నవతరపు చిగురింత 181

బ్రతికున్నప్పుడు పిన్నిగారు రూపాయి కాసంత బొట్టుపెట్టుకొని , మెండైన విగ్రహంతో దబ్బపండు రంగులో నిండుగా ఉండేవారు. ఆవిడతో ఓ సారి ఊరగాయల విషయమై కారమూ, ఉప్పూ, నూనె పాళ్ళగురించి అడుగుదామని వాళ్ళింటికెళ్ళాను. చిన్న ఇల్లే ఐనా తీరువగా ఉంది . బెడ్రూం చక్కగా అలంకరిచబడి డీసెంట్ గా ఉంది. దంపతుల కలుపుగోలుతనం, పిన్నిగారి సరసోక్తులూ, వెరసి రమ్యమైన ఇంటి వాతావరణం అన్నీ చూస్తే వాళ్ళింకా కొత్తగా పెళ్ళైన వాళ్ళలా చిలిపిగా ఉంటారని చూసిన ఎవరికైనా అర్ధమైపోతుంది. ఆవిడ అంత వయసులోనూ కొప్పు నిండా పూలు, చేతులకు గోరొంటాకు ఎర్రగా తాంబూలం పండిన నొరుతో గూడార్ధాలని ధ్వనింపజేస్తూ జోకులు పెల్చేవారు. నాకు తెలిసి హెల్తీ సెక్స్ లైఫ్ ఆ దంపతులది.

అమాంతంగా భార్య పోవడంతో ఒంటరి పక్షి ఐపోయిన బాబాయ్ గారికి ‘ఆ’ సుఖమూ దూరమయ్యిందన్నదే నాకు బాధగా ఉండేది. చీటీ పాటలో ఆయన జాయిన్ అవ్వడం చాలా చిత్రంగా జరిగింది. ఈ రోజుకీ తలుచుకొంటే నాకు ఆశ్చర్యమే.

చాలా యేళ్ళక్రితం (చీటీపాట బిజినెస్ అస్సలు మొదలే అవ్వని రోజులవి) ఒకరోజు పొద్దున్నే పనిమనిషి యాదమ్మ (పంకజానికి ముందటి పనిమనిషి) పాచి పనికని వచ్చి తలుపు తట్టింది. తీయగానే నా జబ్బ పట్టుకొని పక్కకు లాకెళ్ళి చాటుగా చెవిలో చెప్పింది ” అమ్మా? మీకీ విషయం తెల్సా? నిన్న రాత్రి అయ్యగోరు తాగి మా గుడిశెకొచ్చారు. నా పెనిమిటికి పూటుగా మందుపోయించి ఇంటిదగ్గర బండి మీద దిగబెడుతూ ఒక మందుసీసా కూడా ఇచ్చారమ్మా” అని చెప్పి ఎవరైనా చూస్తున్నారేమో అన్నట్టూ చూట్టూ చూడ్డం మొదలెట్టింది.

“నా పెనిమిటిని గుమ్మం దగ్గరే అరుగుమీద కూర్సోబెట్టి గుడిశెలోకి దూరి… ..మరేమో మరేమో.. … పొయ్యి కాడున్న నా దగ్గర కూకొన్నారమ్మా”. బెరుగ్గా చెప్తూ ఏడుపునాపుకొంది యాదమ్మ

“అవునా!” విస్తుపోతూ విన్నాను నేను. నెత్తిన పిడుగు పడ్డట్టయ్యింది.

“సారు నన్ను లొంగదీసుకొంటారని భయంగా ఉంది, నిన్న బూతులాడుతూ నన్ను బెదిరించారు. శనివారం రేత్రికి మీరు గుళ్ళో హరికత ఇండానికెళ్ళేసరిని నన్ను మీ ఇంటికొచ్చెయ్యమన్నారమ్మ. ఒచ్చి పక్కలో పడుకోపోతే కాలనీలో పెద్దమన్సులకి లేనిపోనివి సెప్పి యెళ్ళగొడతాననారమ్మా” అని దీనంగా ఏడుపందుకొంది యాదమ్మా.

మనిషి మామూలుగానే ఉన్నాడే ? ఏం పోయేకాలం ఉన్నట్టుండి? ప్రతి రోజూ పడకటింట్లో నేను సుఖాన్నిస్తున్నా ఇలా పక్కచూపులు చూస్తే కత్తిపీటతో గుత్తి కోసి పారేయాలన్నంత కోపమొచ్చింది.
“ఊరుకోవే ! నేను చూసుకొంటాను కదా. నువ్వు కంగారు పడకు ఇంకా నాలుగు రోజులు సమయం ఉంది ఏదన్నా ఆలోచిస్తానులే” అని ఆరోజుకు సర్దిచెప్పాను.

దానికలా చెప్పానే కానీ నా మనసు మనసులో లేదు. ఈయన్ని చూసే చూపులోంచి అన్నీ తేడాలోచ్చేసాయి నా ట్రీట్మెంట్లో. నా అనుమానపు చూపులకి గొడవలూ అయ్యాయి. కానీ నేను బయటపడకుండా దొంగకి తేలుకుట్టినట్టు చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని నిర్ణయించుకొన్నాను. పాదరసం లాంటి నా తెలివితో ఒక ఐడియా వేసాను. మర్నాడు పనిలోకొచ్చిన యాదమ్మకు ధైర్యం నూరిపోసి “సారూ నిన్న మీరన్న టైంకే వస్తాను కానీ ఒక్క గంటలో వెళ్ళిపోతాను. కానీ రెండు షరతులు. నిన్న మీరన్నట్టూ పెరటిలో ఉన్న సింగిల్ రూంలోనే కలుద్దాం, గదిలో గుడ్డిదీపం తప్ప ఏ లైట్లూ ఉండకూడదు. అదీకాక అస్సలు మాట్లాడకూడదు, నన్ను మాట్లాడించద్దు. ఈ షరతులూ ఒకే ఐతేనే నేను వస్తాను. లేకపొతే పనిమానేసి నేనూ నా పెనిమిటీ వేరే ఊరుపోతాము” అని చెప్పమన్నాను. పొల్లుపోకుండా యాదమ్మ అదే ఆయనకి చెప్పింది. నేను వంటింట్లో టీ పెడుతూ కిటికీలోంచీ వాళ్ళ సంభాషణ విన్నాను.

శనివారం సాయంత్రం రానే వచ్చింది. నేను గుడికని బయల్దేరుతుంటే మావారు కొంచం హడావుడిగా ఉన్నారు. “రానీ ..రానీ ..అందాకా వచ్చి దొరికాకా అప్పుడు పని చెబ్తా” అని మనసులోనే అనుకొంటూ నేను గేట్ వేసి వెళ్ళిపోయాను. మా వీధి చివర నిలబడి ఇంటి వైపే చూస్తున్న నాకు మా ఆయన బండి తీసుకొని బయల్దేరడం కనిపించింది. ముందుగా అనుకొన్నట్టూ యాదమ్మ తను కట్టుకొనే చీరని ప్లాస్టిక్ కవర్లో నాకందించింది. వడివడిగా రెండే అంగల్లో మా ఇంటికి చేరి, నేను గుట్టు చప్పుడు కాకుండా మా ఇంటి గేట్ తీసుకొని సందువైపు నుంచీ పెరటి గుమ్మం దగ్గరున్న సింగిల్ పోర్షన్లోకెళ్ళాను.