హలో బాబూ సంజయ్ నేను పూజారి ని మాట్లాడుతున్నాను,మీ నిద్రని ఏమైనా పాడు చేసానా అన్నాడు ..
నమస్కారం పూజారి గారు,అబ్బే అలాంటిదేమీ లేదు చెప్పండి ఏంటి విషయం..
బాబూ మా నాన్న గారితో మీ గురించి మాట్లాడాను,మిమ్మల్ని బ్రహ్మ ముహూర్తం మొదలయ్యేసరికి కోటలో కలుసుకోమని చెప్పారు అందుకే మీకు చెప్పడానికి ఈ ఫోన్ కాల్ అన్నాడు..
చాలా సంతోషమైన వార్త చెప్పారు పూజారి గారు ధన్యవాదాలు, త్వరగా నేను సిద్ధం అయ్యి వెళ్తాను .
బాబూ నీతో పాటూ నీకు ముఖ్యమైన వ్యక్తిని ఒకరిని వెంటబెట్టుకుని రమ్మని చెప్పారు నాన్న గారు అన్నాడు ఆ పూజారి..
అలాగే పూజారి గారు అంటూ ఆయనకి సెలవు చెప్పి నానీ గాడికి కాల్ కలిపి విషయం అంతా చెప్పాను,వాడు సరేరా నేను వచ్చేసాను అనగా ఫ్రెష్ గా తలస్నానం చేసి సిద్ధం అయ్యి బయలుదేరాను నా ఆయుధాన్ని తీసుకొని…అప్పటికే నాని గాడు సిద్ధంగా ఉండేసరికి ఇద్దరమూ బయలుదేరాము కోట వైపు..
వెళ్తుంటే మా అడుగులు ముందుకు కదలడం లేదు,విపరీతంగా గాలి వీస్తూ మమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా అడ్డు పడటం మొదలెట్టింది…కాసింత ఆశ్చర్యాన్ని కలిగించినా అతి కష్టం మీద కోట ప్రాంతాన్ని చేరి వెనుక భాగం వైపు వెళ్లి తలుపు కొట్టాము… ఆ తలుపు తనంతట అదే తెరుచుకొని దారి ఇవ్వగా లోపలికి వెళ్ళాము ఇద్దరమూ…
తలుపు మూసుకొని కోట లోపల భాగం మొత్తం స్వర్ణ కాంతులతో మెరిసిపోతూ మాకు ఆశ్చర్యం ని కలిగించింది,ఎప్పుడూ గబ్బిలాల అరుపులతో చిమ్మచీకటి తో ఉండే కోటలో ఇంతటి కాంతి ఎలా సాధ్యం అన్న ఆలోచనతో మరింత ముందుకు వెళ్ళాము…
సుస్వాగతం మధనా అంటూ ఒక గాంభీర్యం కలిగిన గొంతు మాకు వినిపించేసరికి అటువైపు తిరిగాను,కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతితో ఒక ఆజానుభాహుడు కొంచెం దూరంలో ఆసీనుడై కనిపించేసరికి వినయంగా నమస్కరించాము ఇద్దరమూ ఆయనకి.
రండి ఆసీనులు కండి అంటూ ఆయనకి ఎదురుగా ఉన్న కుర్చీలు లో మమ్మల్ని కూర్చోమని ఆదేశించడంతో కూర్చొని ఆయన్ని పరిశీలనగా గమనించడం మొదలెట్టాను,ఆయన మొహంలో ఏదో వింత కాంతి నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది….నా ఆలోచనకి అంతరాయం కలిగిస్తూ ప్రయాణం ఎలా జరిగింది అంటూ తన కంచు కంఠంతో ప్రశ్నించారు ఆయన.
బ్రాహ్మణా ప్రయాణం అతి కష్టం మీద జరిగింది,ఆశ్చర్యం కి గురిచేసింది ప్రకృతి మాకు అంతరాయం కలిగించడం..
నిజమే మధనా,ఇది ఆ మాయావి గుహుడకి అత్యంత అనుకూలమైన సమయం…నిజానికి బ్రహ్మ ముహూర్తం అన్నది దేవతలకి అత్యంత ప్రీతికరమైన సమయం కానీ దురదృష్టవశాత్తు ఆ మాయావి ఈ సమయాన్ని తనకి అనుకూలంగా మార్చుకొని ఈ ప్రకృతిని శాసిస్తున్నాడు..
వాడి శక్తులు వృద్ధి చెందలేదని విన్నాను బ్రాహ్మణా,అలాంటప్పుడు వాడు ప్రకృతి ని శాసించడం ఏంటి అన్నాను ఆశ్చర్యం తో..
