టైం మెషిన్ – Part 4 76

హార్ధిక్ వాళ్ళని 6, 8, 8, 8, 28 ఇలా గుంపులుగా విడగొట్టాడు.
వాళ్లకు వాళ్ళు చెయ్యవలిసిన పని చెప్పి. అందులో ఒక 8మందిని, ఇంకొక 6మందిని రెండు వేరు వేరు కార్లలో వాళ్ళ సామగ్రి తీసుకుని వెళ్ళమని పంపించేసాడు.
అందరూ అల్పాహారం తిని అక్కడి గదిలో కూర్చుని ఎదురుచూడసాగారు.
సమయం ఎనిమిది కావొస్తుండగా జాన్ దగ్గర్నుంచి హార్ధిక్ కి ఫోన్ వచ్చింది.

“హెలో”
“సర్ నేను జాన్ ని”
“చెప్పు జాన్”
“10.30 కి సిటీ బయట ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చెయ్యండి. మేము ఎదురుచూస్తూ ఉంటాం”
“ఓకే” అని ఫోన్ పెట్టేసి అక్కడున్న తన మనుషుల వైపు తిరిగి ” సో బాయ్స్.. మనకు ఇంకా రెండు గంటల సమయం ఉంది. ఆ రిచర్డ్స్ కి మనం who is the boss? అనేది తెలియజేయాలి. are you ready guys?” అన్నాడు.
“యెస్ సర్” అన్నారు అక్కడున్న గుంపు మొత్తం ఒకేసారి ముక్తకంఠంతో.
ఒక గంటలో అందరూ బళ్ళ మీద అల్యూమినియం ఫ్యాక్టరీకి బయలుదేరారు.

స్పాట్ కి కిలోమీటరు దూరంలో కారు ఆపాడు. హార్ధిక్ వెనక వస్తున్న ఇంకొక పది కార్లు కూడా సర్రున వచ్చి ఆగాయి. హార్ధిక్ ఇందాక చెప్పిన 16 మందిని తనతో రమ్మని మిగిలిన వాళ్ళని ఇక్కడే ఆగి తన సిగ్నల్ కోసం వెయిట్ చెయ్యమని చెప్పాడు.

రిచర్డ్స్ తనతో ఉన్న ఒక 40మంది మనుషులతో స్పాట్ దగ్గర ఎదురుచూస్తున్నాడు. సూర్యుడు అప్పుడే తన ప్రతాపం కొద్దికొద్దిగా చూపిస్తున్నాడు. రిచర్డ్స్ కి తన బట్టబుర్ర మీద ఎండ సుర్రున మండుతుంది. జాన్ ని చూస్తూ “వాడు వస్తాడా లేదా? ఎప్పుడూ బయట ఇలా ఉంటుందని తెలీదు నాకు. లేకపోతే ఏ హోటల్ లోనో ఏసీ రూమ్ లో మీటింగ్ పెట్టేవాడ్ని” అన్నాడు గుర్రుగా.

“వచ్చేస్తాడు సర్. మనం చెప్పిన టైం కి ఇంకా 5నిమిషాలు ఉంది” అన్నాడు జాన్ సంజాయిషీ ఇస్తున్నట్టు.
“సరే చూస్తాను. ఇంకా 5నిముషాలు” అంటున్న రిచర్డ్స్ మాట పూర్తి కాకుండానే రోల్స్ రాయిస్ ఘోస్ట్, దాని వెనక రెండు రేంజ్ రోవర్ కార్లు, వాటి వెనక నాలుగు హమ్మర్లు వచ్చి ఆగాయి.
అందులోంచి రాజసం ఉట్టిపడేలా హార్ధిక్ నడుస్తూ వస్తుంటే వెనక 16మంది హార్ధిక్ మనుషులు బ్లాక్ సూట్స్ వేసుకుని వెంట వస్తున్నారు.
రిచర్డ్స్ నడుచుకుంటూ వచ్చి అక్కడ ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. హార్ధిక్ అతన్ని చూసి చిరునవ్వు నవ్వి చిటికె వెయ్యగానే హార్ధిక్ మనుషుల్లో ఒకడు పరుగున కుర్చీ తెచ్చి అక్కడ పరిచాడు.

అందులో హార్ధిక్ విలాసవంతంగా కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు.
ఇద్దరూ ఒకరిని ఒకరు చూస్తూ కూర్చుని ఉన్నారు.
హార్ధిక్ చిన్నగా దగ్గి ” నన్ను పిలిపించిన విషయం?” అన్నాడు.
రిచర్డ్స్ నవ్వుతూ ” ఏం లేదు హార్ధిక్. ఇంతకూ చెప్పలేదు కదూ? నేనే రిచర్డ్స్.” అన్నాడు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ.
“అయితే?” అన్నాడు హార్ధిక్.

“ఏం లేదు. జస్ట్ పరిచయం చేసుకుందాం అని” నవ్వు పులుముకుంటూ చెప్పాడు రిచర్డ్స్. మనసులోని అసహనాన్ని దాచుకుంటూ.

“నన్ను పిలిపించిన పని చెప్తే నేను వెళ్తాను. నాకు బయట చాలా పనులున్నాయి” సూటిగా ప్రశ్నించాడు హార్ధిక్.

ఆ మాటలకి రిచర్డ్స్ కడుపులో మండినట్టు అయ్యింది. అయినా కాస్త ఓర్పుతో అలా మాట్లాడకుండా కూర్చున్నాడు.
” సరే హార్ధిక్. మనమొక ఒప్పందానికి వద్దాం. ఈ ముసుగులో గుద్దులాటలు మనకి వద్దు. నాకు మల్హోత్రా కావాలి. నీకు ఏం కావాలి?” అన్నాడు రిచర్డ్స్ సూటిగా.

