జీవితం 504

భుజం మీద ఒక చెయ్యి పడి నన్ను గట్టిగా ఊపింది. నేను జర్రున జారి నీళ్ళలో పడ్డాను.

ఉక్కిరి బిక్కిరి అయ్యాను. ఊపిరి అందడం లేదు………..కళ్ళు తెరిచాను. నేను నీళ్ళలో లేను, మంచం మీదున్నాను. మా అమ్మ నా ముఖం లోకి సీరియస్ గా చూస్తోంది. ఇక ఇహం లోకొచ్చాను. చెదిరిన కల పగిలిన అద్దంలా ముక్కలైంది. ఆ ముక్కల్ని పేర్చి జారిన దృశ్యాన్ని తయారు చెయ్యటానికి మనసు ప్రయత్నిస్తున్నది. మళ్లీ ఆ కలలోకెళ్లాలని ఒకటే పీకుడు. వేళ కాని వేళ నిద్ర పోతున్నావు, చాల్లే లే ఇక అని మా అమ్మ మొట్టికాయ వేసింది. తియ్యటి కల లోంచి చేదు వాస్తవంలోకి వచ్చేశాను.

బజారు కెళ్ళి సరుకులు తెమ్మని లిస్టూ, డబ్బులూ ఇచ్చింది అమ్మ. వెళ్లి తెచ్చాను. మళ్లీ ఏకాంతం దొరికింది. రేడియో లో వివిధ భారతి పాటలు వింటూ కూర్చున్నాను. ఎస్. జానకి పాటలూ ఎల్. ఆర్. ఈశ్వరి పాటలు వింటూ ఆనందిస్తున్నాను. జయత్త గొంతు పరవాలేదు. మరీ శ్రావ్యంగా ఉండదనుకుంటా కాని, కర్ణ కఠోరం మాత్రం కాదు. ఆమె జానకి లాగానో, ఎల్. ఆర్. ఈశ్వరి లాగానో పాడ గలిగితే …… అబ్బ అద్భుతం కదా అనిపించింది. ఆ అందానికి ఈ కళ జత ఐతే ఎంత బాగుండు. వరూధిని జయత్త లాగా ఉండేదా? జయత్త ముందు వరూధిని దిగదుడుపేమో. ఆ వరూధిని ప్రవరాఖ్యుణ్ణి చూడగానే వెంట బడింది. ప్రవరాఖ్యుడేమో పారిపోయాడు. ఈ ప్రవరాఖ్యుడికేమో నేటి వరూధినిని చూస్తే మనసు నిలవడం లేదు. కోరికలు పరవళ్ళు తొక్కుతున్నాయి. కాలం మారింది కదా, సీను తిరగబడింది. ఏంటో, ఆ నాడు ప్రవరాఖ్యుడి స్థానంలో నేనుంటేనా కథ మొత్తం మారి పోయుండేది కదా. ఇంతకీ అప్పటి ప్రవరాఖ్యుడు నేనే నేమో! పారిపోయి ఇంటికి చేరాక నాలుక కరుచుకున్నానేమో. అవకాశం వచ్చినప్పుడేమో చేసిందది—పరుగో పరుగు.
ఈ జన్మలో బుధ్ధి వచ్చిన ప్రవరాఖ్యుణ్ణి నేనే నన్నమాట. నేటి ప్రవరాఖ్యుడికి బుద్ధి వచ్చింది, ఒక వరూధినేమిటి అనేక మంది వరూధినులు తారస పడుతున్నారు. కాని ఒక్కరూ ప్రవరాఖ్యుడి వెంట పడటం లేదు. వీళ్ళకి పూర్వ జన్మ జ్ఞానం, జ్ఞాపకాలు లేవా? ఎవరన్నా మునులు శపించారేమో. ఈ మునులు సుఖ పడరు, ఇతరులు సుఖ పడితే ఓర్చుకోలేరు. మళ్లీ అప్పుడప్పుడు వాళ్ళు కూడా కాలు జారుతూనే వుంటారు. అదేమో లోక కళ్యాణం కోసమని సమర్ధించుకుంటారు. వాళ్ళు చేస్తే రైటు, మనం చేస్తే రాంగూ…. ఇదేమి న్యాయం? ఇలా ఆలోచనలు నడుస్తున్నాయి.