రాత్రులు చాప్టర్ – 3 17

“ఆమె ఫోన్ చేసిందా ?” అని నేను గాయత్రి రాసిన స్లిప్ ని చూపిస్తూ అడిగాను.

ఏ భావమూ చూపించని ఆ అమ్మాయి కేవలం తల ఊపింది. “అవును, మార్కెట్ గురించి ఒక పుస్తకం రాయడం గురించి మీతో మాట్లాడాలని ఆమె అనుకుంటుంది. మీరు సాధారణంగా అలాంటి ఆఫర్లను ఒప్పుకోరని నేను ఆమెకు చెప్పాను, అయినా ఆమె దాని గురించి మీతో మాట్లాడాలని కోరుకుంది.”

“నాకు నమ్మాలని అనిపించడంలేదు !” అని నేను చెప్పాను.

“అవును, ఖచ్చితంగా,” అని గాయత్రి గుణుక్కుంది.

“నీకు కొంచెం కూడా ఆశ్చర్యం అనిపించలేదా ? నాకు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. అంటే, బహుశా అంత పేరున్న అమ్మాయి….. నన్ను కలవాలని అనుకోవడం !”

గాయత్రి తన డెస్క్ ని శుభ్రం చేస్తూనే ఉంది.

“బహుశా,” అని నేను క్షణం తర్వాత అన్నాను, “ఆమెకి మంచి సమయస్ఫూర్తి కూడా వున్నట్లుంది.”

“సమయస్ఫూర్తా ?”

“అవును,” అని నేను ఆమె గొంతుని అనుకరిస్తూ చెప్పను. “ఆమె మొదటి పేరు, నీకు తెలుసు కదా.”

అది, గాయత్రి ఆమె చేస్తున్న పనిని ఆపి నన్ను చూడటానికి తిరిగేలా చేసింది.

“మీరు సీరియస్ గానే అంటున్నారా, శ్రీకర్ గారూ ?”

“ఎందుకు అనకూడదు ?” అని నేను చెప్పాను. “నేను ప్రయత్నించడంలో తప్పేముంది ?”

అమ్మాయిల విషయానికి వస్తే నేను కొన్నిసార్లు తప్పులు చూస్తుంటానని ఒప్పుకోక తప్పదు. నేను ఇప్పుడు చూసిన అమ్మాయి ఫోన్ మెసేజ్, గాయత్రి ముందు చెప్పిన మాటని వెనక్కి తీసుకునేదానిలా చేసింది. నేను నా పందెం కోసం ఎలాంటి కష్టమైన పనైనా చేయడానికి రెడీగానే వున్నాను. మెసేజ్ పెట్టిన అమ్మాయి దేశవ్యాప్తంగా బాగా పేరున్న మనిషి. ఇప్పటికీ ఆమె పేరు అత్యున్నత వర్గాలలో, టీవీ లో, పత్రికల్లో కనిపిస్తూనే ఉంటుంది.

ఆమె నన్ను కలవాలని అనుకుందన్న వాస్తవం నన్ను ఆనందంలో ముంచెత్తింది – అయితే అది ఆమె వృత్తికి సంబంధించి బిజినెస్ కాల్ అని నాకు ఖచ్చితంగా తెలుసు – ఆ రోజు నేను కొండ పైన ఐరా అనే అమ్మాయితో ఒక అందమైన సంగమం జరపడం, ఇంతకుముందు చెప్పినట్లుగా, అది నా సమయస్ఫూర్తికి ఒక నిదర్శనం.

అయితే బహుశా నేను అంత కక్కుర్తి పడకుండా ఉండాల్సింది. ‘J’ పేరుతో వుండే అమ్మాయిలు ఎక్కువమంది ఉంటారని అనుకోవచ్చు. నాకు తెలిసిన చాలా మంది అమ్మాయిల్లో జయ, జ్యోతి లాంటి కామన్ పేర్లు చాలా వున్నాయి; ఒకవేళ నేను ఆ అమ్మాయితో ఫెయిల్ అయితే, నాకు ‘J’ లతో పేర్లు మొదలయ్యే అమ్మాయిల లిస్ట్ చాలానే వుంది అన్న ఆలోచన నాకు బలాన్ని ఇచ్చింది. అయితే గాయత్రితో నా ఉద్దేశ్యాన్ని చెప్పిన తర్వాత, నేను ఫెయిల్ అవకుండా నా వంతు ప్రయత్నం చేయవలసి వచ్చింది.

