అమ్ము ఇంకా ఏమి మారలేదు 301

“ఇంతకీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు?” అదే కంగారుతో మాట్లాడుతున్నాడు మూర్తి.
“గవర్నమెంట్ హాస్పిటల్ లో ఉన్నాడు” అంది.
“మీరెవరు?” అంటూ ప్రశ్నించాడు మూర్తి.
“నేను ఇక్కడే పని చేస్తున్న నర్స్ ని” అంది.
వెంటనే కాల్ కట్ చేసి తన కూతురికి మళ్లీ వస్తానని చెప్పి వెళ్లబోయాడు.
“ఏమైంది డాడీ?”
“మహేష్ కి ఆక్సిడెంట్ అయ్యిందంటా”
“అయ్యో!”
“కంగారు పడాల్సిన పనిలేదు. బాగానే ఉన్నాడట. నేను వెళ్లి ఒకసారి చూసి వస్తాను” అంటూ కదలబోయాడు.
“ఆగండి డాడీ నేను వస్తాను” అంటూ వచ్చింది అమృత.
“గిరి…. డ్రైవర్ కి కాల్ చేసి కార్ తీయమని చెప్పు” అంటూ తన కూతురితో సహా బయలుదేరాడు మూర్తి.
కార్లోకి ఎక్కి “గవర్నమెంట్ హాస్పిటల్ కి పోనివ్వు” అంటూ డ్రైవర్ కి చెప్పాడు.
ఏ.సి కార్లో కూడా తండ్రికి పడుతున్న చెమటలు చూసి “అతడికి ఏమి అవ్వదు డాడీ. హి విల్ బి ఆల్ రైట్” అంటూ తండ్రి చేతి పై తన చేయి వేసి ధైర్యం చెప్పింది.
“నీకు తెలీదమ్మా. ఇలాగే ఒకసారి నాకు జరగాల్సింది. నన్ను కాపాడి వాడు వారం రోజులు మంచం పై ఉండిపోయాడు. వాడు కానీ లేకపోయి ఉంటే మీ నాన్న నీకు ఉండేవాడు కాదు” అంటూ తన కళ్లలో తిరుగుతున్న నీళ్లను కర్చీఫ్ తో తుడుచుకున్నాడు.
“ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు?”
“నువ్వు లక్నోలో చదువుకుంటున్నావు. నీకు చెప్పి నీ స్టడీస్ డిస్ట్రబ్ చేయడం ఇష్టం లేక చెప్పలేదు బంగారం” అన్నాడు.
కారు పది నిమిషాలలో గవర్నమెంటు హాస్పిటల్ కు చేరుకుంది. కారు దిగి వడివడిగా నడుచుకుంటూ వెళ్తున్న తండ్రితో పాటు నడవలేక పోతోంది అమృత. అతడు ఎంట్రెన్స్ లోకి వెళ్లగానే అతడికి ఎదురుపడ్డాడు మహేష్. చేతికి కట్టుతో, చిన్నగా కుంటుతున్నాడు. పరుగులాంటి నడకతో అతడి దగ్గరకు వెళ్లి కౌగిలించుకున్నాడు మూర్తి.
“మీరేంటి సార్ ఇక్కడ?” అంటూ మూర్తిని పలకరించాడు మహేష్.
“నీకెలా ఉంది?”
“నాకు బాగానే ఉంది సార్”
“అయినా ఎక్కడికీ వెళ్తున్నావ్?”
“వాళ్ల బాస్ కాల్ చేశాడని బయలుదేరాడు. మేము కదలకూడదు ఎంత చెబుతున్నా వినడంలేదు” అంటూ చెప్పింది పక్కనే ఉన్న నర్స్.
అక్కడ జరుగుతున్నదంతా తండ్రి వెనకాల నడుచుకుంటూ వస్తున్న అమృత చూస్తోంది. కానీ తనకి తండ్రి అడ్డుగా ఉండటం వలన మహేష్ ఆమెకు కనిపించడం లేదు.
“మీరెందుకు వచ్చారు సార్ ఇక్కడికి?” మహేష్ మళ్లీ అడిగాడు అతడి బాస్ ని.
