అమ్ము ఇంకా ఏమి మారలేదు 301

“మీకెందుకు సార్ శ్రమ. నేను నా రూముకు వెళ్లిపోతాను” అన్నాడు మహేష్.
“నువ్వింకేం మాట్లాడకు. మా అమ్మాయి చెప్పినట్లు చెయ్యి” అన్నాడు ఆర్డర్ వేస్తున్నట్లుగా.
చేసేదేమి లేక నిస్సహాయంగా అమృత వైపు చూశాడు మహేష్. “హయ్యో… పాపం ” అన్నట్లుగా మహేష్ వైపు చూసింది అమృత.
“సార్ నేను చెప్పేది ఒకసారి వినండి”
“అమృత ఇతడు ఇలాగే అంటుంటాడు గానీ పద” అన్నాడు అమృత వైపు చూసి.
అక్కడినుండి మహేష్ చేయి అందుకుని చిన్నగా నడిపించుకుంటూ బయటకి వచ్చారు. పార్కింగ్ లో ఉన్న అతడి కారుని చూసి డ్రైవర్ కి రమ్మని సైగ చేశాడు. డ్రైవర్ వెంటనే కారులో వాళ్ల ముందుకి వచ్చేశాడు. ముందు మూర్తి ఎక్కి ఆ తరువాత మహేష్ ని రమ్మని పిలిచాడు.
“నేను ఫ్రంట్ సీట్లో కూర్చుంటాను సార్” అంటూ డోర్ తెరవబోయాడు.
వెంటనే అతడిని ఆపి “మరేం పర్లేదు వెనకాలే కూర్చో” అంది అమృత.
“నువ్వేమి మొహమాట పడకు” అన్నాడు మూర్తి.
అమృతని ఒకసారి చూసి కారులోకి ఎక్కాడు మహేష్. వెనకలే అమృత ఎక్కి మహేష్ పక్కన కూర్చుంది. మహేష్ కి కుడి వైపు మూర్తి, ఎడమ వైపు అమృత కూర్చున్నారు. అప్పుడప్పుడూ అమృతని చూస్తున్నాడు మహేష్. కానీ అమృత మాత్రం తననే చూస్తోంది. చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది మహేష్ కి అమృత అలా చూస్తుంటే. మూర్తి వాళ్లింటికి వెళ్లాలంటే అరగంట సమయం పడుతుంది. ఇక్కడ మహేష్ కి ఒక్క క్షణం ఒక యుగం లాగా ఉంది. చిన్నగా అతడి ఎడమ చేతి మీద చేయి వేసి ఆమె వేళ్లతో అతడి వేళ్లను బంధించినట్లు పట్టుకుంది అమృత. కరెంట్ షాక్ కొట్టిన వాడిలాగ ఉలిక్కిపడ్డాడు మహేష్. అతడు ఉలిక్కి పడగానే “ఏమైందయ్యా?” అంటూ అడిగాడు మూర్తి. అమృత చేయి పట్టుకున్నట్లు కనిపించట్లేదు మూర్తికి.
“అబ్బే ఏమి లేదు సార్”
కుడి చేతికి కట్టు కట్టి ఉండడం వలన ఆమె చేతితో పోరాడలేక పోతున్నాడు.
“ప్లీజ్ నా చేయిని వదలండి మేడం” అన్నాడు అమృతకు మాత్రమే వినిపించేట్టుగా.
“మేడం ఏంటి? నన్ను ఎప్పటిలాగ పిలిస్తే వదిలేస్తా” అంది మహేష్ లాగే.
“ఇప్పుడు మీరు నా బాస్ కూతురు”
“అందుకే అడుగుతున్నాను”
“ప్లీజ్ నా జీవితం తో ఆడుకోకండి”
“ప్రపంచం చాల చిన్నది కదా”
“అందరూ అంటుంటే విన్నాను. కానీ నాకూ ఇప్పుడే అర్థం అయ్యింది”
“ఏమని?” అంది నవ్వుతూ.
