నాకు నిజంగా నీ మీద అలాంటి ఫీలింగ్స్ లేవు, నువ్వు నాకు ఒక అక్క లాగా అని చెప్పా. అంతే అలా అన్నందుకు నా చెంప మీద ఒకటిచ్చి ఇంకోసారి అక్కా గిక్కా అన్నవంటే పళ్ళు రాలగొడతాను అని కోపంగా వెళ్ళిపోయింది. అప్పటి నుండి నేను కనిపిస్తే చాలు కోపంగా చూడడం, నేను ఏం చేయాలన్నా దానికి కావాలనే అడ్డు పడిపోవడం లాంటివి చేస్తూ వచ్చింది. నేను కూడా దేవేంద్ర అంకుల్ రమణ అంకుల్ కు ఇచ్చిన మాటను, వాళ్ళ అన్నయ్యను, ఇంకా ముఖ్యంగా నా ఫీలింగ్స్ ను దృష్ఠిలో పెట్టుకుని తనతో ఈ విశయం లో కాంప్రమైజ్ కాకుండా ఉండడం మంచిదని తనతో మాట్లాడకుండా ఉండడం మొదలు పెట్టాను. అందుకే తను ఇందాక వోదిలేసాననుకోకు అని మెసేజ్ పెట్టింది. నాకు తెలుసు తను పట్టు పట్టింది అంటే అస్సలు వొదిలే రకం కాదు అని. కానీ ఎలా ప్రొసీడ్ అవుతుంది అనేదే డౌటు అంతే..
రూప రాగానే అందరూ కంగ్రాటులేషన్స్ చెప్పారు. తరువాత పార్టీ నెమ్మదిగా మొదలైంది. అందరూ చేతిలో డ్రింక్ పట్టుకుని తాగుతూ ఉన్నారు. మధ్య మధ్యలో రూప నా వంక చూస్తూ ఉంది. నేను కూడా తనని గమనిస్తూ ఉన్నా. తను నేను గమనించడం చూసి నెమ్మదిగా మా నాన్న దగ్గరికి వెళ్ళింది. అక్కడ మా నాన్న ఇంకా దేవేంద్ర కలిసి తాగుతూ ఉన్నారు. రూప అక్కడికి వెళ్లే సరికి దేవేంద్ర అంకుల్ ఇంకో ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు రూప ఇంకా మా నాన్న ఇద్దరే ఉన్నారు వాళ్ళు ఏమీ మాట్లాడుకోవడం లేదు కానీ నాకు మాత్రం రూప మా నాన్నతో ఏం మాట్లాడబోతుందో అని ఆత్రుతగా ఉంది, కాబట్టి వెంటనే వాళ్లిద్దరూ నిలబడి ఉన్న గోడ దగ్గరికి అటు వైపు నుండి వెళ్ళా. వాళ్ళకి ఇప్పుడు నేను కనిపించను కానీ వాళ్ళ మాటలు నాకు బాగా వినిపిస్తాయి. అలా నేను నిలబడి ఉండగా కాసేపు ఇద్దరూ సైలెంట్ గా ఉండడం కనిపించింది. అక్కడ మ్యూజిక్ ప్లే చేస్తుంటే ఇద్దరూ వింటున్నారు. కాసేపటికి ఒకరిని ఒకరు చూసుకుని చిన్నగా నవ్వుకున్నారు.
మా నాన్నతో రూప సంభాషణ…
ఎంటి అంకుల్ కులాసాయేనా ? అంది రూప. దానికి మా నాన్న హా కులాసాయే అమ్మా, ఒకవేళ కాకపోయినా నిన్ను చూశాను కదా కచ్చితంగా అయ్యి తీరాల్సిందే అని అంటూ నవ్వాడు. రూప కూడా నవ్వుతూ సినిమా డైలాగ్ లు బాగా చెప్తారు అంకుల్ మీరు అంది. నిజానికి మా నాన్నకు రూప కు చాలా మంచి అనుబంధం ఉంది. మా నాన్న కు రూప ఎంత చెప్తే అంత అన్నట్లు. తన నడవడిక, సిన్సియారిటి, క్యారెక్టర్ అంటే మా నాన్నకు చాలా ఇష్టం. అలాంటి పిల్ల నీకు పుట్టినందుకు చాలా అదృష్టమంతుడివి రా నువ్వు అని దేవేంద్ర అంకుల్ ను ఎప్పుడూ పొగుడుతూ ఉంటాడు. ఈవెన్ మా నాన్నకు అంత అనుభవం ఉన్నా కూడా రూప ను వెళ్ళి సలహాలు అడుగుతూ ఉంటాడు. రూప గ్లాస్ లో డ్రింక్ తీసుకుని తాగుతూ ఎంటి అంకుల్ మీ అబ్బాయి ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంది తన ప్లాన్ ను అమలు పరుస్తూ..
