శివ నవ్వుకుంటూ లేచి శశికళ దెగ్గరికి వెళ్ళాడు. కూర్చుని ఆలోచిస్తున్న శశి శివని చూడగానే లేచి నిలుచుంది. రెండు చేతులు ఎత్తబోతుంటే వద్దని సైగ చేశాడు.
శివ : వారం రోజులు టైం ఇస్తున్నాను, తరువాత నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. డబ్బు కావాలంటే ఏర్పాటు చెయ్యగలను కానీ నీవల్ల నాకొచ్చే ఉపయోగం ఏంటి..?
శశి కళ్ళు తుడుచుకుంటూ “నా దెగ్గర ఇప్పుడేమి లేదు, కానీ కచ్చితంగా ఏదో ఒక రోజు మీ ఋణం తీర్చుకునే తీరతాను. నన్ను నమ్మండి.” అని వేడుకుంది
శివ : నీ సర్టిఫికెట్స్ చూసి నమ్ముతున్నాను. ఈసారి మోసపోకు. ఏం కావాలన్నా సూర్యాని అడుగు ఏర్పాటు చేస్తాడు అని బైటికి వెళుతుంటే శశి “మీ పేరు కూడా చెప్పలేదు” అంది. దానికి శివ నవ్వుతూ “అవసరం లేదు, ముందు నీ సంగతి చూసుకో” అని వెళ్ళిపోయాడు.
శివ వెళ్ళిపోయాక ఒక్కటే చాలాసేపు కూర్చుంది. మనసులో ముగ్గురు అన్నదమ్ములని తలుచుకుని “చెప్తాను, అందరి సంగతి చెప్తాను” అని కోపంగా కళ్ళు తుడుచుకుంటూ గుండె మీద చెయ్యేసుకుని “మా.. నాన్నా.. నేనే తప్పు చెయ్యలేదు, క్షమించండి..” మా నాన్న ఎంత ఏడ్చి ఉంటాడో ఆనుకుని తలుచుకుని తలుచుకుని ఏడుస్తుంటే సూర్య తలుపు మీద రెండు సార్లు తట్టాడు.
సూర్య : భోజనం రెడీ
శశి : థాంక్స్
అన్నం తింటూనే ఆలోచిస్తుంటే ఇప్పుడు నాకు సాయం చేసేవాళ్ళు ఒక్కరే గుర్తొచ్చారు, రోహిత్. పీజీ చదివేటప్పుడు నా సీనియర్. చాలా తెలివికలవాడు. నేనంటే ఇష్టమని చాలా సార్లు చెప్పాడు కానీ ఒక్కసారి కూడా నన్ను ప్రేమించమని బలవంతం చెయ్యలేదు. అప్పట్లో తనంటే ఇష్టం ఉన్నా తన గోల్ అంటూ పక్కన పెట్టేసి చివరికి వెధవని ప్రేమించి నేను కూడా వెధవని అయ్యాను. ఫోనులో చెత్త వెధవలు ఫోటోలు డిలీట్ చేసి ఫేస్బుక్కులో రోహిత్ కోసం వెతికితే స్పెయిన్లో లెక్చరర్ గా పని చేస్తున్నాడని అర్ధమయ్యింది. ఆన్లైన్లో అడ్మిషన్స్ కోసం చూస్తే ఇంకా పన్నెండు రోజులు గడువు ఉంది. వెంటనే సూర్య గారిని పిలిచాను.
శశి : ఒక్కసారి సార్ ని కలవాలి
సూర్య : ఆ సార్ చాలా బిజీ, ఈ పాటికి ఇంట్లో వాళ్ళ అత్త తోముతూ ఉంటుంది. అని నవ్వుతూ నీకేం కావాలో చెప్పు అన్నాడు
శశి : నాకు మనీ కావాలి అని వెంటనే తన బ్యాగ్ తీసి అందులో నుంచి బంగారం తీసింది. ఇవి మా అమ్మ నగలు వీటి ఖరీదు ఎంత తక్కువైనా నా దృష్టిలో చాలా విలువైనవి, వీటి కోసం ఖచ్చితంగా మళ్ళీ నేనొస్తాను.
సూర్య : ఏం చెయ్యాలనుకుంటున్నావో చెపితే ఏర్పాట్లు చేస్తాను. ఆ బంగారం కవర్లో పెట్టివ్వు అనగానే అలానే ఇచ్చింది. తీసుకుని వెళ్ళిపోయాడు.
###
###
పదిహేనవ రోజు ఎయిర్పోర్టులో ఫ్లైట్ కోసం ఒక్కటే ఎదురు చూస్తుంది. ఇన్ని రోజుల్లో తనని కాపాడిన శివని ఒక్కసారి కూడా కలవలేదు. ఎంత ప్రయత్నించినా తన పేరు కూడా తెలుసుకోలేకపోయింది. కాని మనసులో మాత్రం కచ్చితంగా నిన్ను మళ్ళీ చూస్తాను అనుకుంటుంటే మైకులో అనౌన్స్ వినిపించి లేచింది.
ఫ్లైట్లో కూర్చుని ఆలోచిస్తే ఎందుకు తన పేరు కూడా చెప్పడానికి ఇష్టపడలేదో అర్ధం కాలేదు, చుట్టూ చాలా మనుషులు. ఒక అడ్మిషన్ అప్లై చేసి వీసా అప్లై చేసి వెళ్లాలంటే కనీసం రెండు నెలలు పడుతుంది అలాంటిది పదిహేను రోజుల్లో సిద్ధం చేసేసారు. చాలా పలుకుబడి ఉండుండాలి. మాములు బట్టల్లో ఉన్నా చాలా అందంగా ఉన్నాడు కానీ మెడలో రుద్రాక్ష దండ ఏంటో అర్ధం కాలేదు. ఒక మాట ఎక్కువగా తక్కువగా మాట్లాడలేదు.
