నాన్ సెన్స్ గా మాట్లాడకు. సెన్స్తో ఆలోచించిచు… 317

“మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం మాకు చాలా ఎగ్జయిటింగ్ గా ఉంది. కాకపోతే ఒక వ్యక్తికి రెండు నిమిషాల వ్యవధే కనుక డిటైల్డ్ గా చేయలేకపోయాను. ఎప్పుడైనా మిమ్మల్ని అరగంటపాటైనా ఇంటర్వ్యూ చేస్తాను…”

“అప్పుడైనా మీ ఛానల్ వాళ్లు రెమ్యునరేషన్ పే చేస్తారా?” నవ్వుతూ అడిగాడు అనిరుద్ర.

“నేనే పర్సనల్ గా పే చేసి ఇంటర్వ్యూ చేస్తాను. బైదిబై అయామ్ ద్విముఖ…” అంటూ స్నేహ పూర్వకంగా చెయ్యి చాచింది.

ఆ చేతిని స్నేహ పూర్వకంగా నొక్కి వదిలాడు అనిరుద్ర..

ఆ పరిచయం గొప్ప మలుపుకు నాంది కాబోతోందన్న విషయం ఆ క్షణం వాళ్లకు తెలియదు.

***

బీచ్ రోడ్ లోని అరోమా కాలనీలోని అయిదో యింట్లో వాతావరణం సునామీకి ఎక్కువ, కత్రినాకు తక్కువగా ఉంది. విశాలమైన ఆ ఇంటి చుట్టూ చెక్కలతో ఫెన్సింగ్ ఉంది. మధ్యలో చెక్కగేటు, ఫెన్సింగ్ చుట్టూ బంతిపూల చెట్లు… మధ్యలో ఇల్లు… ఓవైపు బాదం చెట్టు, ఇంటి వెనుకవైపు జామ, దానిమ్మ చెట్లు… బాదం ఆకులు నేల మీద పడి వింత అందంతో మెరుస్తున్నాయి.

ఆ ఇంట్లో వున్న పెద్ద దిక్కు ప్లస్ ఓనర్ అయిన అరవై రెండేళ్ల సత్యవతమ్మ అనబడే బామ్మ తీవ్రంగా ఆలోచిస్తోంది. మధ్య మధ్య అటు ఇటూ పచార్లు చేస్తోంది. ఓసారి సీలింగ్ ఫ్యాన్ వంక, మరోసారి కిచెన్ రూమ్లో వున్న కూరగాయలు తరిగే చాకు వంక చూస్తోంది.

హాలులోకి వెళ్లింది. హాలులో వున్న ఫేము కుర్చీలో కూర్చొని గోడకు వున్న ఫొటో వంక చూసింది. అనిరుద్రకు తెల్ల వెంట్రుకలు వచ్చి, గుబురు మీసాలు పెడితే ఎలా వుంటుందో ఆ ఫొటోలోని రూపం అలా ఉంది. మొగుడి ఫొటో వంక చూడగానే, ఆ ఫొటోలో మొగుడు బదులు స్టయిల్ గా అనిరుద్ర కనిపించాడు.

బామ్మగా ఓ నిర్ణయానికి వచ్చింది. వెంటనే ఫోన్ దగ్గరికి నడిచింది. ఎయిటీస్ నాటి బ్లాక్ కలర్ టెలిఫోన్ అది… ఓ నెంబర్ డయల్ చేసింది.

అయ్యర్ హోటల్. .

బీచ్ ను ఆనుకొని వున్న అయ్యర్ హోటల్లో నుండి కాఫీ వాసన చుట్టూ పరిభ్రమిస్తోంది. దేవుడికి వెలిగించిన అగరొత్తుల పరిమళం గొప్పగా ఉంది. ఓవైపు వేడి వేడి ఫిల్టర్ కాఫీ కప్పుల్లోకి జారిపోతోంది. ఇంకో వైపు జీడిపప్పు ఉప్మా, వేడి వేడి ఇడ్డేనలు.

“కార్తీక్ నువ్వెన్నైనా చెప్పు… అయ్యర్ హోటల్లో వేడి వేడి జీడిపప్పు ఉప్మా తిని, ఫిల్టర్ కాఫీ ఒకటి లాగించి, కాసేపు బీచ్లో షికారుకొట్టి ఇంటికి వెళ్లి ఆరు బయట మంచమ్మీద పడకేసి మీద పడుతున్న బాదం ఆకులతో మాట్లాడుతూ నిద్రలోకి జారుకుంటే ఆ జీవితమే జీవితం” అనిరుద్ర వేడి వేడి ఉప్మా తిని, కాఫీ కప్పు చేతిలోకి తీసుకొని చెప్పాడు. . .