ఆమెకి పేరుప్రఖ్యాతలు ఎక్కువగా ఉండడం వల్ల, తనని నాదారి లోకి తెచ్చుకోవడానికి నాకు చాలా విచక్షణ అవసరం. మా సంగతి బయటపడితే అదొక పెద్ద వార్త అవుతుంది. వాళ్ళ కుటుంబసభ్యులు అందుకు ఎలా రియాక్ట్ అవుతారో ఊహించడం చాలా కష్టం అవుతుంది. అయితే ఈ పేరుప్రఖ్యాతలు ఉన్నవాళ్ళకి రకరకాల సంబంధాలు వున్నాయి అనే పుకార్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. వాటిని పట్టించుకోవాల్సిన అవసరంలేదు. ఆ అమ్మాయి పేరు చెప్పకుండా ఉంటే సరిపోతుంది. అందుకే ‘J’ అక్షరంతో మొదలయ్యే ఆమె పేరుని నేను ఇక్కడ చెప్పడంలేదు.

గాయత్రిని చేజిక్కించుకోవడానికి, ఈ అమ్మాయిని నా తర్వాతి అడుగుగా మార్చుకోవడానికి, నా ఆకర్షణ, మగతనం మాత్రమే సరిపోదని నాకు తెలుసు. ఈ అమ్మాయి ఏదో పల్లెటూరు నుండి నగరానికి వచ్చి, ఒక అపరిచితుడి ఆకర్షణకి పడిపోయే ఐరా లాంటి అమ్మాయి కాదు. నా అమ్మాయిల వీక్నెస్ గురించి ఇప్పటికే చాలామందికి తెలిసిపోయింది. అలాంటిది ఆమె సహజంగానే నా దగ్గర తన టచ్ మీ నాట్ స్వభావాన్ని, సమాజంలో తాను జాగ్రత్తగా కాపాడుకుంటున్న పేరుని కాపాడుకోవడానికే చూస్తుంది. నేను అది దాటాల్సి వస్తుంది. ఇది నిజంగా నాకొక సవాలు.

నా మొదటి అడుగు ఏమిటంటే – వెంటనే ఏమీ చేయకపోవడం – అంటే, ఆమె ఫోన్ కాల్ కి తిరిగి సమాధానం ఇవ్వకపోవడం. అది ఒకరకంగా రిస్క్ తీసుకోవడమే అవుతుంది అయితే పెద్ద రిస్క్ కాదు; ఆమె మళ్ళీ ఫోన్ చేస్తుందని నాకు చాలా ఖచ్చితంగా తెలుసు. ఆమె మరుసటి రోజు ఫోన్ చేసింది. నిజానికి ఆమె సెక్రటరీ ఫోన్ చేసింది. గాయత్రి నేను లేనప్పుడు తీసుకున్న అదే మెసేజ్ లాంటిదే చెబుతూ, ప్రస్తుత ఆర్థిక సంక్షోభం మీద నా ఆలోచనలని తెలియజేసే ఒక పుస్తకం రాసే అవకాశాన్ని నాతో చర్చించడానికి ఆమె Boss ఆసక్తిగా ఉందని చెప్పింది. అలాంటప్పుడు ఆమె యజమానే తనంతట తాను నాకు ఎందుకు ఫోన్ చేయలేదని నేను ఆమెని అడిగాను. ఆమె కొంచెం కోపంగా, తన Boss చాలా బిజీగా వుండే అమ్మాయి అని, మా మీటింగ్ లో మాట్లాడుకోవాల్సిన విషయాల గురించి చర్చించుకోవడానికి ఒక లంచ్ మీటింగ్ ని ఏర్పాటు చేస్తానని చెప్పింది. నేను కూడా అంతే కోపంగా, నేను కూడా బిజీగా వుండే మనిషినని, నేను ఎప్పుడూ మూడో వ్యక్తి ద్వారా ఇన్విటేషన్ లని ఒప్పుకోనని చెప్పి, నేను ఫోన్ పెట్టేశాను.

రెండు రోజులు గడిచిపోయాయి, మళ్ళీ ఎలాంటి ఫోన్ రాలేదు, నేను నా అవకాశాన్ని పోగొట్టుకున్నానేమో అని భయపడ్డాను. అయితే అప్పుడు ఇంకొక ఫోన్ వచ్చింది, ఆమె సెక్రటరీ ఇంకా నా సెక్రటరీ మధ్య కొన్ని మాటలు అయ్యాక, ఆ అమ్మాయి సుపరిచితమైన గొంతు విందాం కోసం నేను ఫోన్ తీశాను.

