అనుకున్నాడు. కిందిపెదవి పైపెదవి కంటే కొంచెం సన్నం, నిండైన బుగ్గలు, కొనదేలిన చుబుకం…ఈ రూపం ఒక్క సెకనులో కిరీటి మనసులో ముద్ర పడిపోయింది.

ఒక ఇబ్బందికరమైన నిశ్శబ్దం డెవలప్ అయ్యేముందే కిరీటి తేరుకొని ‘ఇలాంటి పుస్తకాలు, వస్తువులు మా ఊరిలో చూడటం ఇదే మొదటిసారి. ఎక్కడ మొదలు పెట్టాలో, ఏమేమి నచ్చాయని చెప్పాలో అర్ధం కావట్లేదు. చూస్తే ఇవన్నీ తీసుకుపోయి చదవాలి అనిపిస్తోంది’ అన్నాడు.

ఆ అమ్మాయి నవ్వి నీకొక చిన్న సరదా ట్రిక్ చూపిస్తా రమ్మని బల్ల దగ్గరకు పిలిచింది.

Coins తోనూ, పేకముక్కలతోనూ చిన్న చిన్న ట్రిక్స్ చేసి చూపించింది ఆ అమ్మాయి. ‘ఎలా వున్నాయి?’ అని నవ్వుతూ అడిగింది. బాగానే వున్నాయి అని మొహమాటానికి చెప్పబోయి కిరీటి ఎందుకో ఆగిపోయాడు. ‘మీరేమీ అనుకోనంటే, అంత ఇంప్రెసివ్ గా అయితే ఏమీ లేవండి’ అన్నాడు మెల్లిగా.

తనేమన్నా అనుకుంటుందేమో అని apprehensiveగా తననే చూస్తున్నాడు. ఆ అమ్మాయి మటుకు అలా ఏమీ అనుకోకుండా కొంత తీక్షణంగా ఆలోచించి కిరీటి వంక చూసి ‘అయితే ఇదుగో మీకోసం ఒక నిజమైన మ్యాజిక్ ట్రిక్. A serious trick for a serious man’ అంది. కిరీటికి బుర్ర తిరిగిపోయింది. ఆ రోజుల్లో పెంచలాపురంలాంటి పల్లెటూళ్ళో అమ్మాయిలు చదువుకోవడమే ఒక గొప్ప విషయం. అలాంటిది ఈ అమ్మాయి ఇంగ్లిష్ ఇంత అలవోకగా మాట్లాడేసరికి stun అయిపోయాడు. దానితోపాటు ఇప్పుడు చేయబోయే సీరియస్ ట్రిక్ ఏమై వుంటుందా అని చూస్తున్నాడు.

1 Comment

  1. The site itself is related sex stories when sex content is not in the stories then readers will not show much interest. Pl post sex related stories.

Comments are closed.