నిన్ను చూడాలని ఉంది రా 196

“వెళ్దామా?” అని అడిగాను.
“పదండి మేడం” అన్నాడు.
“ముందు నువ్వు పద” అన్నాను.
వాడు రూం కీ అండ్ లాక్ తీసుకుని డోర్ వైపు నడవసాగాడు. నేను వాడిని అలాగే చూస్తూ “బావా” అని పిలిచాను.
‘మ్మ్” అని వెనక్కి తిరిగాడు.
“నన్నెప్పుడూ విడిచిపెట్టవు కదా?” అన్నాను. ఆ మాట చెబుతుంటే నా కళ్లలో నీళ్లు గిర్రున తిరిగాయి.
వాడు నా దగ్గరికి వేగంగా నడుచుకుంటూ వచ్చి “ఏయ్ ఏమైందీ?” అని అడిగాడు.
“ఏం లేదు పద” అన్నాను కళ్లు తుడుచుకుంటూ.
“నా దగ్గరే సీక్రెట్సా?” అన్నాడు.
“నువ్వు దాచగా లేనిది నేను దాస్తే తప్పేంటి?” అని అడిగాను తల దించుకుంటూ.
వాడు నా తల పైకి ఎత్తి “ఏంటి మేడం ఏం జరిగింది? నీ దగ్గర నేనేం దాచానో చెప్పు?” అని అడిగాడు.
“పొద్దున్నే అన్నయ్య కాల్ చేశాడు” అని చెప్పాను.
వాడు కాస్త భయపడి “అంతా చెప్పేశాడా?” అని అడిగాడు.
“నువ్వెందుకు దాచావ్ రా?” అని అడిగాను.
“అది చెప్పుకునేంత పెద్ద విషయం కాదే” అన్నాడు.
“అది నీకు చిన్న విషయం కావచ్చు. కానీ నాకు చాలా పెద్దది. పొద్దున వాడు చెబుతుంటే నాకు ఎంత బాధేసిందో నీకేం తెలుసు” అని చెప్పాను.
“దీనికంతటికీ కారణం వాడు. ముందు వాన్ని తన్నాలి” అన్నాడు.
“తప్పు నువ్వు చేసి వాన్ని అంటావే” అన్నాను సీరియస్ గా.
“తల్లీ మా అన్నాచెల్లెల్లకు ఒక దండం. మీ ఇద్దరు ఒకరి దగ్గర ఒకరు ఏ విషయాన్నీ దాచుకోరు అని తెలిసి కూడా వాడికి దాయమని చెప్పడం నా తప్పు” అని అన్నాడు చేతులు జోడిస్తూ.
“రేయ్ నీకు ఇదే లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి ఇలా చేస్తే చంపేస్తాను” అన్నాను.
“చంపెయ్యవే. అడగడానికి ఎవరూ లేరనే కదా లోకువ” అన్నాడు.
ఆ మాట వినగానే నాలో బాధా, కోపం కట్టలు తెంచుకున్నాయి.
“ఇంకోసారి ఇలా వాగావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు” అన్నాను అలాగే ఏడుస్తూ.
“ఐతే ఏం చేస్తావో ఒక క్లారిటీ తెచ్చుకో. తరువాత చూద్దాం” అన్నడు వెటకారంగా.
వాడు అలా అనగానే నేను వాన్ని కొట్టడం మొదలుపెట్టాను. వాడు అలాగే కొట్టించుకుంటున్నాడు. వాన్ని అలా చూడగానే నాకు బాధేసింది. వెంటనే వాన్ని గట్టిగా హగ్ చేసుకున్నా. వాడు కూడా నన్ను హగ్ చేసుకున్నాడు. వాడి కౌగిలి నాకు బాధ నుండి విముక్తి కలిగించే మందులా పని చేసింది. కాలం అక్కడే నిలిచిపోతే ఎంత బాగుంటుందో అనిపించింది. ఇంతలోనే వాడు ఏడుస్తున్నట్లు నాకు అనిపించింది. వాడి కౌగిలి నుండి బయటపడి వాన్ని చూస్తే వాడి కళ్లలో నీళ్లు.
“నువ్వెందుకురా ఏడుస్తున్నావు?” అని అడిగాను.
దానికి వాడు “ఏం లేదు?” అన్నాడు.
“అదిగో మళ్లీ ఏదొ దాచాలని చూస్తున్నావు?” అన్నాను కోపంగా.
“ఈ విషయం చెప్తే నీకు కోపం వస్తుంది” అన్నాడు.
“ముందు చెప్పు” అన్నాను.

1 Comment

  1. Super story plz continue.

Comments are closed.