“మిస్టర్ శ్రీకర్ ?”

“హాయ్,” అని నేను చెప్పాను.

“మీరు ఎలా ఉన్నారు ?” అని ఆమె అడిగింది. “మిమ్మల్ని పట్టుకోవడం చాలా కష్టం.”

“అదేం లేదు,” అని నేను చెప్పాను. “కానీ మీకు తెలుసు కదా ఎలా ఉంటుందో. చాలా ఫోన్ కాల్స్…”

ఒక నిశ్శబ్దం ఏర్పడింది. స్పష్టంగా, ఆమె ఎవరికైనా ఫోన్ చేస్తే వాళ్ళు వెంటనే తిరిగి గౌరవంగా కాల్ చేస్తారనే విషయానికి – ఆమె అలవాటు పడింది. ఆ గౌరవాన్ని వదిలి, ఆమెని ఇతరులలాగే చూస్తాను అని అనుకునేలా చేయాలనేది నా ఆలోచన. లేదా కాకపోవచ్చు. ఆ విషయంలో మళ్ళీ ఇంకో పందెం వేసుకోవచ్చు, ఎందుకంటే మీకు తెలుసు కదా, నేను ఒక జూదగాడిని.

“నిజమే,” అని ఆమె అంది. “మిస్టర్ శ్రీకర్, నా సెక్రటరీ మీకు చెప్పినట్లు, ఆర్థిక రంగంలో మీ నైపుణ్యాన్ని ఉపయోగించుకుని, మా కోసం ఒక పుస్తకం రాయాలని మేము అనుకుంటున్నాము. అది మీ ప్రతిష్టకు కూడా చాలా ఉపయోగకరంగా, ఒకవేళ అది…”

“OK, థాంక్స్,” అని నేను మధ్యలో అన్నాను. “అయితే మీకు తెలిసే ఉంటుంది, నాకు ఇంతకు ముందు కూడా ఇలాంటి ఆఫర్లు వచ్చాయి, అయితే ఎప్పుడూ నా నిబంధనలు, సలహాలు, సూచనలు వాళ్ళ ప్రయత్నాలకి తోడవుతాయని నాకు అనిపించలేదు. అదీగాక నేను కొంచెం బద్ధకస్తుడిని, మీకు తెలుసా కదా, నేను నిజంగా…”

“నా కంపెనీ మీరు చెప్పే నిబంధనలను ఒప్పుకోవడానికి రెడీగా ఉంది,” అని ఆ అమ్మాయి కొంచెం చల్లగా చెప్పింది. “మనం ఒక సంతృప్తికరమైన ఒప్పందానికి చేరుకుంటామని నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది, మిస్టర్ శ్రీకర్. మనం భోజన సమయంలో కలిసి ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడుకోకూడదు ?”

“OK, నాకు కుదురుతుందని అనుకుంటున్నాను,” అని నేను అయిష్టం నటిస్తూ అన్నాను.

“మంచిది. రేపు కలుద్దామా ? కృష్ణా ఒబెరాయ్ ?”

“రేపు నేను బిజీగా వుంటాను,” అని నేను అబద్ధం చెప్పాను. “గురువారం అయితే ఎలా ఉంటుంది ? వద్దు, ఆరోజు కూడా కష్టమే. శుక్రవారం ?”

మరో నిశ్శబ్దం. “సరే,” అని ఆమె అంది. “శుక్రవారం. నేను అక్కడ మిమ్మల్ని కలుస్తాను.”

మా మొత్తం సంభాషణని వింటున్న గాయత్రి, ఎప్పటిలాగే నిర్వికారంగా తన కంప్యూటర్ తో బిజీగా ఉంది. “ఆమె నన్ను తిట్టుకుంటుంది,” అని నేను సంతోషంగా చెప్పాను. “Good Start, మీకు అలా అనిపించడం లేదా ?”

“మీరు ఏమి చేస్తున్నారో మీకు తెలుసని నాకు ఖచ్చితంగా తెలుసు, శ్రీకర్ గారూ,” అని ఆమె అంది.

“OK, నాకు తెలియదు,” అని నేను అన్నాను. “అయితే నేను ఏదో ఒకటి చేయాలి. అందరూ ఆమె కోసం తమ సమయాన్ని వదులుకుంటారనేదానికి ఆమె బాగా అలవాటు పడింది, అందువల్ల ఇది ఆమెను కిందకి పడేలా చేస్తుందని అనుకుంటున్నాను.”

