భ్రాంతి 5 140

‘ఆ మహిమ ఏమిటంటావా? శైలు అనే తిక్క పిల్లకి, కిరీటి అనే మంచి అబ్బాయికి లంకె వేసిందా విగ్రహం’ అని కిరీటి చెప్తే ఆటోమాటిగ్గా వాడి నెత్తి మీద ఓ మొట్టికాయ వెయ్యబోయింది శైలు. తలకున్న కట్టు చూసి ఆగిపోయింది.

కథ విన్నంత సేపూ శైలు ఓ trance లో వుంది. ఎప్పుడైతే వాడు కథ ఆపి తమ గురించి మాట్లాడాడో అప్పుడు దాని తాలూకా కనికట్టు వీగిపోయింది. ఆశ్చర్యంగా ‘ఇదంతా నీకెలా తెలుసురా’ అని అడిగింది. అన్నాళ్లనుంచీ లోపల వున్నదంతా కక్కేసిన కిరీటి అలసటగా ఆమె ఒళ్ళో వాలిపోయాడు. ‘ఒక ఊహ అంతే శైలూ. దాదాపు ఆరు నెలలనుంచీ ఆగకుండా ఈ కథ కలల్లో వస్తోంది. ఎప్పట్నుంచో నీతోనో నాన్నతోనో చెబ్దామనుకుంటున్నాను. ఇదిగో ఇవాల్టికి కుదిరింది. అంతేకాదు…’ అంటూ ధనుంజయ్ గురించి తనకొచ్చిన కల, అసలా ధనుంజయ్ ను ఎక్కడ కలిసిందీ ఏమిటీ కూడా చెప్పాడు.

‘అయ్యో కిరీటీ, ఇన్నాళ్లూ ఎవరికీ ఎందుకు చెప్పలేదురా? ఆ పిల్ల ఎక్కడుంటుందో తెలుసా నీకు? ముందు ఆ మాయల మరాఠీని సెక్యూరిటీ ఆఫీసర్లకి అప్పజెబితే వాళ్ళే మిగతా సంగతి చూసుకుంటారు’ అంది కోపంగా. సునయన గురించి వచ్చిన కలలు మటుకు చెప్పలేకపోయాడు కిరీటి. ఆ మాటను అప్పటికి దాటవేసి శైలుని శాంతపరచి పడుకోబెట్టాడు.

ఊరినుండి తిరిగొచ్చిన పెదబాబు పండగ రోజు జరిగిన గలాటా విని కోపంతో ఊగిపోయారు. అప్పటికప్పుడు ఇంటిమీదకి గొడవకొచ్చిన వాళ్ళని పట్టుకొచ్చి నరికెయ్యాలన్నంత ఆవేశం వచ్చింది ఆయనకి. అయితే జరుగుతున్నదానికంతటికీ మూలకారణం ఎవరో కనిపెట్టాలని కోపాన్ని అణుచుకున్నారు. ఊళ్ళో గొడవ చేసినవాళ్ళ గుట్టుమట్లు కనిపెట్టమని తనవాళ్ళకు పురమాయించారు. రెండు మూడు మధ్యవర్తుల లేయర్ల వెనక దాగుండి పని నడిపించిన వినయ్ గుట్టు చిక్కలేదు కానీ తన ఊరిమీద విగ్రహం కోసం ఎవరో యుద్ధం ప్రకటించారన్న విషయం మటుకు అర్ధమైంది ఆయనకు.

అవతల వినయ్ కూడా ఈ ప్లాన్ పని చెయ్యనందుకు బాధపడి చేతులు కట్టుకు కూర్చోలేదు. తన ప్రయత్నాలను ఇంకా ముమ్మరం చేశాడు. అతనికి తోచిన ఆఖరు అస్త్రం సునయన. ఆమెను తనదారికి ఎలా తెచ్చుకోవాలి అనేదానిపై తన పూర్తి దృష్టి పెట్టాడు.

కిరీటి,మిత్రులు డిగ్రీ రెండవ సంవత్సరం పరీక్షలు పూర్తి చేశారు. వేసవి సెలవులు ప్రారంభం అవుతూనే ఎప్పట్లానే స్నేహితులు కలిసి చుట్టుపక్కన ఊర్లని, పట్టణాలని దున్నేసి వద్దామనుకున్నారు. కానీ కిరీటి మటుకు ఊరెళ్తున్నానని చెప్పి ఒక నెలరోజులపాటు ఎక్కడికో వెళ్ళాడు.