మా నాన్న రూప అలా అడగగానే కొంచెం డల్ అయ్యి, ఎంటో అమ్మా మా వాడు అంతా చిత్రమైన పనులు చేస్తున్నాడు అన్నాడు. రూప ఏమైంది అంకుల్ అని అంది. దానికి మా నాన్న నీకు తెలీదా అమ్మా అంటూ నేను ఇలా ఒక కంపెనీ నా సొంతంగా నేనే మొదలు పెడదాం అని అనుకుంటున్నా అన్న విశయం తనకి చెప్పాడు. రూప మనసులో నవ్వుకుంటూ అయ్యో అవునా అంటూ తన మొదటి అస్త్రం ప్రయోగించింది. సొంత కంపెనా ? మన వినయా ? అంది పెట్టగలడా అన్నట్లుగా చూస్తూ. తనలా చూసే సరికి మా నాన్నకు అంతవరకు నా మీద కాస్తో కూస్తో ఉన్న నమ్మకం కూడా ఆ చూపు చూడగానే పోయింది. అలా నమ్మకం కోల్పోయి ఎంటమ్మా వీడు దానికి పనికి రాడు అంటావా అన్నాడు కాస్త మెల్లగా. రూప తెలివి గలది, తను ఏమైనా అనింది అంటే దాంట్లో ఎదో ఉండే ఉంటుంది అని మా నాన్న నమ్మకం అందుకే మా వాడు దానికి పనికి వస్తాడా రాడా అని రూపను అడిగాడు. రూప నవ్వుతూ నన్ను తక్కువ చేయకుండా అయ్యో అలా అంటారు ఏంటి అంకుల్ అతను మంచి పట్టుదల వున్నవాడు పనికి రాడా అని అడుగుతారు ఎంటి ? కచ్చితంగా కంపెనీ పెట్టి అనుకున్నది సాధిస్తాడు అని అంది అలా అనగానే మా నాన్న ముఖం సంతోషంగా వెలిగిపోయింది. అలా వెలిగిపోతూ ఉండగా రూప మనసులో నవ్వుకుంటూ తన ఇంకో అస్త్రాన్ని ప్రయోగించింది. కానీ ఒక్కటే సమస్య అంది. వెంటనే మా నాన్న ఏంటి అది అన్నట్లుగా చూసాడు. వెంటనే రూప కొంచెం సీరియస్ గా చెప్తున్నట్లుగా ఫేస్ పెడుతూ వినయ్ కు పట్టుదల అయితే ఉంది కానీ సరైన గైడెన్స్ఏ లేదు అదే ప్రాబ్లెమ్ అంది. మా నాన్న అర్దం కానట్లు చూసాడు. రూప తనని చూస్తూ వినయ్ ని చిన్నప్పటి నుండి చూస్తున్నా కదా తనకు ఇలాంటి వాటి మీద పెద్దగా పట్టు లేదు, తను ఆల్రెడీ ఉన్న వాటిని మెయింటైన్ చేయగలడు ఏమో కానీ ఇప్పుడు తనకున్న టాలెంట్ కు కంపెనీ స్టార్ట్ చేసి డెవలప్ చేయడం అంటే కష్టం అంది. దానికి మా నాన్న కాస్త ఢీలా పడిపోయి అయితే ఏం చేస్తే బాగుంటుందమ్మ అన్నాడు. రూప చిన్నగా నవ్వి తనని ముందు మీ కంపెనీ లోకి తీసుకోండి అంకుల్, అసలు కంపెనీని ఎలా నడిపించాలి ఎంత స్ట్రెస్ ఉంటుంది లాస్ ఎలా కవర్ చేయాలి ఇంకా తెలుసుగా కంపెనీ లో ఎలా ఉంటుందో అవ్వన్నీ ఎలా మేనేజ్ చేసుకోవాలో ప్రాక్టికల్ లా చుయించండి. ఒకవేళ మీరు డైరెక్ట్ గా వోదిలేసినా ఇవ్వన్నీ సొంత అనుభవం మీద తెలుసుకుంటాడు కానీ ఏం లాభం అంటూ అటు ఇటు చూసి ఇప్పటికే ఒక కంపెనీ లాస్ లో ఉంది ఇంకో లాస్ అవసరమా ? అంది. మా నాన్న అవును నిజమే అన్నట్లుగా చూసాడు. అందుకే అంకుల్ చెప్తున్నా తెలుసుకోవడం అయితే తెలుసుకుంటాడు సొంత అనుభవం మీద కానీ లాస్ వచ్చాక అది ఎవరు కవర్ చేస్తారు. ఇప్పటికే ఉన్న కంపెనీ లాస్ లో ఉంది అది సరిపోదా మళ్ళీ కొత్తది ఎందుకు అంది. మా నాన్న అవునవును అని అంటూ రూప వంక చూసి మళ్ళీ ఎదో గుర్తొచ్చిన వాడిలా కానీ వాడు నా మాట వినడే, ఎలా చెప్పేది అన్నాడు. రూప ఎందుకు