“నీకోసమే వచ్చాను”
“నాకోసం మీరు రావడం ఏంటండి? మీరు వేసిన ఆర్డర్ నాకు గుర్తుంది”
“నేనే కాదు నిన్ను చూడటానికి నా కూతురు కూడా వచ్చింది” అంటూ అమృతను చూపించాడు.
అమృతను చూడగానే షాక్ లో ఉండిపోయాడు మహేష్. మహేష్ ని చూసిన అమృత పరిస్థితి కూడా అంతే. ఇద్దరికీ నోట మాట రాలేదు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ అలా ఉండిపోయారు.

మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ నడుచుకుంటూ వస్తోంది అమృత. ఆమె షాక్ నుండి కోలుకోవడానికి చాలా తక్కువ సమయమే పట్టింది. కానీ మహేష్ మాత్రం ఇంకా షాక్ నుండి తేరుకోలేదు. అమృత ముఖంలో చిన్నగా నవ్వు స్టార్ట్ అయ్యింది. అది గమనించిన మహేష్ భూమి కంపించినంతగా వణికిపోసాగాడు. తను అలా నడుచుకుంటూ వచ్చి “హాయ్ మహేష్ గారు” అని చేయి చాపింది.
అతడు ఇంకా షాక్ నుండి తేరుకోలేదు. అది గమనించిన అమృత తనలో తానే నవ్వుకొని మళ్లీ “హాయ్ మహేష్ గారు” అంది. కానీ ఆమెకు చేతిని అందించే పరిస్థితిలో అతను లేడు (ఎందుకంటే చేతికి కట్టు కట్టారు కాబట్టి). అప్పటికి అర్థమయ్యింది అమృతకి అతడిని ఎటువంటి పరిస్థితుల్లో చూసిందో. వెంటనే ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి.
“హాయ్ బట్ సారీ మేడం” అన్నాడు.
“అదేంటయ్యా హాయ్ చెబితే సారీ చెబుతున్నావ్?” అన్నాడు మూర్తి.
“తనకు చేయి అందించలేకపోతున్నందుకు సార్” అన్నాడు మహేష్.
అతడు అన్న మాటలు మూర్తికి ఒక రకంగా, అమృతకి ఇంకో రకంగా అర్థమయ్యాయి.
“దానికి నువ్వు మాత్రం ఏం చేస్తావ్? నీ పరిస్థితి అలాంటిది” అన్నాడు మూర్తి.
ఆ మాట అనగానే కొంచెం ధైర్యంగా అమృత వైపు చూశాడు మహేష్. అతడి చూపులను అర్థం చేసుకున్న అమృత వెంటనే “లేదు డాడీ ఎప్పటికైనా అతడి చేతిని అందుకుని తీరతా” అంది అమృత నవ్వుతున్న మహేష్ ని కోపంగా చూస్తూ.
“ఏంటమ్మా?” అన్నాడు మూర్తి.
“సార్ మీరు ఎక్కువ సేపు నిలబడకూడదు” అంది నర్స్.
“ఇప్పుడు అతడి పరిస్థితి ఏంటండి?” అని అడిగింది అమృత.
“వారం రోజులు రెస్ట్ తీసుకోవాలి”
“అప్పటివరకూ ఇక్కడే ఉండాలా?”
“అవసరం లేదు. కానీ అతడికి ఎవరు లేరు అన్నాడు కాబట్టి ఇక్కడే ఉండి తీరాలి”
“డాడీ మనం అతడిని మన ఇంటికి తీసుకెళదాం. అతడు ఎలాగూ ఆఫీస్ కి రాలేడు. మీరేమో అతడ్ని చూడకుండా ఉండలేరు. మనమే కేర్ తీసుకోవచ్చు” అంది అమృత మహేష్ ని చూస్తూ.
“నిజమేనమ్మా” అన్నాడు మూర్తి తన కూతురి ఆలోచనని మెచ్చుకుంటూ.
“మేము ఇతడ్ని మా ఇంట్లో జాగ్రత్తగా చూసుకుంటాం. వెంటనే డిశ్చార్జ్ చేయండి” అన్నాడు మూర్తి నర్స్ తో.
“అలాగే సార్” అంటూ ఆమె అక్కడి నుండి వెళ్లిపోయింది.