శృంగార శతకము 1 131

శరవణ భట్టు మాటలకి భోజరాజు పరివారం దిగ్ర్భమ చెందారు. విషణ్ణ వదనాలతో నిలబడిపోయారు. వారి ముఖాల్లో, కొంత అయోమయం, కొంత అపరాధ భావన, కలగలసి పోయాయి. పొలం నుండి బయటకి వచ్చేసారు. ఇంతలో శరవణ భట్టు మళ్ళీ మంచె పైకి ఎక్కాడు. వెళ్ళుపోతున్న సైనికుల్ని చూసి “అయ్యో భగవంతుడా! అన్నలారా ఆగండి! ఎందుకని వెళ్ళిపోతున్నారు? మీ ఆకలి తీర్చుకోకుండానే పొలం వీడి పోతున్నారేం? నా ఆతిధ్యంలో ఏమైనా లోపమున్నదా? ప్రియమైన సోదరులారా! రండి. దయచేసి వెళ్ళకండి! ఆకలీ దాహమూ తీర్చుకొండి. విశ్రాంతి తీసుకోండి. ఎండవేడి తగ్గాక, తిరిగి ప్రయాణం ప్రారంభిద్దురు గానీ!” అన్నాడు ఎంతో వేడికోలుగా! పూర్తిగా విభిన్నమైన, విచిత్రమైన ఈ రకపు ప్రవర్తనకు, శరవణ భట్టుని చూసి, భోజరాజు అతడి పరివారమూ నివ్వెర పోయారు. భోజరాజు తన ప్రధానమంత్రిని పిలిచి “బుద్దిసాగారా! గమనించావా!? ఈ బ్రాహ్మణుని ప్రవర్తన కడు వింతగా నున్నది. మంచె మీద ఉన్నప్పుడు అతడి మాటతీరు ఎంత దయాపూర్ణమై ప్రేమపూరితమై ఉన్నది. మంచె దిగినంతనే కర్ణ కఠోరమైన మాటలాడుచున్నాడు. ముందటి ప్రవర్తనకు, దీనికీ పొంతనే లేదు. దీని కేదో ప్రబల కారణం ఉండి ఉండాలి” అన్నాడు. బుద్ది సాగరుడు “నిజము మహారాజా! నేనూ దీని గురించే ఆలోచించుతూ ఉన్నాను. ‘మంచె ఉన్న స్థానంలోని మట్టిలో ఏదో మహత్తు ఉండి ఉండవచ్చు’ అని నా ఊహ” అన్నాడు, సాలోచనగా! భోజరాజు “అదీ నిజమై ఉండవచ్చు. మనము ఆ రైతుతో మాట్లాడెదము గాక! అతణ్ణి వెంటనే పిలిపించండి” అన్నాడు.

ఉత్తర క్షణంలో శరవణ భట్టు భోజరాజు ఎదుట ఉన్నాడు. భోజరాజు మందహాసంతో “ఓయీ శరవణ భట్టూ! మాకు నీ పొలము పై ఆసక్తిగా ఉన్నది. నీకు ఇంతే సారవంతమైనదీ, విస్తీర్ణము గలదీ అయిన మరియొక భూమినిచ్చెదను. ఇంకనూ నీకు అయిదు గ్రామములపై పన్ను వసూలు చేసుకొను హక్కునిచ్చెదను. బదులుగా నీ పొలమును నాకు అమ్మివేయుము” అన్నాడు. శరవణ భట్టు వినమ్రతతో “మహారాజా! ఈ రాజ్యమున ఏదైనా మీ సొత్తు! అన్నిటిపైనా మీకు అధికారమున్నది. మీరు నా పొలము ఊరికినే తీసికొన్ననూ, మిమ్ములను అభ్యంతర పరచు వారెవ్వరూ లేరు. అట్టిచో మీరు నాపట్ల ఎంతో దయ చూపించుచున్నారు. మీరు ఆదర్శ ప్రభువులు! మీ ధర్మబుద్ది దేవతలకు సరితూగ గలది. నా పొలమునకు బదులుగా మీరు ఎంతో ఇచ్చుచున్నారు. నేనెంతో సంతోషముగా నా పొలమును ఈ క్షణమే మీ పరము చేయిచున్న వాడను” అన్నాడు. బుద్దిసాగరుడు కావలసిన ఏర్పాట్లన్నీ చేశాడు. శరవణ భట్టుకు వేరొక పొలమునూ, ఇతర బహుమతులూ ఇచ్చాడు. శరవణ భట్టు పొలంలో మంచె నిర్మించిన చోట తవ్వేందుకు తగిన ఏర్పాట్లు చేశాడు. ఒక మంచి ముహుర్తాన, పూజాదికాలు నిర్వహించి, తవ్వకం ప్రారంభించారు.

