శృంగార శతకము 1 131

[బుద్దిసాగరుడి ఆలోచనా తీరు, పిల్లల్ని సహజంగానే ప్రభావితం చేస్తుంది. భోజరాజూ, బుద్దిసాగరుడూ, శరవణ భట్టు విచిత్ర ప్రవర్తన చూసి “ఏమోలే! వీడో తిక్కలోడు” అనుకోలేదు. దానికేదో కార్యకారణ సంబంధముండి ఉండాలని శోధించారు. శరవణ భట్టు వైరుధ్య ప్రవర్తనలని పట్టించుకోకుండా తమ దారిన తాము పోయి ఉన్నట్లేతే, వాళ్లకి ఇంత గొప్ప సింహాసనం లభించేది కాదు. ఈ కథలూ ఉండేవి కావు.
ఇది గ్రహించినప్పుడు, పిల్లలు, తమ చుట్టూ జరిగే విషయాల పట్ల కూడా, ఒక కుతుహలాన్ని పెంపొందించుకుంటారు. కార్యకారణ సంబంధాల పట్ల విశేషణాత్మక దృష్టి కలిగి ఉంటారు. కథల వల్ల ప్రయోజనాలలో సౌశీల్య నిర్మాణం, వ్యక్తిత్వ వికాసమూ ప్రధానమైనవి.
నిజానికి, శరవణ భట్టు చూపిన వితరణ గుణం అతడిది కాదు. విక్రమార్కుడి సింహాసనానిది. మనలోనూ… శరవణ భట్టు చూపినట్లు ‘శివాలు’ అప్పుడప్పుడూ కన్పిస్తుంటుంది. ఏదైనా పని విజయవంతంగా చేసినప్పుడు ఇక అన్ని పనులూ చేసేయగలం అనుకోవటం, ఇటువంటిదే! ఎవరైనా ప్రక్కనున్నప్పుడో, పనిరంధి లేదా అటువంటిదే ఏదైనా విభిన్నమైన [మూడ్] మనఃస్థితిలో ఉన్నప్పుడు “అదెంత లెండి! చేసేద్దాం!” అంటూ ఇతరులకి హామీలిచ్చేస్తుంటాం. తీరా ఆ హామీలు నిలబెట్టుకోవాల్సి వచ్చినప్పుడు నొప్పి తెలుస్తుంటుంది.
అలాంటి సందర్భాలలో మేము “భోజరాజు సింహాసనం ఎక్కి నప్పటి మాటలొద్దు” అనో లేదా “విక్రమార్క సింహసనం ఎక్కేసి శివాలెక్కించుకోవద్దు” అనో అనుకుంటూ, పరస్పర హెచ్చరికలు చేసుకుంటూ ఉంటాము. ఆ విధంగా మనస్సుని నియంత్రించుకో ప్రయత్నిస్తామన్న మాట. అందుకు మా short cut formula వంటి పద ప్రయోగం ‘భోజరాజ సింహాసనమా?/ విక్రమార్క సింహసనమా?’ ఇక కథలోకి వస్తే…]
బుద్దిసాగరుడు సింహాసనాన్ని ధారా నగరానికి తెచ్చేందుకు ఏర్పాట్లు చేశాడు. భోజరాజు సింహాసనాన్ని చూసి ఆశ్చర్యం, ఆనందం పొందాడు. కూలీలకి, అక్కడ పనిచేసిన ఇతరులకి, భోజరాజు విలువైన బహుమతులు ఇచ్చాడు. సింహాసనాన్ని శుభ్రపరిచి, మెరుగులు దిద్దారు.
స్వర్ణ సింహసనాన్ని భోజరాజు సభాభవనంలో ప్రతిష్ఠించారు. దాని పనితనాన్ని చూసి యావత్ర్పజానీకం నివ్వెర పోయింది. ‘అపూర్వం! అద్భుతం!’ అని అందరూ వేనోళ్ళ కొనియాడారు. భోజరాజు ఆస్థాన జ్యోతిష్యులని, పండితులని సంప్రదించాడు. వారి మార్గదర్శకత్వంలో మంచి ముహుర్తం నిర్ణయించారు.
ఆ పుణ్య దినాన దైవపుజాదికాలు నిర్వహించారు. తదుపరి సింహాసనానికీ పూజ చేసి, హారతులు ఇచ్చారు. భోజరాజు, పండితుల, పురోహితుల, పెద్దల ఆశీర్వాదాలు పొంది, సింహాసనాన్ని సమీపించి నమస్కరించాడు.
పండిత పురోహితుల వేదమంత్రాలతో సభాభవనం మార్మోగుతుంది. ప్రజలు విభ్రమాశ్చర్యానందాలతో చూస్తున్నారు. మంగళ వాద్యాలు మిన్నంటి మ్రోగుతున్నాయి. భోజరాజు సంతోషంగా, సింహాసనాధిష్టిత కాంక్షతో, సుతారంగా కుడిపాదం ఎత్తి, తొలిమెట్టుపై ఉంచబోయాడు.
ఆశ్చర్యం!

మంగళ వాద్యాలు మిన్నంటి మ్రోగుతున్నాయి. భోజరాజు సంతోషంగా, సింహాసనాధిష్టిత కాంక్షతో, సుతారంగా కుడిపాదం ఎత్తి, తొలిమెట్టుపై ఉంచబోయాడు.

ఆశ్చర్యం!

ఆ క్షణం…. సింహాసనపు 32 మెట్ల మీదా ఉన్న సువర్ణ ప్రతిమలన్నీ, ఒక్కసారిగా ప్రాణం వచ్చినట్లు రెండు చేతులా చప్పట్లు చరుస్తూ, భోజరాజుని చూసి పక పకా నవ్వాయి.

సభలోని వారంతా విభ్రాంతితో స్థబ్ధులయ్యారు. ఒక్క క్షణం భోజరాజు లజ్జితుడైనాడు. మరుక్షణం తాను భ్రాంతి పడ్డానా అనుకున్నాడు. మరోసారి తొలిమెట్టుపై కాలు మోపబోయాడు. మళ్ళీ బొమ్మలన్నీ ఒక్కసారిగా ఘొల్లున నవ్వాయి. నేల మీద మువ్వలు జారినట్లు, ముత్యాలు దొర్లినట్లు, కోటి కోయిలలు కిలకిల లాడినట్లు సవ్వడి చుట్టు ముట్టింది.