రాములు ఆటోగ్రాఫ్ – 47 84

సినిమాల్లో తప్ప అలాంటి ఖరీదైన ల్యాబ్‍ని చూసి ఉండకపోవడంతో అలాగే ఒక్క నిముషం పాటు కన్నార్పకుండా చూస్తున్నారు.
రాము డోర్ దగ్గరకు వెళ్ళి తీయబోగా…దానికి పాస్‍వర్డ్‍తో కూడిన డిజిటల్ లాక్ ఉండే సరికి డోర్ ఓపెన్ కాలేదు.
దాంతో ప్రసాద్ తనకు తెలిసిన సాఫ్ట్‍వేర్ జాబ్ చేసే ఇద్దరిని పిలిచి వాళ్లకు డోర్ ఓపెన్ చేయాలని చెప్పేసరికి వాళ్ళు తమ దగ్గర ఉన్న ఎక్విప్‍మెంట్‍తో పాస్‍వర్డ్ హ్యాక్ చేసి పావుగంటలో డోర్ ఓపెన్ చేసారు.
లోపలికి వెళ్ళిన వాళ్లకు ఖరీదైన ఎక్విప్‍మెంట్, కంప్యూటర్లు, డిజిటల్ మానిటర్స్ చూసేసరికి ప్రసాద్ పిలవగా వచ్చిన సాఫ్ట్‍వేర్ ఎంప్లాయిస్, “అబ్బా….ఏమున్నది ఈ ల్యాబ్….సినిమాల్లో తప్ప బయట చూడటం ఇదే మొదటి సారి….” అన్నారు.
అక్కడ లోపలికి రాగానే కంప్యూటర్లు ఆన్‍లోనే ఉన్నట్టు….ఏవో వర్క్ జరుగుతున్నట్టు రన్నింగ్‍లోనే ఉన్నాయి.

వీళ్ళు ల్యాబ్‍లోకి డోర్ ఓపెన్ చేసి రాగానే అక్కడ మేజర్ నాగేష్(వెంకట్) ఫోన్‍కి వెంటనే ల్యాబ్ డోర్ ఓపెన్ చేసినట్టు ఒక మెసేజ్ వెళ్ళింది.
అది చూసిన మేజర్ నాగేష్(వెంకట్) ఫోన్ చూసుకున్నాడు.
అందులో ల్యాబ్‍లో ఉన్న వీడియో ద్వారా అక్కడ జరిగేది అంతా కనిపిస్తున్నది.
ల్యాబ్‍లో ఉన్న CC కెమేరా చూసేసరికి రాము ఆ కెమేరా దగ్గరకు వచ్చి, “గుడ్‍లక్ వెంకట్…నీ ల్యాబ్‍ని పట్టేసుకున్నాం ….ఇక తరువాత అరెస్ట్ చేసేది నిన్నే….” అన్నాడు.
అది చూసిన మేజర్ నాగేష్(వెంకట్) ఏదో ఆలోచించిన వాడిలా నవ్వుతూ ఇంటి నుండి బయటకు వచ్చాడు.
ఇక్కడ ల్యాబ్‍లో రాము తన ఫోన్ తీసుకుని మనోజ్ కి ఫోన్ చేసి విషయం చెప్పి రమ్మన్నాడు.
పది నిముషాల్లో మనోజ్ ల్యాబ్‍లోకి వచ్చి దాన్ని చూసి ఆనందంతో, “exactly ఇదే ల్యాబ్ రామూ….ఇదే మిషనరీ మా ల్యాబ్‍లో ఉన్నది….స్ట్రక్చర్ మాత్రం మార్చాడు….అంతే….మొత్తం ఒకేలా ఉన్నది…కాని ఒకే ఒక్క విషయం మాత్రం మిస్ అవుతున్నది…” అంటూ అక్కడ ల్యాబ్ మొత్తం ఒక్కొక్క ఇన్‍స్ట్రుమెంట్‍ని పరీక్షగా చూస్తున్నాడు.
అలా చూస్తున్న మనోజ్ ఒక ఎక్విప్‍మెంట్ దగ్గరకు వచ్చి అందులో మారుతున్న డిజిటల్ బోర్డ్ అన్నిటినీ చూసి, “రాము….మనం వెదుకుతున్న ఎక్విప్‍మెంట్ ఇక్కడ ఉన్నది….రండి…మీ శ్రమకు తగ్గ ఫలితం దొరికింది….” అంటూ వాళ్లను పిలిచి అక్కడ ఉన్న బటన్స్ ఏవో ప్రెస్ చేస్తున్నాడు.
రాము, ప్రసాద్ అక్కడకు వచ్చి ఆ ఎక్విప్‍మెంట్ వైప్ చూస్తున్నారు.
మనోజ్ ఏవేవో బటన్స్ ప్రెస్ చేసినా అది ఓపెన్ కాకపోవడంతో, “దీనికి పాస్‍వర్డ్ పెట్టాడు…అదేంటో తెలిస్తే ఓపెన్ చెయ్యొచ్చు,” అంటూ రాము వైపు తిరిగి, “మీకు ఈ హ్యాకర్స్ టీమ్ ఎవరైనా తెలుసా,” అనడిగాడు.
దాంతో ప్రసాద్ ఇందాక డోర్ ఓపెన్ చేసిన వాళ్ళను పిలిచాడు.
