అమ్ము ఇంకా ఏమి మారలేదు 299

మై డియర్ స్టాఫ్ మెంబర్స్, పే అటెన్షన్” అంటూ వచ్చాడు అమృత గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎం.డి. అందరూ లేచి నిలబడ్డారు.
“టుడే ఐ యాం గోయింగ్ టు ఇంట్రొడ్యూస్ మై వన్ అండ్ ఓన్లీ డాటర్ అండ్ ది మేనజింగ్ డైరెక్టర్ ఆఫ్ అవర్ ఇండస్ట్రీస్ మిస్ అమృత” అంటూ తన కూతురిని పిలిచాడు.
అందరూ చూస్తుండగా ఒక అమ్మాయి బ్లూ కలర్ చుడిదార్ లో దర్శనం ఇచ్చింది. చూడడానికి చాలా అందంగా ఉంది. తనని చూస్తే మూగవాడు కూడా కవితలు చెప్పేస్తాడు. అంత అందంగా ఉంది తను. ఆఫీస్ లో ఉన్న అమ్మాయిలకు ఈర్ష్య కలిగిస్తూ, అబ్బాయిలకు బాధను కలిగిస్తూ తను అలా నడుచుకుంటూ వెళుతూ తన డాడీ పక్కన నిలబడింది.
“ఇక నుండి నా కూతురు కూడా మన ఆఫీస్ పనులు చూసుకుంటుంది” అన్నాడు కృష్ణమూర్తి.
“ఇంతకాలం మీ కూతుర్ని పరిచయం చేయకపోవడానికి గల కారణం ఏంటి సార్?” అంటూ అడిగాడు మేనేజర్ గిరిధర్.
“దానికి పెద్ద రహస్యాలు అంటూ ఏమి లేవండి. నేనే నా ఎం.బి.ఏ కోర్స్ పూర్తయ్యేదాకా వద్దు అని చెప్పాను” అంటూ బదులిచ్చింది. ఆ మాటలు వింటే చెవిటివాళ్లు చాలా దురదృష్టవంతులు అనిపిస్తుంది ఎవరికైనా.
తన కూతురికి స్టాఫ్ మెంబర్స్ అందరినీ పరిచయం చేస్తున్నాడు కృష్ణమూర్తి. అందరినీ పరిచయం చేశాడు కానీ ఒక్క వ్యక్తిని పరిచయం చేయలేదు. అతడే అసిస్టెంట్ మేనేజర్ సాయి మహేష్. అతడి గురించి మేనేజర్ ను అడిగాడు.
“ఇంకా రాలేదు సార్” అంటూ బదులిచ్చాడు గిరిధర్.
“వీడికి ఆఫీస్ కన్నా సమాజమే ఎక్కువ” అంటూ నసిగాడు కృష్ణమూర్తి.
“ఏమైంది డాడీ”
“ఏం లేదు మేడం అసిస్టెంట్ మేనేజర్ మహేష్ ఇంకా రాలేదు. అందుకు సార్ కి కోపం వచ్చింది” అంటూ చెప్పాడు మేనేజర్.
“కొపం ఏమి కాదమ్మా. మహేష్ వట్టి అమాయకుడు. ఎవరైనా కష్టాల్లో ఉంటే తట్టుకోలేడు. అలాంటివారి పైన కోపం ఎందుకు ఉంటుంది?”
“నిజమే ప్రేమ ఉంటుంది వీలైతే పెరుగుతుంది” అంటూ తండ్రికి వంత పాడింది.
“తండ్రికి తగ్గ కూతురు. మహేష్ భలే ఛాన్స్ పట్టేశావ్” అంటూ మనసులోనే మహేష్ ని తిట్టుకోసాగాడు.
“ఆ మహేష్ ని ఒకసారి చూడాలి డాడీ”
“ఎక్కడికి పోతాడమ్మా? ఇక్కడికే వస్తాడు కదా. ఎంత లేట్ అయినా ఆఫీస్ కి వచ్చి పోవాలి అని వాడికి ఆర్డర్ వేశాను”
“ఎందుకు?”
“ఎందుకేమిటి? వాడ్ని చూడకపోతే నాకు కాళ్లు చేతులు ఆడవు. వాడు నాకో వ్యసనం”
“మీరు మాత్రం వాడ్ని నమ్ముకుంటే నాశనం” మాళ్లీ గొణుక్కున్నాడు గిరిధర్.
“వావ్…! మీరు సర్టిఫికేట్ ఇచ్చారంటే ఖచ్చితంగా చూసి తీరాలి”
“అలాగే పదమ్మా. నా చాంబర్ చూపిస్తా”
వారిద్దరితోపాటు మేనేజర్ గిరి కూడా కదలబోతుంటే మూర్తి అతడ్ని ఆపి “ఇక మీరు వర్క్ లోకి వెళ్లండి గిరిధర్” అని అతడ్ని పంపించేసి కూతురితోపాటు అతడి చాంబర్ వైపు కదిలాడు.
ఇద్దరూ చాంబర్ లోకి వెళ్లిపోయారు. ఇద్దరూ పిచ్చాపాటి మాట్లాడుకునే సరికి లంచ్ టైం అయ్యింది. కృష్ణమూర్తి అతడి టెలిఫోన్ రిసీవర్ తీసుకుని ఏదో డయల్ చేసి “గిరి కం టు మై చాంబర్” అని ఆర్డర్ వేశాడు.
“ఓకే సార్” అంటూ రెస్పాన్స్ ఇచ్చాడు గిరి.
అర నిమిషంలో తన దగ్గరికి వచ్చాడు గిరి.
“ఎస్ సార్”
“మహేష్ వచ్చాడా?”
“లేదు సార్”
“అతడి ఫోన్ నంబర్ ఏదైనా ఉందా?”
“ఒన్ సెకండ్ సార్” అంటూ రెసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్లి అతడి నంబర్ తెచ్చాడు.
“దిస్ ఈజ్ హిస్ నంబర్ సార్” అంటూ మూర్తికిచ్చాడు.
ఆ నంబర్ తీసుకుని తన మొబైల్ ఫోన్ నుండి డయల్ చేశాడు. కాసేపు రింగ్ అయిన తరువాత అటువైపు ఒక ఆడ గొంతు “హలో” అని వినిపించింది మూర్తికి.
“అక్కడ మహేష్ ఉన్నాడా?” అడిగాడు ఆమెను.
“అతడికి ఆక్సిడెంట్ అయ్యింది. ప్రస్తుతం స్పృహలో లేడు. మీరు కాసేపు ఆగి ఫోన్ చేయండి”
“ఆక్సిడెంటా? ఎక్కడా? ఏ హాస్పిటల్ లో ఉన్నాడు?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు మూర్తి. తండ్రి కంగారు చూసి అమృత కూడ కంగారు పడసాగింది.
“కంగారు పడాల్సిన అవసరం లేదు. హి ఈజ్ ఔట్ ఆఫ్ డేంజర్” అంది.