రోహిత్ : చదివావా
శశి : హ్మ్మ్
రోహిత్ : ప్రపంచం నిన్ను సైంటిస్ట్ గా గుర్తిస్తుంది
శశి : తెలుసురా
రోహిత్ : అదీ.. మరీ..
శశి : చెప్పరా
రోహిత్ : అదే.. ఇప్పుడు నీ పేరు ముందు సైంటిస్ట్ వచ్చేసింది కదా నన్ను పెళ్లి చేసుకుంటావా, నొ అయితే ఫోను కట్ చేసేయి నేనేమి అనుకోను గడగడా వాగేసి మౌనం వహించాడు. ఎంతకీ ఫోను కట్ అవ్వలేదు. శశి.. గొంతులో కొంచెం ఆనందం.
శశి : హా..
రోహిత్ : నిజమేనా
శశి : ఇంటికి రా మాట్లాడదాం అని ఫోను పెట్టేసింది.
మగతగా ఆలోచిస్తూ లోపలికి వెళ్లి అమ్మ నాన్నల ఫోటో ముందు కూర్చుంటే పక్కనే మొలకి వేలాడుతున్న రుద్రాక్షలు చూసింది, వెంటనే తనని కాపాడిన వ్యక్తి గుర్తొచ్చాడు. లేచేళ్లి రుద్రాక్ష దండ ముందు మోకాళ్ళ మీద కూర్చుంది.
“దేవుడా.. నిన్ను మర్చిపోయాను. అందుకు క్షమించు. సైంటిస్ట్ అవ్వాలనుకున్నాను అయ్యాను. అంతా నీవల్ల. నీ డబ్బులు నీకు వడ్డీతో సహా కావాలన్నావ్ కనీసం నీపేరు కూడా నాకు తెలియనివ్వలేదు, ఎలా నీకు తిరిగిచ్చేది. ఎక్కడుంటావో తెలీదు, ఏం చేస్తుంటావో తెలీదు ఎలా నిన్ను చేరేది. మొదటి అంకం పూర్తి కావడానికి ఆరున్నర ఏళ్ళు పట్టింది. రెండో అంకం పగ అది తీరాగానే మూడవది నీ దెగ్గరికి చేరుకోవడమే.. నువ్వు నా జీవితం ఎలా సరిదిద్దావో ఇక్కడ నేను కూడా ఒకరి జీవితాన్ని సరిదిద్దాల్సి ఉంది, రోహిత్ నాకోసం చాలా త్యాగాలు చేశాడు వాడి కోసం నేనేమి చెయ్యలేదు. త్వరలోనే నిన్ను చేరుకుంటాను” అని కళ్ళు మూసుకుంది. చాలాసేపు చేతిలో ఉన్న రుద్రాక్షలని పట్టుకుని కూర్చుంది.
ఇంటి బయట కారు చప్పుడుకి లేచి బాల్కనీలోకి వచ్చింది. రోహిత్ కింద నుంచే నవ్వుతూ పరిగెడుతూ వస్తుంటే తనలో తానే నవ్వుకుంది. రోహిత్ చాలా వేగంగా వచ్చేసాడు.
శశి : ఒరేయి.. చిన్నగరా
రోహిత్ ఏమి మాట్లాడలేదు, ఆనందంతో పిచ్చోడు అయిపోయేలా ఉంటే శశి కుర్చీలో కూర్చుంది. రోహిత్ తన ముందే కింద కూర్చుని “ఇదంతా నిజమేనా” అంటుంటే రోహిత్ తల మీద చెయ్యేసి ప్రేమగా దెగ్గరికి తీసుకుని తన ఒళ్ళో పడుకోబెట్టుకుంది.
ఇన్నేళ్ల సావాసం, స్నేహం. ఎప్పుడు తప్పుగా ప్రవర్తించలేదు. అప్పుడప్పుడు నాన్ వెజ్ జోక్స్ వేసేవాడు కానీ ఇబ్బంది పడేలా ఎప్పుడు మాట్లాడలేదు. ఆరోజు యూనివర్సిటీలొ మొదటసారి కలిసి మాట్లాడాక మళ్ళీ ఇప్పుడే అడిగాడు నన్ను పెళ్లి చేసుకుంటావా అని, నా కోసం ఇంత చేసినవాడిని కాదనగలనా కానీ..
నెమ్మదిగా రోహిత్ ని లేపి నుదిటి మీద ముద్దు పెడుతూ “పెళ్లి చేసుకుందాం, కానీ నాదొక విన్నపం”
రోహిత్ : విన్నపం ఏంటే భూకంపం అయినా ఓకే
