నాన్ సెన్స్ గా మాట్లాడకు. సెన్స్తో ఆలోచించిచు… 316

“ఎక్స్ క్యూజ్ మీ… మేము డ్రీమ్ టీవీ నుండి వస్తున్నాం.

‘ఏం చేయాలనుకుంటున్నారు?” అనే కాన్సెప్ట్ తో స్పెషల్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ప్రేమికులు, పెళ్లయిన వాళ్లు, నిరుద్యోగులు, వైద్యులు, మహిళలు… ఇలా ఎవరైనా సరే భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారో చెప్పొచ్చు…” కార్తీక్ వైపు చూస్తూ చెప్పింది యాంకర్.

కార్తీక్ కర్చీఫ్ తో మొహం తుడుచుకున్నాడు. మైక్ చేతిలోకి తీసుకున్నాడు.

“హలో… ఐయామ్ కార్తీక్… పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యింది. నాకు పెద్ద రైటర్గా పేరు తెచ్చుకోవాలని ఉంది. భవిష్యత్తులో రైటర్ని కావాలనుకుంటున్నాను”

“రైటరా…. ఇప్పుడు పత్రికలు చదివే వాళ్లు ఉన్నారా?” అడిగింది యాంకర్.

“ఏం… మార్కెట్లో పత్రికలు అమ్మడం లేదా?? ”

“నా ఉద్దేశం అదికాదండీ… రైటర్ అంటే మార్కెట్ ఉంటుందా? అని”

“విదేశాల్లో రైటర్లు కార్లలో తిరుగుతారు. మన రైటర్లు కూడా ఇప్పుడు బాగానే సంపాదిస్తున్నారు. టి.వి.కి, సినిమాలకు, పత్రికలకు రాసి బోల్డు సంపాదించవచ్చు…

“సో… మీరు భవిష్యత్తులో రైటర్ అవ్వాలనుకుంటున్నారు… ఆల్ ది బెస్ట్ అండీ.., ఇప్పుడు కెమెరా అనిరుద్ర వైపు తిరిగింది.

“మీరేం చేయాలనుకుంటున్నారండీ….” యాంకర్ అనిరుద్రను అడిగింది.

“చెప్తే నాకెంతిస్తారు?” అడిగాడు అనిరుద్ర. యాంకర్ షాకయ్యింది. ‘స్టాప్….’ అని అరిచింది కెమెరామెన్ వైపు చూసి.

“నాకర్ధం కాలేదు….” అంది అయోమయంగా.

“మీ ప్రోగ్రాంలో పాల్గొంటే నాకెంతిస్తారు? అని అడుగుతున్నాను”

“మేము ఇవ్వడమేమిటండీ… ఇది సరదాగా చేస్తున్న ప్రోగ్రామ్… మీ అభిప్రాయాలను ప్రేక్షకులు చూస్తారు. మిమ్మల్ని గుర్తుపడతారు”

“నా అభిప్రాయాలను ప్రేక్షకులు చూస్తే నాకు వచ్చే లాభం ఏమిటి? నన్ను గుర్తుపట్టడం వల్ల నాకు ఒరిగేదేమిటి? నేనేం సినిమాస్టార్ నో, బిజినెస్ మేన్నో, ఎట్లీస్ట్ డర్టీ పొలిటీషియన్ నో కాదు కదా…. అయినా ఈ ప్రోగ్రామ్ చేయడానికి మీరు యాంకరింగ్ కు డబ్బు తీసుకుంటున్నారు కదా….” అనిరుద్ర అడిగాడు.

“తీసుకుంటున్నాను”

“ఈ కెమెరామెన్”

“తీసుకుంటున్నాడు”

“క్యాసెట్ డబ్బు పెట్టే కొంటున్నారు కదా”

“అవును”

“షూటింగ్ కు, టెలికాస్ట్ కు, మీ కాస్ట్యూమ్స్ కు అన్నింటికీ డబ్బు ఖర్చవుతుంది కదా”

“అవును… అయితే ఏమిటి?

“ఈ డబ్బంతా ఈ ప్రోగ్రామ్ కోసమే కదా ఖర్చవుతోంది” “అవును”

“మరి ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్న మాకు డబ్బు ఎందుకు ఇవ్వరు?” అనిరుద్ర ప్రశ్న వేశాడు.