“ఇంత చిన్న ప్రపంచంలో నాకు గాలి కూడా ఆడట్లేదని”
అలా అనగానే గట్టిగా నవ్వింది అమృత.
ఆమె అలా నవ్వగానే “ఎమైందమ్మా?” అని అడిగాడు.
“ఏమి లేదు డాడీ. మహేష్ మిమ్మల్ని తిట్టుకుంటున్నాడు”
“ఏంట్రా? నన్నే తిట్టుకుంటున్నావా?”
“అబ్బే లేదు సార్” అన్నాడు.
“వీడు ఇలాగే అంటాడూ కానీ నువ్వు చెప్పమ్మా” అన్నాడు కూతురి వైపు చూస్తూ.
తను ఏమి చెబుతుందోనని భయపడుతున్నాడు మహేష్.
అంతలో అమృత “ఏమి లేదు డాడీ హాస్పిటల్లో మిమ్మల్ని చూసి మెడిసిన్స్ మర్చిపోయాడంట” అంది.
“అవును నేను మర్చిపోయాను” అన్నడు మూర్తి.
“మరేం పర్లేదు డాడీ మన రాఘవ్ అంకుల్ ని అడిగి తెచ్చుకుందాం” అంది అమృత.
“థ్యాంక్స్” అన్నట్లు అమృత వైపు చూశాడు మహేష్.
మహేష్ పరిస్థితి చూసి నవ్వుకుంది అమృత.
“ఏమైతేనే? నువ్వు ఇవ్వాళ చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నావ్ నాకు” అన్నాడు మూర్తి అమృతతో.
“అదేంటి సార్?” అన్నాడు మహేష్ ఆశ్చర్యంగా.
“నిజమేనయ్యా…నా కూతురు తిరిగొచ్చి నెల రోజులవుతోంది. ఇప్పటివరకూ నవ్వింది కానీ ఆ నవ్వులో ఇంతకు ముందు ఉన్న వెలుగు లేదు. మళ్లీ నీవల్లే ఆ నవ్వు వచ్చింది” అన్నాడు మూర్తి.
“మహేష్ ని చూడగానే చాలా ప్రశాంతంగా ఉంది డాడీ” అని మహేష్ కి దగ్గరగా జరిగి “నీవల్లే ఆ నవ్వు దూరమయ్యిందని చెప్పు. ఏం జరుగుతుందో చూద్దాం” అంది గుసగుసగా.
మహేష్ కళ్లలో నీళ్లు తిరిగాయి.
ఇంతలో కారు మూర్తి ఇంటి దగ్గర ఆగింది.
కాలింగ్ బెల్ కొట్టాడు మూర్తి. డోర్ తీయగానే చేతికి కట్టుతో ఉన్న మహేష్ ని చూసి గాయత్రి “ఏమైంది మహేష్ కి?” అని అడిగింది.
“నీకు కూడా తెలుసా మహేష్?” అంది అమ్మను చూసి.
“నాకు తెలియక పోవడం ఏంటి? మీ నాన్నను ఆక్సిడెంట్ నుండి కాపాడాడు కదా?” అంది.
“అవన్నీ తరువాత బయటే నిలబెడతావా ఏంటి?” అన్నాడు మూర్తి భార్య వైపు చూసి.
“ఎంత మాట?” అంటూ మహేష్ ని లోపలికి తీసుకెళ్లింది గాయత్రి.
“వొద్దు అన్నా వినకుండా సార్, మేడం భయపెట్టి తీసుకొచ్చారు. మీరైనా చెప్పండి మేడం” అన్నాడు గాయత్రి వైపు చూసి.
“సంతోషించు. మేము ఇంకా భయపెట్టాం. మీ మేడం అయితే కొట్టి మరీ తీసుకొచ్చేది” అన్నాడు మూర్తి.
“నిజమే” అంది గాయత్రి.
“అదేంటి మేడం”