భ్రాంతి 5 140

ఫ్రాన్స్-వా డిసౌజా తన స్టడీ రూమ్ లో కూర్చొని చేతిలో వున్న వస్తువుని తీక్షణంగా చూస్తున్నాడు. అది ఒక magnifying loupe. పసిపిల్లల గిలక్కాయ లాగా శబ్దం చేస్తోంది. Loupe పై లెన్స్ తెరిచి చూశాడు. ఐదు వజ్రాలు బయటపడ్డాయి. పక్కనే వున్న ఉత్తరం మళ్ళీ చదివాడు. వినయ్ కాతియా అనే పేరు సైలెంట్ గా మననం చేసుకున్నాడు.

దొంగతనం చేసిన పిల్ల రూపం మళ్ళీ కళ్ళముందు మెదిలింది. మామూలుగా ఐతే ఇక్కడితో ఈ ఆట ఆపేసేవాడు. వజ్రాలు తిరిగి తన చేతికొచ్చాయి. తప్పు చేసిన వాళ్ళందరికీ తన పవర్ ఏమిటో తెలిసేలా చేశాడు. వేరే వ్యాపకంలో పడిపోయేవాడే. కానీ మళ్ళీ ఆ అమ్మాయి రూపం గుర్తొచ్చింది. నో, ఒకసారైనా ఆమె యవ్వనాన్ని రుచిచూడందే వదలకూడదని నిర్ణయించుకున్నాడు.

******************

వినయ్ కాతియా మనసంతా అల్లకల్లోలంగా వుంది. ఎలా వచ్చారో తెలీదు, అతని హోటల్ గదిలోకి ఒక అర్ధరాత్రి ఇద్దరు మనుషులు చొరబడ్డారు. మాలినిని తీసుకెళ్తున్నామని చాలా కూల్ గా చెప్పి వెళ్లారు. తమ కన్ను అతడిపై వుందని, ఏమార్చే ప్రయత్నాలు చేస్తే ఏం జరుగుతుందో చాలా వివరంగా చెప్పి వెళ్లారు. చాలాకాలం పాటు తనను అంటిపెట్టుకొని వున్న మాలినిని కోల్పోవడం అతడ్ని మానసికంగా ప్రభావితం చేసింది. Sure, ఆమె చెప్పిన దొంగతనం ప్లాన్ బెడిసికొట్టింది. కానీ, సఫలమై వుంటే వచ్చే డబ్బు కోసం ఆ రిస్క్ చెయ్యవచ్చు అనిపించింది ఆ సమయంలో.

తన స్టేటస్ మీద తనకేమీ అపోహలు లేవు వినయ్ కు. తానేమీ నేరప్రపంచపు యువరాజు కాదని తెలుసు అతడికి. ఒకప్పుడు తనలో ఉన్న అలాంటి పిచ్చి ఊహాల్ని ధనుంజయ్ పటాపంచలు చేశాడు. మొట్టమొదటిసారి నిజాయితీగా ధనుంజయ్ ను, అతడి guidance ను తానెంత మిస్ అవుతున్నాడో గుర్తించాడు.

తన జేబులోంచి చిన్న డైరీ బయటకు తీసి ప్రస్తుతం తను తలపెట్టిన దొంగతనాలన్నిటినీ ఒకసారి పరిశీలించి చూశాడు. తక్కువ సమయంలో ఎక్కువ ధనం సంపాదించే వెంచర్ ఏదో గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక ఈ దేశాన్ని వదిలిపోవటం బెటర్ అనుకుంటున్నాడు. ఉత్తరాదిన ఎలాగూ కాలుపెట్టలేడు. ఇప్పుడు వేసిన తప్పటడుగుతో దక్షిణాదిన కూడా దారులన్నీ మూసుకుపోతున్నాయి అనిపిస్తోంది అతడికి.

ఒక పేజీలో circle చేసి వుంచిన పంచలోహ విగ్రహం జాబ్ ను చూశాడు. కొంతకాలంగా దీన్ని పక్కన పెట్టి వుంచడంతో తనపైన కన్నేసివుంచిన వాళ్ళకి ఈ జాబ్ గురించి తెలిసే అవకాశం లేదని నిశ్చయించుకున్నాడు. తననెవరూ ఫాలో కాకుండా చూసుకొని ఢిల్లీలో ఒక అడ్రెస్ కి ‘still interested?’ అనే ఒక వాక్యపు టెలిగ్రాఫు పంపించాడు.

ఇక మిగిలింది ఒకే ఒక పని. సునయనను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని డిసైడ్ అయ్యాడు.

