శృంగార శతకము 1 131

కొద్దిక్షణాలకు భోజరాజు తేరుకున్నాడు. గొంతు సవరించుకొని “ఓ సువర్ణ ప్రతిమలారా! ఇదేమీ వింత? ఏల నన్ను జూచి నవ్వుతున్నారు? నేను సింహాసన మధిష్టించ మెట్టుపై కాలూన బోవగా, చప్పట్లు చరిచి మరీ నవ్వుతున్నారే! నేను మీకింతగా చులకన ఎట్లయ్యాను? ఎందుకిలా పరిహాసం చేస్తున్నారు?” అన్నాడు.

సింహాసనపు తొలిమెట్టుపై నున్న బొమ్మ, కలస్వనంతో…

“ఓ భోజరాజా! నీవు మాకెందుకు చులకన అవుతావు? నీపై మేము ఎందుకు పరిహాసమాడుతాము? ఎంతో ప్రయత్నము చేసి, మీరు, మీ పరివారమూ, మంత్రివర్యులూ, ఈ సింహాసనాన్ని మట్టిలో నుండి వెలికి తీసి, శుభ్రపరిచి, మెరుగులు దిద్ది, ఈ సభాభవనమున నిలిపినారు.

ఈ సింహాసనముపై కూర్చుని ప్రజాపాలన చేయగల అర్హత గల వారెవ్వరూ లేనందువల్లనే ఇది మట్టిలో కూరుకుపోయినది. ఈ సింహాసనంపై కూర్చొన వలెనను ఆశ నీకు ఉంటే, నీవు దీని చరిత్ర తెలుసుకోవాలి, మరింకెన్నో నేర్చుకోవాలి. అదేదీ తెలియక నీవీ గద్దె నెక్కనుద్యుక్తుడవైనావు.

‘ఇతడీ సింహాసనము నెక్కిన ఎక్కనిమ్ము. మనకేమి గావలె’ నని తలపోసి మేమూరక యుంటిమేని మాకు ‘ఉదాసీనత దోషం’ అంటుకోక మానదు. ఏదైనా దుష్కృతి జరుగుయెడల, ఆ పాపం పాపకర్తయైన మానవుని కొక్కనికే చెందదు, ఆ పాప కార్యమును చూచియూ, దాని గురించి తెలిసియూ, దానినాపక, కేవలము ప్రేక్షకత్వం వహించి చూచువారల కెల్ల యా పాపమంటును.

అందుకే…. ఇదేవీ తెలియక సింహాసనము నెక్కబోయిన నిన్ను ఆపుటకే, మేమిట్లు నిన్ను ఆటంకపరిచితిమి. ఈ సింహాసనముపై కూర్చొని ప్రజా పాలన చేయ అర్హత గలవారే దీనిపై కూర్చొన వలెను. అట్లుగాక ఎవరైనా అనర్హులయ్యీ, సింహాసనము నధిష్టింపబ్రయత్నించినచో వారి తల శతసహస్ర ముక్కలవ్వగలదు.

పూర్వం విక్రమాదిత్యుడనే మహారాజు ఈ సింహాసనముపై కూర్చొని, తన మంత్రియైన భట్టితో కలిసి, రెండువేల ఏళ్ళు రాజ్యమేలినాడు. భట్టి అపర బృహస్పతి. విక్రమాదిత్యుడు గొప్పజ్ఞాని, అంతకంటే గొప్ప సాహసికుడు, అరివీరయోధుడు. అతడు అరువది నాలుగు కళల నామూలాగ్రమూ తెలిసిన వాడు. ధైర్యసాహసాలు, పౌరుషము, పరాక్రమమూ, దానగుణమూ కలవాడు. దయా సముద్రుడు. సకల శాస్త్ర పారంగతుడు.

విక్రమాదిత్యునికి గల సుగుణాలలో, వెయ్యింట ఒక వంతైననూ నీవు కలిగి ఉంటే, ఈ సింహాసనము నెక్కుటకు సాహసింపుము. లేదా నీ కోరికని కట్టిపెట్టుకొమ్ము.

ఇది అంతా తెలిసి ఉండుట చేతనే, గద్దెనెక్కు నుత్సుకత చూపుతున్న నిన్ను చూసి నవ్వినాము. భోజరాజా! ఇకపై ఆలోచించి ఏమి చేయుదువో నిర్ణయించుకోగలవు. ఇంతకూ నా పేరు చెప్పనైతిని. ఈ తొలిమెట్టుపై నిలిచిన నా నామధేయము వినోద రంజిత” అన్నది.

అప్పటి వరకూ… శీతాకాలపు సాయంత్రం తుషార బిందువులు కురిసినట్లు, సంధ్య వేళ సన్నజాజులు మెల్లిగా నేలకు జారినట్లు నెమ్మదిగా, అదే సమయంలో జలపాతం దుమికినట్లు, సెలయేరు ప్రవహించినట్లు అనుశృతంగా, నిరంతరాయంగా ధ్వనించిన ఆమె కంఠం, నిశ్శబ్దాన్ని ఆశ్రయించింది.

[వినోద రంజిత అంటే వినోదముతో రంజిత i.e. ఆనందితమైనది, వినోదంతో రంజింపజేయునది అనే అర్దాలున్నాయి. ఉదాసీనత దోషం: చెడు చేయటమే కాదు, చెడు చూస్తూ ఊరుకోవటం కూడా తప్పే! ఇదే వినోద రంజిత కథలోనూ ద్యోతకమౌతోంది. ఒకప్పుడు ఇలాంటి భావనలు ప్రజలలో ఉండేవి. చెడు నాప ప్రయత్నించే వాళ్ళమీద, ఇతరులకి సాయం చేయ ప్రయత్నించే వాళ్ల మీద జోకులు వేసి [వీడికేం పని లేనట్లుంది. కోడి గుడ్డు మీద ఈకలు పీకుతున్నాడు గట్రా!]మరీ, సమాజంలో చెడుపట్ల ‘ఉదాసీనత’ కలిగేటట్లు ప్రజలను ప్రభావపరిచారు.