వినడు అంకుల్ మీ కంపెనీ నే కదా అది. దాంట్లో ఉండడానికి ఏం సమస్య అతనికి అంది. దానికి మా నాన్న అయ్యో నీకు తెలీదు అమ్మా వాడికి నా కంపెనీ అంటేనే నచ్చదు నాది కాకుండా వేరే ఏదైనా సరే చేస్తా అంటాడు ఏమో కానీ నా కంపెనీ పేరెట్టితేనే వాడికి చెడ్డ చిరాకు అన్నాడు. తను ఎప్పుడెప్పుడు ఈ మాట అంటాడు అని ఎదురుచూస్తున్న రూప టక్కున మా నాన్నతో అయితే ఒక పని చేయండి అంకుల్ అంది. మా నాన్న ఏంటి అన్నాడు. రూప మనసులో నవ్వుకుంటూ మా నాన్నను చూస్తూ నేను ఎలాగో ఇప్పుడు ఒక కంపెనీని చూసుకుంటున్నా కదా, తెలిసిన వాడే, మన వినాయే కాబట్టి నాకు పియే గా చేరమనండి, సొంతంగా నేర్చుకున్నట్లు ఉంటుంది, మీ కంపెనీ మీద ఆధార పడలేదు అన్నట్లూ ఉంటుంది ఏమంటారు ? పైగా నేను ఉన్నాగా వాడికి ఏం కావాలో ఏం నేర్పించాల్లో తెలిసిన దాన్ని అంది. అంతే మా నాన్న ముఖం లో 1000 వోల్టా వెలుగు వచ్చింది. వెంటనే రూప చేతులు పట్టుకుని ఎంటి నిజమా అమ్మా నీ కింద మా వాడ్ని చేర్పించు కుంటావా ? అన్నాడు. మా నాన్న ఉద్దేశం లో రూప చాలా తెలివి గలది అంత తెలివి ఉన్న ఆమె నా కొడుకుని పీయే గా పెట్టుకుంటుంది అంటే వాడికి ఎంతో కొంత నాలెడ్జ్ ఉందని, ఇంకా రూప తో పని చేస్తాడు కాబట్టి ఆమె వళ్ళ ఎంతో కొంతైనా నేర్చుకుంటాడు అని మా నాన్న ఉద్దేశం. అది రూప కు మా నాన్న కళ్ళలో కనిపిస్తుంది. మా నాన్న కు ఇచ్చిన బూస్ట్ సరిపోలేదు అన్నట్లుగా రూప ఇంకా చెప్తూ వినయ్ కొంచెం నేమ్మదిగా నేర్చుకుంటాడు అందుకే నేను అనుకోవడం ఏంటంటే, వాడ్ని ఒక వన్ ఇయర్ నాతోనే పెట్టుకుని కంపెనీ ని ఎలా నడిపించాలో ట్రైనింగ్ ఇస్తాను ప్రాక్టికల్ గా అప్పుడైతే వినయ్ బాగా పిక్ అప్ అవుతాడు ఏం అంటారు అంది. దానికి మా నాన్న ఏం చెప్పమంటావ్ అమ్మా, అసలు ఇంత హెల్ప్ చేస్తావ్ అని కలలో కూడా అనుకోలేదు, ఏమైనా నీకు చాలా థాంక్స్ అమ్మా అని అన్నాడు చాలా ఆనందం తో. రూప మా నాన్న సంతోషాన్ని చూస్తూ పర్లేదు అంకుల్ వినయ్ ఏం పరాయి వాడా (నాక్కబోయే వాడే గా అనుకుంటూ) నాతోనే తిరిగాడు నాతోనే అన్నీ షేర్ చేసుకుంటాడు నేను ఆ మాత్రం చేయక పోతే ఎలా అంకుల్ అంది. దానికి మా నాన్న పొంగిపోయి చాలా థాంక్స్ అమ్మా, అంటూ రూప ను చూస్తూ నిజంగా ఒకవేళ వాడికి అక్కే లేకుంటే ఆ లోటు మాత్రం నువ్వు కచ్చితంగా భర్తీ చేసే దానివమ్మా అన్నాడు. అంతే అంతవరకు నవ్వుతూ ఉన్న రూప ముఖం కొంచెం సీరియస్ గా మారిపోయింది. కాబోయే మొగుడని నేను అనుకుంటూ ఉంటే నువ్వేంటి నీ కొడుకు లాగే అక్కా బొక్కా అనుకుంటూ అని ఇంకేదో మనసులో తిట్టుకోవడానికి చూస్తూ అంతలోనే పోనీలే కాబోయే మామగారే కదా క్షమించి వొడిలెద్దాం అని అనుకుని ఇంకాసేపు ఇక్కడే ఉంటే మళ్ళీ ఎక్కడ అక్కా అంటాడేమో అని మా నాన్నను చూస్తూ సరే సరే అంకుల్ ఇక మీరు వెళ్ళండి అక్కడ పాపం మా నాన్న ఒక్కడే కష్టపడుతున్నాడు అని అంది దేవేంద్ర ఒక్కడే తాగడం చూసి.
