భ్రాంతి 5 140

గత కొద్ది వారాలుగా ఏ మూలో ఆమె మదిలో దాగున్న దిగులు ఆమె ముఖంలో ప్రతిఫలించేది. కిరీటి ఈ మాట చెప్పగానే శైలు ముఖం విప్పారింది. ‘చెప్పరా, సస్పెన్స్ లో పెడితే నాకు కోపం వస్తుందని తెలుసు కదా’ అని ఉడుక్కుంది. ‘ఊహూ, నీకు నచ్చుతుందో లేదో తెలీదు. ఇప్పుడే చెప్పేస్తే మజా వుండదు’ అన్నాడు నవ్వుతూ.

మొత్తానికి గోరు కుటుంబం, శైలు, కిరీటి వరంగల్ బయల్దేరి వెళ్లారు. వీళ్ళని రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్ కి వచ్చిన నిక్కి అందర్నీ చూసి దాదాపు ఏడ్చినంత పని చేసింది. తనైతే కన్నీళ్లు ఆపుకుంది కానీ ఆమె తలిదండ్రులు మటుకు కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. అందర్నీ కౌగిలించుకుంటూ వచ్చిన నిక్కి కిరీటిని హగ్ చేసుకొని మెల్లిగా వాడి చెవిలో ‘I missed you so much’ అని చెప్పింది. అందరిముందూ సమాధానం చెప్పలేక మెల్లిగా ఆమె చెయ్యి నొక్కి వదిలాడు కిరీటి.

‘ఇంక వెళ్దామా’ అని రాజన్న అడిగితే ‘ఇంకొకళ్లు కూడా రావాలి’ అని ఆపేసింది నిక్కి. వీళ్ళు వచ్చిన బండిలోనే AC కోచ్ లోంచి దిగాడు శేఖర్. అతను రాజా గారి అబ్బాయి అని పరిచయం చేసేసరికి నిక్కి కుటుంబం నిశ్చేష్టులైపోయారు. తడబడుతూ తమ కృతజ్ఞతలు చెప్పుకుంటుంటే వారించి అందరితో కలిసి బయల్దేరాడు శేఖర్.

మెడల్ ప్రదానోత్సవం చాలా బాగా జరిగింది. నిక్కీ తన చదువు పూర్తికావడానికి సహాయపడ్డవాళ్ళకి పేరుపేరునా థాంక్స్ చెప్పింది తన స్పీచ్ లో. ఆనాటి సాయంత్రం ఊరినుంచి వచ్చిన అందరూ ఒక హోటల్ కి వెళ్ళి నిక్కి విజయాన్ని, సంతోషాన్ని పంచుకున్నారు. శేఖర్ ను తప్పించుకు తిరిగింది చాలాసేపు శైలు. కానీ చివరకు కలవనే కలిశారు. శేఖరే మాట కలిపాడు. జంకుతూ పొడిపొడిగా మాట్లాడింది శైలు. వెళ్లిపోతూ శేఖర్ ‘మీరు చాలా లక్కీ. ఆ అబ్బాయి మీకోసం ఎంత కష్టపడుతున్నాడో నేను చూస్తున్నాను. మీ ఇద్దరూ బాగుండాలని నా విషెస్’ అంటూ కిరీటి వైపు చూపిస్తే శైలు ఉలిక్కిపడి చూసింది. శేఖర్ నవ్వి ‘అతను నాకు తప్ప ఎవరికీ చెప్పలేదు లెండి. అందుకే నేను మిమ్మల్ని విసిగించడం ఆపేశాను’ అన్నాడు.

ఓ క్షణం ఆగి ‘కాకపోతే మీరు ఇద్దరూ ఒక సంవత్సరం పాటు విడివిడిగా వుండాలి అని తెలిసినా అతను తను అనుకున్న దారిలోనే ముందుకి వెళ్లడానికే నిర్ణయించుకున్నాడు చూడండి, అది చాలా brave డెసిషన్’ అంటే ఈ సారి హారర్ నిండిన కళ్ళతో చూసింది శైలు. తను చేసిన తప్పేంటో తెలిసొచ్చిన శేఖర్ ఆమె పక్కన కూర్చుని ‘సారీ శైలు గారు, మీకీ విషయం చెప్పే వుంటాడనుకున్నాను. మీ ఇద్దరి మధ్యన నా మూలంగా గొడవ రాకుండా వుంటే చాలు. అతన్ని పిలిచి మాట్లాడుతా’ అంటూ లేవబోతుంటే ఆపేసింది శైలు. ‘వాడేం చెప్తాడో, ఎప్పుడు చెప్తాడో వాడికే వదిలేస్తాను. మీరేమీ అనకండి’ అని వారించింది.

ఇక మిగతా సమయమంతా అన్యమనస్కంగా గడిపిండి శైలు. వీళ్ళు బస చేసిన హోటల్ కి వచ్చాక మర్నాడు చిన్న ప్రోగ్రాం వుందని, అందరూ ఉదయం ఏడింటికల్లా తయారుగా వుండాలి అని చెప్పి పంపించాడు కిరీటి.

1 Comment

  1. Bro emindhi story update em levu story apesara leka ayipoindha konchm chppndi

Comments are closed.