నిన్ను చూడాలని ఉంది రా 196

“నాకు ఆరోగ్య బాగలేక పోతేనే ఇంత బాధపడ్డావే, ఒకవేళ నేను చనిపోతే ఏమైపోతావో? అని” అని అన్నాడు.
“ఏంట్రా ఆ మాటలు? ఇంకెప్పుడూ ఇలా మాట్లాడొద్దు” అన్నాను కోపంగా.
“అబ్బా ఆకలిగా ఉంది సమీరా” అన్నాడు.
“సరే పద ఏదైనా హోటల్ కు వెళ్లి టిఫిన్ తిందాం” అన్నాను.
ఇద్దరం బయటకి వచ్చాం. వాడు రూం లాక్ వేసి వచ్చాడు. ఇద్దరం నడుచుకుంటూ వెళ్తున్నాం.
“ఎన్నిసార్లు చెప్పినా కూడా నా మాట వినకుండా తయారయ్యావు” అన్నాడు.
“దేని గురించీ?” అన్నాను.
“రూంకు రావద్దు ఎవరైనా చూస్తే బాగోదు అంటే వింటావా? వినవు.” అన్నాడు.
“మా బావ రూం. నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, ఇష్టం వచ్చినప్పుడు వెళతాను మధ్యలో నీకేంటి?” అని అడిగాను.
“నాకు కాదు చూసేవాళ్లు తప్పుగా అనుకుంటారు” అన్నాడు.
“అనుకోనీ నాకేంటీ?” అంటూ వాడి చంక కిందుగా చేయి వేసి వాడి చేతిని పట్టుకుని నడవసాగాను.
అలా నడుచుకుంటూ హోటల్ కు వెళ్లిపోయాం.

మేము క్యాంటీన్ కు వెళ్లి ఒక టేబుల్ చూసుకుని కూర్చున్నాం.
“ఏం తిందాం?” అని అడిగాడు బావ.
“నీ ఇష్టం” అన్నాను.
బావ టూ ప్లేట్స్ ఇడ్లీ ఆర్డర్ ఇచ్చాడు. ఇంతలో నాకు ఒక డౌట్ వచ్చింది. బావను అడగాలనిపించింది.
“బావా…!” అని పిలిచాను.
“ఆ..” అంటూ నా వైపు చూశాడు.
“నాకు ఊరెళ్తున్నాను అని చెప్పి అన్నయ్య దగ్గరికి ఎందుకు వెళ్లావ్ రా?” అడిగేశాను.
“ఒక పర్సనల్ పని మీద వెళ్లాను” అని చెప్పాడు.
“అంటే నాకు చెప్పకూడదా?” అని అడిగాను.
“దానికి అర్థం అదే కదా” అన్నాడు నవ్వుతూ.
“సరేలే. ఈ ప్రపంచంలో నువ్వొక్కడివే తెలివైనవాడివి” అన్నాను.
“మరేమనుకున్నావ్” అన్నాడు కాలర్ ఎగరేస్తూ.
“చెప్తావా? చెప్పవా?” అని అడిగాను.
“అది నీకు తప్పా ఎవరికైనా చెప్పొచ్చు. కానీ నీకు చెప్పాలంటే ఇంకా టైం ఉంది” అన్నాడు.
“ఐతే అన్నయ్యను అడిగేస్తాను” అన్నాను.
“నాకు వాడి మీద నమ్మకం ఉంది. ఈ విషయం మాత్రం నీకు చెప్పడు” అన్నాడు.
“సరే పో ఏదో టైం రావాలి అన్నావుగా, అప్పటివరకు వైట్ చేస్తా” అన్నాను.
ఇంతలో ఆర్డర్ చేసిన ఇడ్లీ వచ్చింది.
“టైం కాదు ఇడ్లీ వచ్చింది తిను” అన్నాడు.
నేను ఫక్కున నవ్వేసాను. నేను నవ్వడం చూసి వాడు కూడా నవ్వాడు. అలా నవ్వుకుంటూ టిఫిన్ తినేసి బయటికి వచ్చాం.
“తరువాత ఏంటి ప్రోగ్రాం?” అన్నాను కళ్లు ఎగరేస్తూ.

1 Comment

  1. Super story plz continue.

Comments are closed.