నిన్ను చూడాలని ఉంది రా 197

“ఏం లేవు. నువ్వు హాస్టల్ కు, నేను రూంకు” అంటూ నడవబోయాడు.
“నేను వాడి షర్ట్ పట్టుకుని వెనక్కి లాగి “పొద్దున్నే రెడీ అయ్యి నీతో ఉండాలని వస్తే నువ్వేంటి ర వెళ్లిపోదాం అంటావ్” అన్నాను.
“సరే ఎక్కడికి వెళదాం?” అన్నాడు.
నేను టైం చూస్తే 10:40 అవుతోంది.
“సినిమా కు వెళదాం” అన్నాను.
“ఇప్పుడేం మంచి సినిమాలు లేవుగా?” అన్నాడు.
“ఏదో ఒకటి వెళ్దాం” అన్నాను.
“సరే పద” అంటూ నడిచాడు.
ఇద్దరం అలా నడుచుకుంటూ బస్ స్టాప్ దాకా వచ్చాం. బస్సు రాగానే ఎక్కేసి థియేటర్ దాక వెళ్లాం. వెళ్లి చూస్తే అక్కడ హౌస్ ఫుల్ అని బోర్డ్ పెట్టేశారు. ఇద్దరం ఒకరి ముఖాలు ఒకరం చూసుకున్నాం. ఏం చేద్దాం అన్నట్లు సైగ చేశాడు బావ. ఏమో అన్నట్లు సైగ చేశాను నేను.
“పద వెళదాం” అన్నాడు బావ.
“ఎక్కడికీ?” అన్నాను.
“నేను రూంకి, నువ్వు హాస్టల్ కీ” అన్నాడు.
“ఉహూ…బావా” అన్నాను గోముగా.
“సరే ఏం చేద్దామో నువ్వే చెప్పు” అన్నాడు.
“ఐతే నాతో రా” అన్నాను.
“ఎక్కడికీ?” అని అడిగాడు.
“ఏం మాట్లాడకుండా రా బావా” అంటూ చేయి పట్టుకుని లాగాను.
“తప్పుతుందా? పద” అన్నాడు.
నేను బావను చికెన్ షాపుకి తీసుకెళ్లి అరకిలో చికెన్ తీసుకు రమ్మన్నాను. బావ ఏం మాట్లాడకుండా వెళ్లి తీసుకొచ్చాడు. ఇద్దరం మళ్లీ బుస్సు ఎక్కి మేముండే ఏరియాకి వెళ్లిపోయాం. అక్కడ ఒక చికెన్ మసాలా ప్యాకెట్ ఒకటి కొనుక్కుని ఇంకా కావలసిన కూరగాయలు కొని రూంకు వెళ్లిపోయాం. వెళ్లడం తోనే బాగా అలసిపోయిన వాడిలా బెడ్ రూంలో దూరి బెడ్ పై వాలాడు బావ. నేను వంట రూంలోకి వెళ్లి వంట చేయడం ప్రారంభించాను. సరిగ్గా 12:15 గంటలకు వంట చేయడం పూర్తి అయిపొయింది. నేను బావ దగ్గరికి వెళ్లి చూస్తే మొద్దు నిద్రలో ఉన్నాడు.
“బావా…బావా…” అంటూ లేపాను.
బావ లేచి నన్ను చూసి ఏంటి అన్నట్లు కళ్లు ఎగరేశాడు.
“భోం చేద్దాం రా బావ” అన్నాను.
“నువ్వు తినెయ్, నేను తరువాత తింటాను” అన్నాడు.
“అదేం కుదరదు. వెళ్లి ముఖం కడుక్కుని తినడానికి రా” అన్నాను.
“పోవే…” అంటూ కళ్లు మూసుకున్నాడు.
“లెయ్ బావా” అంటూ చేయి పట్టుకుని లేపాను.
దాంతో వాడు బెడ్ మీద కూర్చున్నాడు.
“హాలిడే రోజు కూడా నాకు ఏంటి టార్చర్” అన్నాడు.
“నాకు చెప్పకుండా అన్నయ్య దగ్గరికి వెళ్లావు కదా అందుకే” అన్నాను. వాడు నన్ను ఒకసారి చూశాడు.
“ఏంట్రా అలా చూస్తున్నావ్?” అని అడిగాను.
వాడు లేచి నిలబడి నా ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని “ఐ లవ్ యూ సమీరా” అన్నాడు.
“సరేలే వెళ్లి ముఖం కడుక్కుని రా” అన్నాను.
“ఛీ…కొంచెం కూడా రొమాన్స్ తెలీదు” అంటూ బాత్రూంలోకి వెళ్లిపోయాడు.
వాడు వెళ్లగానే నవ్వుకుని డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్లాను. వాడు వచ్చి టేబుల్ మీద ఉన్న చికెన్ చూసి రుచి చూద్దామని చేయి పెట్టాడు. బాగా వేడిగా ఉండడం వల్ల కాలిందనుకుంటా.
“అమ్మా….” అంటూ అరిచి చేతిని వెనక్కి తీసుకున్నాడు.
“అయ్యో బావా…ఏమయ్యింది?” అంటూ వాడి చేతిని తీసుకుని గాలి ఊపడం మొదలుపెట్టాను.
నాకు చాలా బాధేసి కళ్లలో నీళ్లు తిరిగాయి. వాడు నా తల మీద చిన్నగా కొట్టి “నాకేం కాలేదు లేవే ఆ కుళాయి కట్టేసెయ్” అన్నాడు నవ్వుతూ. నేను వాడి వైపు కోపంగా చూశాను. నా కళ్లలో ఇంకా నీరు కారుతున్నాయి. వాడు నన్ను చూసి భయపడినట్లు నటిస్తూ కుర్చీలో కుర్చున్నాడు. నేను వాడి పక్కనే కూర్ఛుని “ఎందుకు రా ఇలా చేశావ్?” అన్నాను చిన్నగా వాడి భుజంపై కొడుతూ. వాడు ఏం మాట్లాడకుండా అన్నం వడ్డించి నా చేతికి ఇచ్చాడు. “ముందు నువ్వు తిను, నేను వడ్డించుకుంటాలే” అన్నాను.

1 Comment

  1. Super story plz continue.

Comments are closed.