షాకవడం యాంకర్ వంతయ్యింది. ఇలాంటి రెస్పాన్స్ ఆమె ఊహించలేదు.

“సారీ అండీ… మేము కొన్ని ప్రత్యేకమైన ప్రోగ్రామ్స్ కు రెమ్యునరేషన్ పే చేస్తాం. అదీ మా చానెల్స్ యాజమాన్యం చేతిలో ఉంటుంది. అయినా మీ ప్రశ్న కొంత లాజికల్గా ఉంది. ఇంతకీ మీరేం చేస్తుంటారు?”

“చెప్పానుగా.. లాభం లేకుండా ఏ పనీ చేయాలనుకోవడం లేదు”

“ఈ బీచ్ కు రావడం వల్ల మీకు లాభం కలిగిందా?” అడిగింది యాంకర్.

“గుడ్ క్వశ్చన్… కలిగింది”

“ఎలాంటి లాభం?”

“ఈ బీచ్ కి రావడం వల్ల నా మనసు ప్లెజెంట్ గా ఉంటుంది. మానసికమైన లాభం… కరెన్సీ రూపంలో కాకుండా మానసికమైన ఆనందం రూపంలో వచ్చే లాభం అది…”

యాంకర్లో చిన్నపాటి యాంగ్జయిటీ. వెంటనే తన హ్యాండ్ బ్యాగ్ లో నుండి ఓ యాభై రూపాయల కాగితం తీసి అనిరుద్రకు ఇస్తూ, “ఇది నా పర్సనల్ అమౌంట్. అయినా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనిపించి ఇస్తున్నాను” అంది.

అనిరుద్ర ఆ యాభై రూపాయల కాగితం తీసుకొని యాంకర్వైపు చూసి, ‘ఎక్స్ క్యూజ్ మీ” ” అంటూ కార్తీక్ ని పిలిచి యాభై నోటు ఇస్తూ, “మిరపకాయ బజ్జీలు తీసుకురా” అని చెప్పాడు.

***

“మీరేం చేయాలనుకుంటున్నారో ఇప్పుడైనా చెప్పండి” అంటూ కెమెరా స్టార్ట్ చేయమంది యాంకర్.

అనిరుద్ర క్రాఫ్ సరిచేసుకోలేదు. మొహాన్ని కర్చీఫ్ తో తుడుచుకోలేదు. చాలా క్యాజువల్ గా చెప్పాడు.

“హౌస్ హజ్బెండ్ ని అవ్వాలని అనుకుంటున్నాను” “వ్వాట్…?” షాకింగ్ గా అడిగింది యాంకర్..

“యస్… హౌస్ హజ్బెండ్ ని అవ్వాలని అనుకుంటున్నాను”

“నేనడిగేది మీరే ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారు? అని” యాంకర్ రెట్టించి అడిగింది.

“హజ్బెండ్ జాబ్… భర్తగా జాబ్ చేసి జీతం తీసుకుంటాను” కామ్గా చెప్పాడు అనిరుద్ర.

“భర్తగా జాబ్ చేయడమేంటి?” విస్మయంగా అడిగింది యాంకర్..

“హౌస్ వైఫ్ ఎలానో…. హౌస్ హజ్బెండ్ అలా… కాకపోతే నేను శాలరీ బేసిస్లో పని చేయాలనుకుంటున్నాను… త్వరలో దీనికి సంబంధించిన ఓ ప్రకటన కూడా పేపర్లలో ఇద్దామనుకుంటున్నాను… దట్సాల్… థాంక్యూ…”

****

కార్తీక్ మిరపకాయ బజ్జీలు తీసుకొచ్చాడు. ఆ మిరపకాయ బజ్జీలు వున్న పొట్లం విప్పి యాంకర్ ముందు పెట్టి, “తీసుకోండి… స్పైసీ బట్ టేస్టీ” అన్నాడు అనిరుద్ర.

యాంకర్ ఓ మిరపకాయ బజ్జీని నోట్లో పెట్టుకుంది. కళ్లల్లోంచి నీళ్ళోచ్చాయి.

అనిరుద్ర మిరపకాయ బజ్జీలను ఇష్టంగా తింటున్నాడు. కార్తీక్ కెమెరామెన్ కు మిరపకాయ బజ్జీలు ఇచ్చాడు.

****