“నాకు టైం మెషీన్ కావాలి” అన్నాడు హార్ధిక్ అంతే వేగంగా.

“what the hell you are talking? rubbish.. నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు పడేస్తా.” అన్నాడు రిచర్డ్స్ ఆవేశంగా కుర్చీని తన్ని పైకి లేస్తూ.

” కూల్ రిచర్డ్స్.. నాకు డబ్బే కావాలి అనుకుంటే నేనే నీకు ముందు ఫోన్ చేసేవాడిని. నాకు టైం మెషీన్ కావాలి. అది పూర్తయ్యాక కావాలంటే మల్హోత్రా ని తీసుకుపో.” అన్నాడు హార్ధిక్ రిచర్డ్స్ వంక నవ్వుతూ చూస్తూ.

ఎక్కడ “ఊ” అంటాడో అని మల్హోత్రా కి వెన్నులో వణుకు మొదలైంది.
“హార్ధిక్ ఇంక మాటలొద్దు. నా గురించి నీకు తెలీదు. గోటితో పోయేదాన్ని గొడవ వరకు తీసుకురాకు. నేనంటూ తలుచుకుంటే నిన్ను చంపేయ్యడం చిటికెలో పని.” అన్నాడు రిచర్డ్స్ ఆవేశంగా.

“సరే చంపేసుకో” అన్నాడు హార్ధిక్ మరింత కూల్ గా.
“అయితే ఇక మాటలతో పని జరగదంటావ్?”
“జరగదు” అన్నట్టు తల అడ్డంగా ఊపాడు హార్ధిక్.

రిచర్డ్స్ చిటికేసి హార్ధిక్ గుండెల వైపు వేలు చూపించాడు చూసుకోమన్నట్టు.
హార్ధిక్ కిందకు చూసే సరికి తన గుండెల మీద రెండు లేసర్ లైట్లు పడుతున్నాయి. రిచర్డ్స్ వైపు చూసాడు.

రిచర్డ్స్ వికారంగా నవ్వుతూ “చెయ్యి ఎత్తితే చాలు నీ ప్రాణాలు ఈ ప్రకృతిలో కలిసిపోతాయి. ఇప్పుడు నీ ముందు రెండే ఆప్షన్స్ ఉన్నాయి. తేల్చుకో” అన్నాడు.

“చంపేయ్” అన్నాడు హార్ధిక్.
నిలువుగుడ్లు పడిపోయాయి రిచర్డ్స్ కి. అనుమానంగా హార్ధిక్ వైపు చూసాడు.

“come on. go ahead” అన్నాడు.
రిచర్డ్స్ ఒళ్ళు మండి చెయ్యి పైకి లేపాడు. కానీ హార్ధిక్ కి ఏమీ కాలేదు. “హ్మ్..” అన్నాడు చెయ్యి ఇంకోసారి లేపి. అయినా ఎటువంటి ఉపయోగం లేదు. చిరాగ్గా వెనక్కి తిరిగి చూసాడు. తన స్నైపర్స్ ఇద్దరూ విగతజీవులుగా మారిపోయారు. భయంగా హార్ధిక్ వైపు చూసాడు.

హార్ధిక్ నవ్వుతూ రిచర్డ్స్ గుండెల వైపు చూపించాడు. చూసుకోమని.
నాలుగు లేసర్ డాట్స్ యమపాశాల్లా కదులుతున్నాయి రిచర్డ్స్ ఒంటి మీద. భయంతో నాలుగడుగులు వెనక్కేసాడు.

“రిచర్డ్స్ ని కూర్చోమన్నట్టు సైగ చేసాడు. రిచర్డ్స్ కుర్చీలో కూర్చోబోతుంటే “అక్కడ కాదు.. కింద” అంటూ ఉరిమింది హార్ధిక్ కంఠం.
అవమానభారంతో అలాగే కింద మోకాళ్ళ మీద కూర్చున్నాడు.
హార్ధిక్ రిచర్డ్స్ పక్కనున్న కుర్చీలో కాలు పెట్టి “ఇప్పుడు చెప్పు ఏం చేస్తావో?” అన్నాడు సిగరెట్ వెలిగిస్తూ.

రిచర్డ్స్ బుర్ర అప్పటికే సేచురేషన్ స్టేట్ లోకి వెళ్ళిపోయింది.

హార్ధిక్ తన చెంప మీద వేసిన చిటెక్కి ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చాడు.
హార్ధిక్ తన కాలు రిచర్డ్స్ మొహానికి తగిలేలా కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు.

అది చూసి తట్టుకోలేకపోతున్నాడు జాన్. జేబులోంచి గన్ తీసి హార్ధిక్ వైపు గురిపెట్టాడు. మరుక్షణంలో జాన్ నొసటి మీద అమ్మవారి కుంకుమ బొట్టంత బొక్క పడింది.
జాన్ అలా నిర్జీవంగా వాలిపోతుంటే “జా…….న్” అన్నాడు రిచర్డ్స్ బాధతో మూలుగుతూ. అన్నిటినీ చాలా తెలివిగా అమలుపరిచే తన కుడిభుజం కూలిపోవడంతో. చదరంగంలో రాజుకు మంత్రి కరువైనట్టు అయిపోయింది.

హార్ధిక్ లేచి జాన్ శవం దగ్గరకు వెళ్ళి “ఓహ్.. జాన్ అంటే ఇతనేనా? నైస్ టు మీట్ యూ జాన్. మనం ఇప్పటి వరకు ఫోన్లో మాట్లాడుకోవడమే కానీ డైరెక్ట్ గా కలవడం ఇదే మొదటిసారి. రెస్ట్ ఇన్ పీస్ జాన్” అన్నాడు జాన్ కళ్ళు మూస్తూ.