అప్పుడే టేబుల్ మీద వున్న అనిరుద్ర మొబైల్ మోగింది. కార్తీక్ కాఫీ తాగబోతుంటే, అనిరుద్ర సీరియస్గా చూశాడు కార్తీక్ వైపు.

“అదేంట్రా… ఫోన్ నీకొస్తే నా వైపు సీరియస్గా చూస్తావేమిటి?”

“ఫోన్ ఎవరికి వచ్చిందన్నది పాయింట్ కాదు… వెంటనే ఎవరు అటెండయ్యారన్నది ఇంపార్టెంట్. నా ఫోన్ నంబర్ తెలిసిన ఏకైక వ్యక్తివి నిన్ను మైనస్ చేస్తే బామ్మనే… చూడు”

కార్తీక్ మొబైల్లో డిస్ ప్లే చూశాడు… మొబైల్ డిస్ప్లే “బామ్మ రాక్షసి” అని ఉంది.

“ఒరే… బ్రహ్మ రాక్షసి నుండి ఫోన్రా” యాంగ్జయిటీగా అన్నాడు కార్తీక్,

“బ్రహ్మ రాక్షసి కాదు… బామ్మ రాక్షసి… ‘బ’కు ‘బ్ర’కు తేడా తెలియడంలేదు?” సీరియస్ గా అడిగాడు అనిరుద్ర.

“ఆ డిస్కషన్ ఇప్పుడు అవసరమా? అయినా నెంబర్ ఫీడ్ చేసుకున్నాక పేరు రాసుకుంటారుగానీ ఈ బామ్మ రాక్షసి అని రాసుకున్నావేంటి?”

“నా బామ్మ నా ఇష్టం… అయినా అస్తమానం ఉద్యోగమో ఉద్యోగమో అని క్లాసు

పీకుతుంది…”

“సర్లే… ఫోన్ లిఫ్ట్ చేయనా?” అడిగాడు కార్తీక్. “చెయ్… ఆలస్యమెందుకు?” ఓకే బటన్ ప్రెస్ చేసి, ‘హలో’ అన్నాడు కార్తీక్.

“అది తొమ్మిది రెండు నాలుగు ఆరు రెండు శూన్యం రెండు ఆరు ఒకటి ఆరేనా?” అటు వైపు నుండి బామ్మ గొంతు వినిపించింది.

“కాదు, నైన్ టూ ఫోర్ సిక్స్ టు జీరో టూ సిక్స్ వన్ సిక్స్” చెప్పాడు కార్తీక్.

“బాదం కాయతో కొడితే తలకాయ పగులుద్ది తింగరి సచ్చినోడ… ఫోన్ నీ ఎదురుగా కాఫీ తాగుతున్న సన్నాసోడికివ్వు”

“అరే… అంత కరెక్ట్ గా ఫోన్ లిఫ్ట్ చేసింది నేనే అని ఎలా కనిపెట్టావ్ బామ్మా?”, ఉత్సాహంగా అడిగాడు కార్తీక్.

“తలకు మాసిన వెధవ్వి నువ్వుగాక వాడితో ఎవడుంటాడు నక్షత్రకుడిలా… పనీపాటా పెళ్లి పెటాకులు లేకుండా”

“అరె… ప్రాసలతో భలే మాట్లాడుతావ్ బామ్మా…” “ప్రాసలేగానీ బ్రాసరీలు వేసుకునే వయసా నాది… ముందు నా మనవడికి ఫోనివ్వు”

“ఎనీ సీరియస్ మ్యాటర్?”

“కళ్లలో నుంచి వాటర్ వచ్చే మ్యాటర్… నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను. ఆల్రెడీ మంచం మీద స్టూలు వేసుకుని, సీలింగ్ కు చీర బిగించి, దాన్ని నా మెడకు కట్టుకునే మాట్లాడుతున్నా….”

“బా…మ్మా….” గట్టిగా అరిచాడు కార్తీక్. ఆ అరుపుకు కస్టమర్లు బెదిరిపోయారు.

“ఒరే… ఏంట్రా ఆ అరుపు… నీ అరుపు విని సముద్రపు అలలు కూడా వెనుక్కు పరుగెడుతున్నాయి”

కార్తీక్ అనిరుద్ర వైపు చూసి, “ఈ వార్త వింటే నువ్వు వెంటనే ఇంటికి పరుగెడతావ్?” అన్నాడు వగరుస్తూ..

“అలా ఆయసపడిపోతావేం… ఏదో రన్నింగ్ రేస్లో పరుగెత్తుకు వచ్చినట్లు?”

“సినిమాల్లో సీరియస్ మ్యాటర్ వచ్చినప్పుడు ఇలాగే పరుగెత్తుకొస్తూ చెబుతారుగా… ముందు నువ్వు పద….” కంగారుగా అన్నాడు కార్తీక్.

“ఎందుకు?? తాపీగా అడిగాడు అనిరుద్ర. ..