ఈ మధ్య ప్రతి రాత్రి జరుగుతున్నట్టే ఆ రాత్రి కూడా కిరీటి ఓ కలగంటున్నాడు. కల మొదలైన దగ్గర్నుంచీ వాడి మనసు కీడు శంకిస్తూనే ఉంది. భయంకరమైన ఉత్పాతం ఏదో సంభవించబోతోంది అని వాడి మనసు హెచ్చరిస్తోంది. ఎంత ప్రయత్నించినా కలను వీడి వెళ్లలేకపోతున్నాడు. జరుగబోయేది చూసి తీరాలి అని ఏదో శక్తి వాడిని పట్టి నిలిపివేస్తోంది.

ఈసారి తనెవరి శరీరంలో ఉన్నాడో తెలియట్లేదు, కానీ అతడు చెయ్యరాని పని ఏదో చెయ్యబోతున్నట్టు కిరీటి మనసంతా గజిబిజిగా వుంది. మనిషి మంచి బలిష్టంగా వున్నాడు. తన ఊరివాడే అనుకుంటా చుట్టుపక్కన కనిపిస్తున్న ప్రదేశాలన్నీ గుర్తుపడుతున్నాడు కిరీటి. ఊళ్ళో జనాలందరూ ఉత్సాహంగా ఉన్నారు. చుట్టూతా పండగ వాతావరణం నెలకొని ఉంది. కొంచెం దూరంలో కోలాహలం వినిపిస్తోంది. ఆ మనిషి జనాల తాకిడికి కొంత దూరంగా వెనక్కు వెళ్ళి నిలబడ్డాడు.

ఒక రెండు నిముషాల్లో ఓ ఊరేగింపు ఆ వీధిలోకి వచ్చింది. ఆ మనిషి ఊరేగింపు బండివైపే సూటిగా చూస్తున్నాడు. కలలో సైతం సూర్యుడి పంచలోహ విగ్రహం మెరిసిపోతోంది. చూపు తిప్పకుండా దాన్నే చూస్తున్నాడా మనిషి. ఇంతలో పూజారి పక్కనున్న యువకుడిపై అతని దృష్టి పడింది. ఆ మనిషి ఆ యువకుడ్ని గుర్తుపట్టి తలపంకించాడు. కలలో కిరీటి నిశ్చేష్టుడై తనని తాను వేరే వ్యక్తి కనులనుండి చూస్తున్నాడు. వాడు ఆ సంవత్సరం రెండుసార్లు ఊరేగింపులో పాల్గొన్నాడు. ఇది సంక్రాంతి నాటి ఊరేగింపా లేక రథసప్తమి ఊరేగింపా తెలియడం లేదు వాడికి. ఊరేగింపు జరిగినంతసేపూ బండిని ఫాలో అయ్యాడా మనిషి.

కిరీటికి ఒక విషయం మటుకు స్పష్టం అయింది. ఈ మనిషికి సూర్యుడి విగ్రహంపై అలివిమాలిన interest వుంది. ఊరేగింపు మాయమయ్యి చీకటిలో పిల్లగాలిని ఆస్వాదిస్తూ నిలబడ్డాడు ఆ మనిషి. చిరుచీకట్లు కమ్ముకుంటున్నాయి. మెల్లిగా నడుస్తూ వెళ్తుంటే సంతలో కట్టిన నాటకాల స్టేజి కనబడింది. మెల్లిగా అటువైపు అడుగేశాడా మనిషి. జనాలు కొంచెం పల్చగా వున్నారు చివరి వరుసల్లో. అక్కడికి పోయి కూర్చుందామనుకుంటూ మళ్ళీ తెలిసిన ముఖం కనిపించగానే ఆగిపోయాడు. కిరీటి మళ్ళీ తనను తాను శైలుతో కలిసి వుండగా చూసుకున్నాడు.

కనులు మూసి తెరిస్తే ఈసారి గుడిముందు నిలబడ్డాడు ఆ మనిషి. తన చేతిలోని రెండు సన్నటి చువ్వలతో గుడి తలుపుల తాళాలను అలవోకగా ఓపెన్ చేసి, శబ్దం చేయకుండా తలుపులు తెరిచి లోపలకు అడుగుపెట్టాడు. ఏం జరుగబోతోందో తెలిసి ముందుకు అడుగేయకుండా ఉండటానికి కిరీటి గింజుకుంటున్నాడు. ఆ మనిషి పిల్లి అడుగులతో ఉత్సవ విగ్రహాన్ని నిలిపి వుంచిన మండపాన్ని చేరుకున్నాడు. విగ్రహం పక్కనున్న దీపాలు కొండెక్కబోతున్నాయి.

1 Comment

  1. Bro emindhi story update em levu story apesara leka ayipoindha konchm chppndi

Comments are closed.