అలా వెళ్లే ముందు వాడికి, శైలుకి మరో కలహం వచ్చింది. శేఖర్ దగ్గరకి నెలరోజులపాటు వెళ్తున్నా అని చెప్పేసరికి భగ్గున మండిపడింది శైలు. ‘ఒరేయ్, కాలేజీలో రాసుకు పూసుకు తిరిగితే నేనేమీ అడగలేదు. ఇప్పుడు నెల్నాళ్లపాటు ఎందుకురా అతని దగ్గరికి’ అని నిలదీసింది కిరీటిని. కిరీటి నిట్టూర్చి ఆమెని సముదాయించి కూర్చోబెట్టాడు. ‘శైలూ, నేను ఎప్పటిదాకా ఈ వూళ్ళో వుండగలను, చదువు పూర్తయ్యాక నాకు ఇక్కడ ఏం వుద్యోగం వస్తుంది? మీ ఇంట్లోనో నా ఇంట్లోనో మన విషయం ఎత్తాలి అంటే నాకు ఏదో పిచ్చి వుద్యోగం వుంటే చాలదు కదా. బైట ఎలాంటి అవకాశాలు వున్నాయో తెలుసుకోవడానికి అతనివెంట తిరుగుతున్నాను’ అని వాడు చెప్పేసరికి కూల్ అయ్యింది.

కిరీటి తిరిగొచ్చాక మళ్ళీ చెన్నపట్నం పోయి కిట్టిని కలిసివద్దాం అనుకున్నారు రంగ, గోరు. కానీ అనుకోకుండా వేరేచోటకు ప్రయాణం కట్టాల్సి వచ్చింది. ఆ ప్రయాణంలోనే మన సునయన కిరీటిని మళ్ళీ కలవబోతోంది.

కిరీటి పెంచలాపురం తిరిగొచ్చాక ఓ రోజు గోరు వాడి ఇంటికి వచ్చాడు. ‘మామా, మదరాసు బోయే కళ కనిపిస్తలేదురా ఈపాలి’ అన్నాడు. కిరీటి ప్రశ్నార్ధకంగా చూస్తే చేతిలో ఓ ఉత్తరం పెట్టాడు. ‘అక్క అందర్నీ ఓరుగల్లు రమ్మంటాంది. కాలేజీల ఏదో మెడల్ ఇస్తారంట అక్కకి. నిన్ను, శైలు మాడమ్ ని ఎంటబెట్టుకు రమ్మని మరీ మరీ సెప్పింది. నువ్వు బోయి ఆయమ్మిని పిల్చకరావాల’ అన్నాడు. ‘తనేమీ కరవదురా. నువ్వే పోయి చెప్పు’ అన్నాడు కిరీటి నవ్వుతూ. ‘ఊరుకోరా సామీ, ఆమె ఎప్పుడు శివాలెత్తుద్దో దేవుడికి కూడా తెల్వదు. నువ్వు ఎట్టనో గానీ కీలకం పట్టావు, నీమీద అరసట్లేదు గందా మాడమ్’ అన్నాడు.

శేఖర్ దగ్గర్నుంచి వచ్చాక కలవడం కుదరలేదు కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి శైలుతో మాట్లాడి వద్దాం అని బయల్దేరాడు కిరీటి. పెదబాబు గారిల్లు ఎప్పట్లానే హడావిడిగా వుంది. కిరీటిని చూసి ప్రెసిడెంటు గారు ‘ఏరా, ఏందీ టయాన దిగబడ్డావు’ అన్నారు నవ్వుతూ. కిరీటి వచ్చిన విషయం చెప్పాడు. శైలుని రమ్మని నిక్కి రాసిన ఉత్తరం చేతికందించాడు. ‘నువ్వు శానా ఎనకబడి ఉండావురా. ఆ బిడ్డ నీలాగా పెద్దంతరం సిన్నంతరం తెల్వని కూతురనుకున్నవా? ఈ ఇషయం నాకు సొయానా ఉత్తరమ్ముక్క రాసి సెప్పిందిలే. ఇహనో ఇప్పుడో మీ బాబు సేత రైలు టిక్కట్ తీపిద్దామని అనుకుంటాండా. నువ్వు రొంత లోనకి బోయి మా ఇంటిదాని కాడ సొమ్ములు తీసుకోని శైలమ్మకి టిక్కట్ బుక్ చేసిరా పో’ అని పంపించారు.

లోపల శైలు, తన అత్త రుక్కు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. వాడిని చూడగానే ఆమె ముఖంలో వికసించిన వెలుగు రుక్కు కళ్ళు దాటిపోలేదు. వచ్చిన విషయం చెబితే డబ్బులు తీసుకురావడానికి లోపలికి వెళ్లింది. శైలు గబుక్కున వాడి చెయ్యి లాగి తన పక్కన కూర్చోబెట్టుకుంది. కిరీటికి లోపల భయంగా వున్నా మెల్లిగా శైలు వీపు నిమురుతూ వుండిపోయాడు. ఎప్పట్నించో వాడి మదిలో వున్న ఓ ఆలోచన అమల్లో పెట్టడానికి ఈ ట్రిప్ ఎంచుకున్నాడు. ‘ఏయ్ శైలూ, వరంగల్ లో ఒక రెండు రోజులు వుండి వస్తాను అని చెప్పు మీ ఇంట్లో’ అన్నాడు. ఎందుకన్నట్టు చూస్తే ‘నీకొక చిన్న surprise’ అన్నాడు.

1 Comment

  1. Bro emindhi story update em levu story apesara leka ayipoindha konchm chppndi

Comments are closed.