“తిరిగొచ్చిన వసంతం” 82

“మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా…?”

మీకు మళ్లీ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని నాకు తెలుసు… దానికి కారణం ఏంటో కూడా నాకు తెలుసు… మీరు ఒప్పుకుంటే పిన్నిని నా సొంత తల్లిలా ..కాదు కాదు… కన్నకూతురిలా చూసుకుంటాను… మీకు తెలుసు నాకు ఇప్పటికే మూడేళ్ల కూతురు ఉందని… నేను మిమ్మల్ని పెళ్లిచేసుకోవాలని అనుకోడానికి అది కూడా ఒక కారణం… అంటే మిమ్మల్ని ఆయాలా భావిస్తున్నట్టు అనుకోవద్దు…

నా భార్య నన్ను వదిలిపెట్టి వెళ్లిపోయిన తర్వాత ఇక నేను పెళ్లి చేసుకోకూడదనే అనుకున్నాను… నా కూతుర్ని నేనే పెంచాలనుకున్నాను.. అయితే ఎన్ని చేసినా అమ్మ ప్రేమను దానికి అందించలేను అనే విషయం నాకు అర్థమయ్యింది…అదేసమయంలో మళ్లీ పెళ్లి చేసుకుంటే ఆ వచ్చినావిడ నా బిడ్డని సరిగా చూస్తుందో లేదోననే భయంతో పెళ్లిని గురించిన ఆలోచన కూడా చేయలేదు ఇన్నాళ్లు… మీరు నా పట్లా, నా బిడ్డ పట్లా చూపించే ఆదరం చూసాక మీరైతే నా బిడ్డను సరిగా చూసుకుంటారని అనిపించింది…
అందుకే మీ ముందు ఈ ప్రతిపాదన ఉంచుతున్నాను…

ఇందులో బలవంతం ఏదీ లేదు.. మీరు కాదన్నా నేను ఏమీ అనుకోను… మీకు ఇష్టంలేకపోతే ఈ విషయం ఇక్కడితో మర్చిపోండి… నాతో గానీ, పిన్నితో గానీ ఈ విషయమై చర్చించ వద్దని కోరుకుంటున్నాను… ఎందుకంటే ఈ ఉత్తరం వల్ల మన మధ్య ఇంతకుముందు ఉన్న సంబంధాలు చెడిపోకూడదు…

మీరు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రండి…
మీరు ఒప్పుకుంటారనే ఆశిస్తూ…

ఒకవేళ ఈ ఉత్తరం రాసి మిమ్మల్ని బాధపెట్టి ఉంటే నన్ను క్షమించమని కోరుకుంటూ…

మీ
రమేష్”

ఉత్తరం చదివాక సుమనశ్రీ కాసేపు స్తబ్దుగా కూర్చుండి పోయింది… వేరొకరైతే ఆమె ఉత్తరం చదివిన వెంటనే చింపి అవతల పారేసేది… కానీ రాసింది రమేష్…
రమేష్ అలాంటి ప్రతిపాదన తెస్తాడని ఆమె కలలో కూడా అనుకోలేదు.. అందుకే ఆలోచిస్తుంది…

రమేష్ కూడా ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడే… పద్మావతికి దూరపు చుట్టంకూడా… భర్తను కోల్పోయాక సుమనశ్రీకి ఉద్యోగం ఇప్పించడానికి ఎంతగానో సహాయపడ్డాడు… ఆఫీస్ ల చుట్టు ఏడాది పాటు తిరిగాడు…. తను ఉంటున్న అపార్ట్మెంట్ లొనే వాళ్ళకీ ఒక ఫ్లాట్ ఇప్పించి వాళ్ళకి అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా ఉంటున్నాడు…
.
అతను కూడా విధి వంచితుడే…. కలకాలం కలిసి ఉంటానని ఏడు అడుగులు అతనితో నడిచిన అతని భార్య మూడేళ్లు కూడా అతనితో కలిసి కాపురం చేయలేదు…. ఆమెకు మధ్యతరగతి బతుకు బతకడం ఇష్టం లేదు… పెద్దల బలవంతం మీద రమేష్ ని పెళ్లి చేసుకుంది… హై క్లాస్ జీవితం గడపాలని ఆమె కోరిక… జీవితంలో పార్టీలు, క్లబ్బులు, పబ్బులు అన్నీ ఉండాలని ఆమె ఆశ… రమేష్ చేసే ఉద్యోగంతో అవి సాధ్యం కావు కనుక ఉద్యోగానికి రాజీనామా చేసి ఏదైనా బిసినెస్ చెయ్యమని పోరేది… తనకు తెలియని దాంట్లోకి ప్రవేశించి చేతులు కాల్చుకోలేనని రమేష్ ఆమె మాట వినలేదు… వాదనల మధ్యనే రెండేళ్లు గడిచాయి… ఈలోపు ఒక పాప వాళ్ళ మధ్యకి వచ్చింది… కానీ వాళ్ళ ఆలోచనలు కలవలేదు…
ఒకరోజు ఆమె విడాకులు కావాలంది…రమేష్ నచ్చజెప్పాడు…కానీ ఆమె వినలేదు…
రమేష్ పాపను ఇవ్వను అన్నాడు…ఆమె అక్కర్లేదు అంది… పాపకు ఏడాది నిండకుండానే ఆమె వెళ్ళిపోయింది…
చాలా మంది రమేష్ ని మళ్లీ పెళ్లి చేసుకోమన్నారు… కొంత మంది తమ కూతుళ్ళని ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చారు… కానీ రమేష్ ఒప్పుకోలేదు… చంటిపాపను ఒంటరిగానే సాకుతున్నాడు…. పద్మావతి అతనికి సహాయపడుతు వస్తుంది…

సుమనశ్రీకి తెలిసినంత వరకు ఇదీ రమేష్ జీవితం…

1 Comment

  1. Bro stories incet rayandi

Comments are closed.