టైం పొద్దున మూడు అవుతుంది. గది అంతా నిశబ్దంగా ఉంది. కిటికీ లో నుండి గాలి చల్లగా వీస్తూ ఉంది. నా భార్య రూప నా తొడల మీద తల పెట్టి హాయిగా నిద్రపోతోంది. తనలా నిద్రపోతూ ఉంటే నేను అలాగే మేలుకుని తననే చూస్తూ ఉన్నా. ఎందుకో తెలీదు తనని ఎంత సేపు చూసినా అలాగే తనని చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తుంది. తన రూపం తన మాటలు తన నడవడిక నాకు ఎప్పుడూ కొత్తగానే అనిపిస్తాయి.
తను నా తొడలపై పడుకుని ఇప్పటికి ఆరు గంటలు అయినా కూడా నేను తనని కదపకుండా అలాగే పడుకోబెట్టుకొని తననే చూస్తూ ఉన్నానంటే అర్దం చేసుకోండి నాకు తన్ని చూస్తూ ఉండడం అంటే ఎంత ఇష్టమో. పెళ్ళై ఇన్నాల్లైనా, తనని రోజూ చూస్తూ ఉన్నా, నాకు ఇంకా ఎందుకో తనని ఇలాగే ఇలాగే చూస్తూ ఉండిపోవాలి అని అనిపిస్తుంది. తనంటే నాకు అంత ఇష్టం. ఒకవేళ ఇష్టపడక పోయినా తను ఇష్ట పడేలా ఆకర్షిస్తుంది. నన్నే కాదు తన చుట్టూ ఎవరు ఉన్నా కూడా వాళ్ళని ఇట్టే ఆకర్షిస్తుంది. అదే తనలో నాకు బాగా నచ్చిన విశయం.
నిజానికి తను నా ఫ్రెండ్ చెల్లి. నా ఫ్రెండ్ కు ప్రేమ వివాహాలు అంటే అస్సలు నచ్చదు. కానీ నేను వాడి చెల్లి నే లవ్ మ్యారేజ్ చేసుకున్నా. నిజానికి నేను చేసుకున్నా అని అనడం కంటే తనే నన్ను చేసుకుంది అనడం కరెక్ట్ ఏమో. ఏంటి నేను ఇలా అంటున్నా అని అనుకుంటున్నారా ? పదండి నా గతం లోకి వెళ్దాం మీకే తెలుస్తుంది నేను ఎందుకు అలా అన్నానో అని..
నా పేరు వినయ్. మాది కొంచెం రిచ్ ఫ్యామిలీ అనే చెప్పాలి. నిజానికి చాలా రిచ్ ఫ్యామిలీనే కానీ మా నాన్నకు నమ్మకమైన బిజినెస్ పార్ట్ నర్స్ లేక చాలా ఆస్తినే కోల్పోయాడు. ఇప్పుడు కేవలం ఒక చిన్న పాటి కంపెనీని నడిపిస్తూ నన్ను కూడా అదే కంపెనీ లో వర్క్ చేయమని ప్రోస్తహిస్తు ఉన్నాడు. కానీ నాకేమో ఆ కంపెనీ లో వర్క్ చేయడం అంతగా ఇష్టం లేదు. అందుకే సొంతంగా నేనే పని నేర్చుకుని కొత్తగా ఏదైనా కంపెనీ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నా. మా నాన్నకు ఒక ప్రాణ మిత్రుడు ఉన్నాడు. అతనే దేవేంద్ర. అతను కూడా మా నాన్న లాగే చాలా బిజినెస్ లు చేసాడు. ఎన్నో అపజయాలను ఎదుర్కున్నాడు కానీ ఎప్పుడూ వెనక్కి అడుగు వేయలేదు. ఇప్పుడు అతనికి రెండు కంపెనీలు ఉన్నాయ్. సిటీ లో చాలా పేరు ఉంది అతనికి. అతనంటే మా నాన్నకు మా నాన్న అంటే అతనికి చాలా అంటే చాలా ఇష్టం. ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే మా రెండు కుటుంబాలు కచ్చితంగా కలవాల్సిందే. అదలా అలవాటు అయిపొయింది మాకు. ఆరోజు కూడా వాళ్ళ కంపెనీ ఆనువల్ టర్న్ ఓవర్ పెరగడం తో ఒక చిన్న పార్టీ ఆరెంజ్ చేశారు. ఎప్పటి లాగే మా ఫ్యామిలీ నే వాళ్లకు మొదటి గెస్ట్. కాబట్టి ఆరోజు మధ్యాహ్నం లోపు మా అమ్మా నాన్నా, మా అక్క బావ, నేను అందరం వాళ్ళ ఇంటికి చేరుకున్నాం. అన్నట్లు చెప్పడం మరిచి పోయాను. మా అక్క పేరు భాను తనకి పెళ్లి అయ్యింది. మా నాన్న పట్టు పట్టి మరీ ఇల్లరికం వచ్చే అల్లుడిని చూసి పెళ్లి చేశారు. మా బావ బాగా ఇంటెలిజెంట్, తను వేరే కంపెనీ లో వర్క్ చేస్తూనే మా కంపెనీ వర్క్స్ కూడా చూసుకుంటూ ఉంటాడు. మా నాన్నకు అతనంటే గౌరవం. బాగా సిన్సియర్ అని. అందుకేనేమో కూతురిని కూడా ఇచ్చి చేసాడు. ఇక విశయానికి వస్తే, మేము దేవేంద్ర అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఇంటి లోపలికి వెళ్తూ వుండగానే దేవేంద్ర అంకుల్ బార్య ఎదురొచ్చి మాకు ఆహ్వానం పలికింది.