బుద్దిసాగరుడు కూలీల చేత మంచె ఉన్న చోట తవ్వించాడు. కూలీలు తగినంత లోతు తవ్వారు.
అద్భుతం!
భారీ పరిమాణంలో ఉన్న బంగారు సింహాసనం బయటపడింది. మట్టి అంటుకుపోయినా దాని అందం అందర్నీ ఆకర్షిస్తోంది. లతలూ, పువ్వూలూ, చూడచక్కని శిల్పకళతో అలరారుతోంది. అచ్చమైన బంగారంతో, మరకత మాణిక్యాధి రత్నాలతో పొదిగి ఉంది. దానికి 32 విశాలమైన మెట్లున్నాయి. మెట్లపైన సింహాసనం కళ్ళు మిరమిట్లు గొల్పుతోంది.
ప్రతీ మెట్టుకూ నిలువెత్తులో ఒకో సువర్ణ ప్రతిమ ఉంది. అందమైన అమ్మాయిల బొమ్మలు! అంతకంటే అందమైన వస్త్రాలూ, నగలూ ధరించినట్లుగా మలచబడిన శిల్పాలు! సువర్ణంతో చేసిన సౌందర్య రాశులు! చీర అంచుల్లో, నగల ధగధగల్లో, ధరించిన పువ్వుల్లో… ప్రతీ ఆకృతిలో, అందంగా ఒదిగిన వజ్రాలూ, కెంపులూ, మణులూ, మరకతాలు! అచ్చంగా అందమైన అమ్మాయిలు, విభిన్న భంగిమల్లో నిల్చున్నట్లున్నాయి.
జుట్టు విరబోసుకున్నట్లు ఓ బొమ్మ ఉంటే, ముడి వేసుకుని పూలు ముడుచుకున్నట్లు మరో బొమ్మ! ఓ బొమ్మది వాలు జడ, మరో బొమ్మది పూల జడ! హొయలు కురిపిస్తూ, వయ్యారాలు ఒలికిస్తూ, విభిన్న భంగిమల్లో, జీవం ఉట్టిపడుతూ, అచ్చంగా రమణీయ రమణీమణులు మెట్టు మెట్టుపై నిలబడి నట్లుగా ఉన్న బంగారు బొమ్మలు!
అది చూసిన అందరిలో ఆనందం పెల్లుబికింది. బుద్దిసాగరుడు సింహాసానాన్ని రెప్పవాల్చకుండా చూస్తూ “ఇదన్నమాట సంగతి! ఈ సింహాసనం పూర్వం ఏ మహా చక్రవర్తిదో అయి ఉంటుంది. కాలగతిలో ఇక్కడ మట్టిలో కూరుకుపోయింది. కాబట్టే, ఈ చోటులో నిర్మించిన మంచె మీద ఉన్నంత సేపూ ఆ రైతు, ఈ సింహసనాన్ని గతంలో అధిష్టించిన మహానుభావుడి గొప్ప గుణాన్ని ప్రతిబింబిస్తూ, వితరణ శీలాన్ని చూపించాడు. మంచె దిగి రాగానే మామూలు మనిషిలా మాటలాడాడు. అదంతా ఈ సింహాసనపు విశిష్టతే!” అనుకున్నాడు.