వాళ్ళు మళ్ళీ తమ దగ్గర ఉన్న పాస్‍వర్డ్ హ్యాక్ సాఫ్ట్‍వేర్‍ని ఆ మిషన్‍కి కనెక్ట్ చేసి పాస్‍వర్డ్ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
రెండు మూడు పాస్‍వర్డ్స్ కొట్టినా ఇన్‍వాలిడ్ అని వస్తుండే సరికి వాళ్ళు ప్రసాద్‍తో, “ఇది అంత తేలిగ్గా కనిపించడం లేదు సార్….ప్రతి ఐదు నిముషాలకు దీనికి ఉన్న పాస్‍వర్డ్ మారుతూ ఉంటుంది…” అన్నాడు.
అలా మాట్లాడుతుండగా ప్రసాద్ ఫోన్ మోగడంతో తన భార్య తులసి ఫోస్ చేస్తుండటంతో ఫోన్ లిఫ్ట్ చేసి, “ఏయ్…ఏంటి ఊరకూరకే ఫోన్ చేస్తున్నావు….పనిలో ఉన్నానని చెప్పా కదా…ఇప్పటికి మూడు సార్లు ఫోన్ చేసావు…” అంటూ అప్పటికే తన వైపు చూస్తున్న రాము వైపు చూసి, “సార్….తులసి ఫోన్ చేస్తున్నది….” అన్నాడు.
“సరె….బయటకు వెళ్ళి మాట్లాడు,” అన్నాడు రాము.
ప్రసాద్ అక్కడ నుండి బయటకు వస్తూ, “ఏంటి విషయం చెప్పు….అర్జంట్ పని ఉన్నది,” అన్నాడు.
కాని తులసి సమాధానం చెప్పకుండా ఏడుస్తుండే సరికి ప్రసాద్ మనసు ఏదో కీడు శంకించడంతో, “ఏయ్ తులసీ…. ఏమయింది,” అన్నాడు కంగారుగా.
“తులసీ….ఏడుస్తున్నావా….” అంటూ ప్రసాద్ ఒక్కసారి తన ఫోన్ చూసుకుని మళ్ళి, “నాకు ఇక్కడ సిగ్నల్ రావడం లేదు….నేను కాల్ చేస్తాను ఉండు,” అంటూ కాల్ కట్ చేసి బయటకు వచ్చి మళ్ళీ తులసికి ఫోన్ చేద్దామని అనుకుంటుండగా వీడియో కాల్ రావడంతో, “ఏంటి వీడియో కాల్ చేస్తున్నాది,” అని అనుకుంటూ కాల్ ఓపెన్ చేసాడు.
అవతల నుండి తులసి ఏడుస్తూ కనిపిస్తున్నది.
ప్రసాద్ : ఏయ్ తులసి….ఏమయింది….ఎందుకు ఏడుస్తున్నావు…..
తులసి : ప్రసాద్….నేను చెప్పేది మాత్రం విను…ఎందుకు….ఏమిటి అని అడగొద్దు…..
ప్రసాద్ : తులసి….ఎందుకు ఏడుస్తున్నావు….
తులసి : నువ్వు వాళ్ళతో ఉండొద్దు….బయటకు వచ్చేయ్….అక్కడే ఉంటే ఇరుక్కుపోతావు…
తులసి అలా అనగానే ప్రసాద్ వెనక్కు తిరిగి బావి వైపు చూసాడు.
అప్పుడే రాము, మిగతా వాళ్ళు కూడా ల్యాబ్ లోనుండి బయటకు వచ్చారు.
దాంతో ప్రసాద్ పక్కకు వచ్చి మళ్ళీ ఫోన్ వైపు చూసాడు.
తులసి : ప్రసాద్….నువ్వు ఇప్పుడు మీ అన్నయ్యను, వదినను, నన్ను కాపాడు….(అంటూ ఏడుస్తున్నది.)
ప్రసాద్ : ఏం మాట్లాడుతున్నావు….ముందు ఏం జరిగిందో చెప్పు….
అలా అంటుండగా పక్కనే ఎవరో ఫోన్ తీసుకున్నట్టు ఫోన్ కెమేరా పక్కకు తిరిగింది.
అది చూడగానే ప్రసాద్‍కి తన ఇంట్లో ఏదో జరుగుతున్నదని….తన ఫ్యామిలీని మొత్తం ఎవరో ఇంట్లోనే బంధించారని అర్ధమయింది.
అలా చూస్తున్న ప్రసాద్‍కి పోన్‍లో ఒకతను కనిపించి ఏం చేయాలో…ఎలా చేయాలో వివరంగా చెప్పాడు.
దాంతో ప్రసాద్ ఇక వేరే దారి లేక తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి ల్యాబ్ లోకి వెళ్ళి అక్కడ ఇంతకు ముందు మనోజ్ వాళ్ళు పాస్‍వర్డ్ కోసం ట్రై చేసిన మిషన్ దగ్గరకు వెళ్ళి తన ఫోన్‍లో వచ్చిన మెసేజ్‍లో వచ్చిన పాస్‍వర్డ్ టైప్ చేసాడు.
అందులో నుండి ఒక డిజిటల్ బాక్స్ లాంటిది బయటకు వచ్చింది.
ప్రసాద్ దాన్ని తీసుకుని బయటకు వచ్చాడు….అలా వస్తుండగా అక్కడ పని చేస్తున్న హ్యాకర్ ఒకతను ప్రసాద్‍ని పిలిచాడు.