దేవేంద్ర బార్య : ఎంటే పొద్దున రమ్మంటే ఇప్పుడా వచ్చేది ?
మా అమ్మ : అదేం లేదే వీడే కాస్త లేట్ చేసాడు ఆ పని ఈ పని అనుకుంటూ అంటూ నా వంక చూసింది.
ఆంటీ నా వైపు చూసి ఏరా ఇక్కడకు రావడం కంటే నీకు ముఖ్యమైన పని ఉందా అని అంది. నేను అమ్మ నా మీదకి చెప్పేసరికి తనని చూస్తూ ఆంటీ నన్ను అంటారేంటి, మా ఇల్లు పక్కనే కదా నేను లేట్ చేస్తే ఏమీ ? వాళ్ళు ముందే రావొచ్చుగా అన్నా. ఆ లాజిక్ కరెక్టే అని అనిపించడం తో ఆంటీ అమ్మ వైపు చూస్తూ నిజమే కదనే, వాడంటే లేట్ చేశాడు పక్కింట్లో ఉండి నీకు రావడానికి ఎంటే అడ్డం ? అంది. దానికి నేను నవ్వుతూ అలా అడగండి ఆంటీ అంటూ అమ్మ అక్క వంక చూసి కొంచెం వెక్కిరింపుగా రెండు గంటలు చేశారు ఆంటీ సింగారించడానికి మళ్ళీ ఇప్పుడు ఎదో నా మీద సాకులు చెప్తున్నారు అన్నా. ఆంటీ అమ్మ వంక చూసి అమ్మో ఏం దొంగవే నువ్వు వాడి మీదకి చెప్పి నువ్వు లేట్ చేసింది కప్పి పుచ్చుకుంటున్నావా అంది. అలా అంటూ ఉండగా అప్పుడే దేవేంద్ర అంకుల్ వచ్చాడు. నేను అంకుల్ ను చూసి వెంటనే సైలెంట్ అయిపోయా. (అంకుల్ అంటే కొంచెం భయం నాకు) హెలో వినయ్ అంటూ నా దగ్గరకు వచ్చాడు. నేను కొంచెం భయంగానే హెల్లో చెప్పా. అంకుల్ నా వంక సూటిగా చూస్తూ ఏంటి ఆల్రెడీ ఉన్న కంపెనీ ని వొదిలేసి వేరే ఎదో స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నావ్ అంట నిజమేనా ? అన్నాడు కాస్త బేస్ వాయిస్ తో. మామూలుగానే నాకు అంకుల్ అంటే భయం, ఎందుకో తనని చూస్తేనే నాకు భయం వేస్తుంది. అలాంటిది అంకుల్ అలా నా దగ్గరికి వచ్చి అలా అడిగేసరికి నాకు చిన్నగా వొణుకు వచ్చింది. నా అవస్థ చూసి నవ్వి మా నాన్న వంక చూసి సమాధానం చెప్పడానికే భయపడుతున్నాడు వీడా కొత్త కంపెనీని పెట్టేది అని గట్టిగా నవ్వాడు. నవ్వి మా నాన్న దగ్గరికి వెళ్తూ పదరా వాడు ఎన్ని వేషాలు వేసినా చివరికి నువ్వనుకున్నట్లు గానే నీ కంపెనీనే చూసుకుంటాడు లే అని అంటూ మా నాన్నని పై రూం లోకి తీసుకు వెళ్ళాడు. అలా వాళ్ళు వెళ్తుంటే ఆంటీ వాళ్ళని చూసి నాతో నువ్వు ఆయన మాటలేం పట్టించుకోకు నీకు నచ్చింది చేయ్ ఆయన అలాగే అంటారు అని అంది. నేను స్మైల్ ఇస్తూ థాంక్స్ ఆంటీ అని అన్నా.
