భ్రాంతి 2 177

‘సరే ఇప్పుడు వెళ్ళినా మళ్ళీ రేపు రావోయి, నీతో మాట్లాడాలి’ అని శైలు అంటే బ్రతుకు జీవుడా అని బయటపడ్డాడు కిరీటి. ఇల్లు దాటకముందే ప్రెసిడెంటు వచ్చి వాడ్ని వాటేసుకున్నారు. ‘అది నా ముద్దుల మేనకోడల్రా. ఏతన్నా ఐతే నా పానం పోయేది. లేకుంటే మా ఇల్లాలు నా పానం తీసేసేది. ఇంటి పనిమనిషి ముసిల్దిరా, నా బిడ్డకి తోడుగా ఓ మూడ్రోలు ఎవరన్నా సూడమను మీ అయ్యని. పనిమనిషిగా కాదు, ఓ తోడు అంతే’ అని వాడ్ని భుజం తట్టి పంపారు.

ఇంటికి వెళ్తుంటే కిరీటికి గోరు అక్క గుర్తుకు వచ్చింది. ఒక రెండు మూడు రోజులు ఇంట్లోనుంచి బయటకు వచ్చి వుంటే ఆమెకు కూడా మనశ్శాంతి కలుగుతుందేమో అడిగి చూద్దాం అని వాడి ఇంటి వైపు వెళ్ళాడు.

గోరు ఇంట్లో రాజన్న, రమణాచారి ఒక చోట కూర్చొని మాట్లాడుతున్నారు. నరసు గుమ్మం చాటున నుంచుని కళ్ళు ఒత్తుకుంటోంది. కిరీటి అక్కడికి వెళ్ళి ‘పిన్నీ, ప్రెసిడెంటు గారి మేనకోడలు ఊళ్ళో వుంది. వాళ్ళావిడ వచ్చేలోపు ఒక మూడు రోజులు అక్కని తనకి తోడుగా ఏమన్నా పంపిస్తావా?’ అని అడిగాడు.

‘అట్టాగేరా అయ్యా, ఆయమ్మికి దెబ్బ తగిల్నాదంటనే.. ఎట్లున్నాది?’

‘పెద్ద దెబ్బేమీ కాదులే పిన్నీ. ఏదో కొంచెం గీరుకుపోయింది అంతే. రక్తం చూసేసరికి అందరూ కంగారు పడ్డారు.’

‘ఆ గదిలో పరుండాది, తీస్కపో బిడ్డా’ అని లోపలికి వెళ్లబోతున్న వాడిని ఆపి ‘గోరు ఏడ వుండాడయ్యా’ అని మెల్లిగా అడిగింది.

‘రంగ దగ్గర వున్నాడు, ఏమీ పర్లేదు. వాడికి రంగ ointment కూడా ఏదో రాశాడు. రేపటికల్లా సర్దుకుంటాడు’ అని ఆమెని ఓదార్చి నిక్కుమాంబ గదిలోకి వెళ్ళాడు.

నిక్కుమాంబ ఏదో పుస్తకం చదువుకుంటోంది. కిరీటి శైలు విషయం టూకీగా చెప్పి ఒక రెండు మూడు రోజులు ఆమెకు తోడుగా వుంటుందేమో అని అడిగాడు. ‘శైలుకి దెబ్బ తగిలిందా, ఇదిగో వస్తున్నా వుండు. ఓ రెండు జతల బట్టలు తెచ్చుకోనీ’ అంటూ చదువుతున్న పుస్తకం పక్కన పెట్టి వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్లింది.

కిరీటి తన తండ్రి దగ్గరకు వెళ్దామని వెనుతిరిగాడు. ఏదో శబ్దం అయ్యి వెనక్కు చూస్తే నిక్కుమాంబ పుస్తకం కింద పడి వుంది. అనాలోచితంగా ఆ కింద పడిన పుస్తకాన్ని తీసి పైన పెడుతుంటే అందులోనుంచి ఒక ఉత్తరం బయటకు పడింది. దాన్ని తీసి పుస్తకంలో పెడుతున్న క్రమంలో అక్కడ వున్న పేరు చూసి కిరీటి గుండె దడదడలాడింది.

‘డియర్ నిక్కీ’ అంటూ ప్రారంభమయిన వుత్తరంలో మిగతా అక్షరాలేవీ వాడి కళ్ళకు ఆనలేదు. కళ్ళముందు ఏవో నక్షత్రాలు తిరుగుతున్నాయి మనవాడికి. నిక్కీ, తనకు మొదటి ముద్దు ఇచ్చిన అమ్మాయి, తనతో almost హద్దులు దాటి ముందుకు వెళ్లబోయిన అమ్మాయి… ఎవర్నైతే సునయనతో పాటు ప్రతిరోజూ కలల్లో చూస్తున్నాడో ఆ నిక్కీ తనను చిన్నప్పటినుంచీ తన తమ్ముడిలాగా చూసుకుంటున్న నిక్కుమాంబ యేనా!

ఒక trance లో వున్న వాడిలా ఇంటి బయటకు వచ్చి నుంచున్నాడు. నరసు నిక్కుమాంబతో కలిసి బయటకు వచ్చి ‘అమ్మిని కాస్త పెసిడెంటు గోరి ఇంటికాడ దిగబెట్టిరా బిడ్డా’ అని పంపించింది. కిరీటి తల ఎత్తి నిక్కీ వంక చూడలేకపోతున్నాడు. ఒకటి రెండు సార్లు ఆమె ఏదో అడిగితే ఊ, ఆ తప్పితే ఏమీ సమాధానం కూడా ఇవ్వలేకపోతున్నాడు.

ప్రెసిడెంటు గారి ఇంటికి చేరుకునే సరికి మంచి panic లో వున్నాడు. ఆ రోజు సంతలో జరిగిన విషయం అక్క దగ్గర ఎలా అవాయిడ్ చెయ్యాలో, ఒక వేళ ఆ టాపిక్ వస్తే ఏం మాట్లాడాలో తెలీక గింజుకుంటున్నాడు. నిక్కుమాంబ మళ్ళీ ఏదో అడిగింది. ఈ సారి కొంచెం తేరుకుని ‘ఆ ఏంటక్కా’ అన్నాడు.

‘నువ్వు నాతో సరిగ్గా ఎందుకు మాట్లాడట్లేదు అంటున్నానురా! ఇందాకట్నుంచి try చేస్తున్నాను. ఒక దానికి సమాధానం చెప్పవు. అంత కోపమారా నేనంటే. నేనేమీ వాడ్ని కొట్టించాలని చెయ్యలేదురా. అయ్య తాగివస్తాడని కల్లో కూడా అనుకోలేదు’ అంటూ కళ్ళు తుడుచుకుంటోంది. దెబ్బకి ఈ లోకంలోకి వచ్చి పడ్డాడు కిరీటి.

1 Comment

  1. Bro story superb ga undhi plzzz story madhyalo apakandi continue chyndi

Comments are closed.