హ హ్హా మధనా,వాడికి ఒక్క శక్తీ లేకున్ననూ వాడి ముందు ముక్కోటి దేవతలు కూడా నిలబడలేరు,అంతటి మహా శక్తిశాలి వాడు,ఈ సమయంలో వాడి శక్తులు నువ్వనుకున్నట్లు ఆగిపోలేదు నిరంతరం వృద్ధి చెందుతూనే ఉన్నాయి అన్నాడు నాలో మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తూ…
బ్రాహ్మణా మీ ప్రవర్తన నాలో విపరీతంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది,మేము ఈ కోటలోకి అడుగుపెట్టిన సమయాన్నే నన్ను మీరు మధనా అని సంభోదించడం చూస్తుంటే మీరు చాలా బలవంతులు అని అర్థం అవుతోంది,వరూధిని గురించి మీకు తెలిసే ఉంటుంది ఈ మాయావులు ఇద్దరూ చావు దెబ్బలు తిని వెళ్లారు అలాంటిది వీళ్ళు ముక్కోటి దేవతలను మించి శక్తి కలిగి ఉండటం ఏంటో అర్థం అవ్వడం లేదు అన్నాను వినయంగా.
హ హ్హా మధనా భేష్,నువ్వు మామూలు మనిషివి కాదు,నీ తెలివితేటలు అమోఘం…నువ్వన్నట్లు ఆ వరూధిని చేతిలో చావుదెబ్బలు ఎవ్వరైనా తినాల్సిందే,ఎందుకంటే అత్యంత శక్తివంతమైన మహాదీపం ఎల్లప్పుడూ ఆమెని సంరక్షించుకుంటూ ఉంటుంది…ఆ శక్తి ముందు ఆ మాయావుల ప్రస్తుత శక్తి ఏ మాత్రమూ సరిపోదు….నిజానికి ఇప్పుడు మీరు విజయవంతం గా ఇక్కడికి చేరుకున్నారు అంటే అది ఆ మహాదీపపు శక్తి వల్లే…ఆ మహాదీపం యొక్క శక్తి జ్వాల నీ పైన ఉండటంతో నువ్వు విజయవంతం గా ఇక్కడికి చేరుకున్నావ్ లేకుంటే దారిలోనే హతమయ్యేవాడివి అంటూ ముగించాడు..
ఆయన మాటలు అమితాశ్చర్యానికి గురి చేయగా,అయినా మిమ్మల్ని నేను కలవడానికి ఆ మాయావులకి గల అభ్యంతరం ఏంటి బ్రాహ్మణా అన్నాను…ఆ మాట అన్న మరుక్షణం రాజనివాసం లో గల యక్ష బ్రాహ్మణుడు ప్రత్యక్షం అయ్యి మాలో మరింత ఆశ్చర్యాన్ని కలిగించాడు..
రఘుపతీ అన్నీ సంసిద్దంగా ఉన్నాయి మీ పనిని మొదలు పెట్టడం సమంజసం అని ఆ యక్ష బ్రాహ్మణుడు అనేసరికి అలాగే యక్షా కానివ్వండి అని కోటలోని బ్రహ్మణుడైన రఘుపతి తన సమ్మతాన్ని తెలియజేయగా ఆ యక్షుడు తన మాయలతో ఒక మహా జ్వాలని మా ముందు రగిల్చి అందులో తన తలలోని మూడు వెంట్రుకలని వేసాడు…
ఆశ్చర్యం గా ఆ జ్వాలలో నుండి అత్యంత ప్రకాశవంతమైన “వజ్రం” మా ముందు పడింది ఆ జ్వాలని ఆర్పేసి..ఆ వజ్రం అచ్చు నా దగ్గర ఉన్న వజ్రాన్ని పోలి ఉండటంతో ఆశ్చర్యం గా ఈ వజ్రం నా దగ్గర ఉంది అంటూ నా జేబులోని వజ్రాన్ని చూపించాను..
నీ దగ్గరున్నది నకిలీ వజ్రం మధనా,ఆ నకిలీ వజ్రాన్ని నేల విసురు అని ఆదేశించగా నేల పైన జారవిడిచాను…ఆశ్చర్యం గా ఆ నకిలీ వజ్రం జ్వాలలో నుండి వచ్చిన వజ్రంలో చేరిపోయి మరింత ప్రకాశంను కలిగించింది..
యక్షా మన బాధ్యత ఇంతటితో ముగిసింది,ఈ విశ్వకళ్యాణం కి అవసరమయ్యే ఈ మహత్తర వజ్రాన్ని మధనుడికి ధారాదత్తం చేయండి అంటూ ఆజ్ఞాపించాడు రఘుపతి…
ఆ యక్ష బ్రాహ్మణుడు ఆ వజ్రాన్ని నా చేతుల్లో పెట్టి,మధనా ఇన్నాళ్లూ నేను పడిన కష్టానికి ప్రతిఫలం కలిగింది,నా బాధ్యతని నేను విజయవంతం గా నిర్వర్తించాను ఇక నేను సెలవు తీసుకుంటాను అనగా ,బ్రాహ్మణా ధన్యవాదాలు మీరు మాతో పాటే ఉండాలి అనగా ఆ యక్షుడు నా విజ్ఞప్తి ని తిరస్కరిస్తూ మధనా ఇంతటితో నా కర్తవ్యం ముగిసింది నేను వెళ్లక తప్పదు,విజయుడవు అయ్యి ఈ విశ్వ కళ్యాణం ని జరిపిస్తావు అని ఆశతో సెలవు తీసుకుంటున్నాను అంటూ అదృశ్యం అయ్యాడు సంతోషంగా..