నవతరపు చిగురింత 181

“ఓహ్ ఆయనా మాకు దూరపు చుట్టాల్లే, తెలిసినవారే ! ఏమి ?” అన్నాను.

“కొంచం జాగ్రత్తమ్మా మడిసి మంచోడు కాదనిపిస్తుంది. నేనిట్టా లోనికొస్తా ఉంటే ఆయన బయటికి ఎల్తా ఎల్తా నన్ను తినేట్టు చూసాడు. నిండా వయసు రాంగానే సరా? ఆడదాన్నే ఎరగనట్టూ ….ఏటో ఆ చూపు..” ఇంకా ఏదో చెప్పబోయింది.

“చాల్లే నోరుమూసుకో ! “పెద్దాయన్ని పట్టుకొని ఏంటా మాటలు? వయసుకైనా విలువియ్యద్దూ” నిష్టూరమాడాను నేను.

“ఏమోనమ్మా నాకనిపించిని సెప్పాను, మీ సుట్టపోళ్ళన్నారు కదా మీకే తెలియాలి” అని ఊరుకొంది. నేనూ డిస్కషన్ పొడిగించకుండా గిన్నెలు వేసి డ్రాయింగ్ రూంలో టీవీ ముందు కూర్చొన్నాను. నిజానికి రోజూ పక్కింటావిడ విషయాలనో, టీవీ సీరియల్స్ గురించో అది బట్టలుతికేంత సేపూ చర్చించుకొంటూ నేను కాఫీ తాగుతూ దానికి కంపెనీ ఇస్తాను. కానీ బాబాయ్ గారినలా అనేసరికి ఇహ నేను దానితో ఈ రోజు ఏమీ మాట్లాడదలుచుకోలేదు.

అన్ని పనులూ పూర్తయ్యాక “వెళ్ళొస్తానమ్మా” అంది పంకజం. “అలాగే” అని ముక్తసరిగా బదులిచ్చి తలుపేసుకొన్నాను నేను. చుట్టాలని తప్పుడుకూతలు కూసిందని నాకు కోపం వచ్చిందని దానికి అర్ధమయ్యే ఉంటుంది. అవ్వాలి కూడా!! లేకపొతే ? ఆ ఇంటా ఈ ఇంటా వార్తావిశేషాలని ఎన్ని వీధులైనా దాటించేస్తారు ఈ పనిమనుషులు.

అవును బాబాయ్ గారు అలా చూసే ఉండచ్చు ఆయన పరిస్థితటువంటిదని అర్ధం చేసుకోవచ్చుగా? అలాంటి స్థితిలో ఏ మగాడు మాత్రం ఏం చేస్తాడేం? వైన్ షాప్ ముందు అరుగుమీద నిండా తాగి తూగే నీ మొగుడుకంటేనా? లేక నువ్వేమైనా అప్సరసవనా? మనసులొనే పంకజాన్ని కడిగి పారేశాను. ఎందుకో బాబాయ్ గారంటే ఒక సాఫ్ట్ కార్నర్ నా మనసులో.

ఏతా వాతా పంకజం మాటల్లో కొంత నిజం లేకపోలేదు. కానీ శేషగిరిరావుగారి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు దానికి తెలియవు కనుక అది అలా మాట్లాడ్డం ముమ్మాటికీ తప్పే !!

శేషగిరిరావుగారి కుటుంబంతో మాకున్నా సంబంధం ఈనాటిది కాదు. సుమారు రెండు దశాబ్దాలనాటిది. ఆయనకి ఓ నలభై యేళ్ళుంటాయేమో అప్పట్లో. నేను కాలేజీ చదివే రోజులు. జిల్లా పరిషత్ హైస్కూల్ లో క్లర్క్ గా పనిచేసేవారు. బస్సు కోసం బస్టాపులో ఎదురుచూసేదాన్ని ఆయనా బస్స్ కోసం ఎరుదుచూస్తుండగా నాకు తొలిసారి పరిచయం అయ్యారు. వాళ్ళ అబ్బాయి అమ్మాయీ కూడా మాతోటి వయసు వారే. ఒకే కాలేజీ అవ్వడంతో వాళ్ళమ్మాయి గీతా నేనూ మంచి నేస్తాలం కూడా. సుమారు నా తండ్రి అంత వయసుంటుంది ఆయనకి. ఆరోజుల్లో లంగా వోణీలో బస్స్ కోసం వేచి చూసే నన్ను తేరిపారా ఆయన చూడడం నాకింకా గుర్తు. వయసు తొలినాళ్ళలో ప్రతి చూపూ ఒక సూదిమందు అని తెలియక తేలికగా అమాయకంగా తీసిపారేసే వసయది.

ఆయనా మా నాన్నగారూ పరిచయం స్నేహంగా మారి మాకు మెల్లెగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా అయ్యారు . ఆ రోజుల్లో నలభై యేళ్ళలోనూ అందంగా ఠీవిగా ఉండే ఆయన్ని కాలం క్రమేణా కుంగదీసింది. పిల్లలకి పెళ్ళై పరదేశాల్లో స్థిరపడగా, పిన్నిగారూ ఆయనా హైదరాబాదొచ్చి మా కాలనీలోనే స్థిరపడ్డారు. అలా చాలా యేళ్ళ తరువాత కలిసిన ఆ కుటుంబం మాకు చేదోడు వాదోడుగా ఉండడం అలవాటయ్యింది.

పిన్నిగారూ నేనూ రైతుబజార్లో కూరలు కొనడం, షాపింగులు చెయ్యడమూ ఇంకా గుర్తు. కానీ రొమ్ము క్యాన్సర్తో ఆవిడ కాలం చేసి ఓ నాలుగేళ్ళైంది. ఇహ ఆ రోజు నుంచీ ఒంటరితనమైతే గానివ్వండీ, సరైన సమ్రక్షణ లేకనైతే కానివ్వండీ బాబాయ్ గారు చిక్కి సగమైపోయారు. పిల్లలా దగ్గరలో లేరు. నేనూ మావారూ, కాలనీలో కొందరు పరిచయస్థులూ ఆయన మంచీ చెడ్డలు చూస్తూ ఉంటాము. వచ్చే పెన్షన్ డబ్బులతో, ఓ వాటా అద్దెకిచ్చుకొని ఆ అద్దె డబ్బుతోటీ చిన్న పోర్షన్లో అలా జీవితాన్ని వెళ్ళదీస్తున్న ఆయనంటే నాకు ఒక ఆరాధనా భావం.