“ఇంకోరకంగా చెప్పాలంటే ఆమె మిమ్మల్ని కింద పడేలా కూడా చేయొచ్చు,” అని గాయత్రి గుణుక్కుంది.

“అది కూడా నిజమే,” అని నేను ఒప్పుకున్నాను, “అయితే ఆమె చాలా విలువైంది. మీరు కూడా.”

గాయత్రి నోరు కొంచెం వణికింది, అది ఒక నవ్వు లోని ఆలోచన యొక్క ప్రారంభం కావచ్చు. “మీరు ఆమెని, ఇంకొకరిని పొందడానికి ఆమెని కేవలం ఒక మెట్టుగా ఉపయోగించుకుంటున్నారని తెలిస్తే ఆ అమ్మాయి చాలా సంతోషపడుతుందని నాకు ఖచ్చితంగా తెలుసు,” అని ఆమె చెప్పింది.

“అలా జరిగితే, ఆ ఇంకొకరి జీతం మూడు రెట్లు పెరగకుండా ఆగిపోతుంది, అది మర్చిపోవద్దు” అని నేను చెప్పాను.

“నేను ఆ సంగతి మర్చిపోలేదని మీకు మాట ఇస్తున్నాను,” అని గాయత్రి సమాధానమిచ్చింది.

నేను ఆమెను చూసి నవ్వాను. “ఏమైనా, ఆ అమ్మాయి నా కోసం ఏమి చేస్తుందో అడగొద్దు. నేను ఆ అమ్మాయి కోసం ఏమి చేయగలనో అడగండి !” అని నేను అన్నాను.

***

ఆ అమ్మాయి, నిజానికి, తన యవ్వనంలో లేదు, కానీ సంవత్సరాలు ఆమె అందాన్ని తగ్గించడంలో చాలా తక్కువ గా పని చేశాయి. అవి వసంతకాలపు తాజాదనాన్ని తీసివేసినప్పటికీ, ఆమె చక్కని లక్షణాలకి ఒక బలం, వ్యక్తిత్వాన్ని కలపడం వల్ల భర్తీ చేశాయి, అది ఆమెని ఎప్పటిలాగే అద్భుతంగా చేసింది. ఆమె శరీరం ఇప్పటికీ సన్నగా, దృఢంగా కనిపించింది, దాని Maintenance కోసం చాలా సమయం, బహుశా డబ్బు కూడా ఖర్చు పెట్టి ఉంటుందని అనిపించింది. ఆమె చుట్టూ ఒక అందమైన వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది, నేను అక్కడ కూర్చున్నప్పుడు అదంతా చూసి మంత్రముగ్దుడ్ని అవకుండా ఉండటానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.

“మిస్టర్ శ్రీకర్, వచ్చినందుకు థాంక్స్,” అని ఆమె మా పరిచయం అయ్యాక చెప్పింది. “మనం కలిసి పని పూర్తి చేయగలమని నేను అనుకుంటున్నాను. ప్రస్తుత ఆర్థిక సంక్షోభం మీద మీ అభిప్రాయాలను తెలిపే ఒక పుస్తకం రాయడం మా కంపెనీకి చాలా విలువైన ఆస్తి అవుతుందని అని నా అభిప్రాయం.”

నేను భుజాలు ఎగరేసాను. “హే, నేను అంత పెద్ద నిపుణుడిని ఎలా అయ్యానో నాకు తెలియదు. నేను ఒక విజయవంతమైన కంపెనీని వారసత్వంగా పొందాను, దానిని దిగజార్చకుండా చూసుకుంటున్నాను అంతే.”

ఆమె నవ్వింది. “మీరు చాలా వినయంగా ఉన్నారు,” అని ఆమె అంది. “ఆర్థిక వర్గాలలో మీ పేరు బాగా తెలుసు, సరైన ప్రమోషన్ తో అలాంటి పుస్తకం…”

“నేను అలా అనుకోవడంలేదు,” అని నేను అన్నాను.

“సారీ ?”

“నేను ఒక పుస్తకం రాయాలని అనుకోవడం లేదని చెప్పాను. చూడండి, ఇది నాకు ఎప్పుడూ జరుగుతుంది. నేను రచయితను కాదు, వ్యాపారవేత్తను, అది కూడా నా ఇష్టం లేకుండానే జరిగింది. నా ఆలోచన వీలైనంత తక్కువ పని చేయడం, నన్ను నేను ఎక్కువ పనిలో పెట్టుకోకూడదు. కాబట్టి నేను ఫోన్లో చెప్పినట్లుగా, నాకు నిజంగా ఆసక్తి లేదు.”