భ్రాంతి 5 140

ఇదంతా చూస్తున్న రుక్కుకి వాళ్ళిద్దరిమధ్యా వున్నదేమిటో ఓ అవగాహనకు వచ్చింది. రాత్రికి ఓ రెండు ముద్దలు బలవంతంగా శైలు చేత తినిపిస్తూ మాట కలిపింది. ‘అమ్మీ, పిలగాడు బంగారమేనే. కాకుంటే సిన్న పిల్లోడు. అన్నీ ఆలోచించవే, ఇయన్నీ కుదిరే పనులు కావే తల్లీ’ అంటే శైలు ‘ఇంక ఆలోచించేది ఏమీ లేదు’ అని ఒక్కముక్కలో తేల్చిపారేసింది. పొడిగించడం ఇష్టంలేక రుక్కు అప్పటికి వదిలేసింది. కానీ తన పెనిమిటి దగ్గర ఈ విషయాన్ని ఎలా ఎత్తలో తెలీక ఆమె గుండె భారమయ్యింది.

అర్ధరాత్రి వేళకు కిరీటికి మెలకువ వచ్చింది. పక్కనే శైలు కుర్చీలో జోగుతోంది. తల మొత్తం పోటెత్తిపోతోంది. వాళ్ళ నాన్న నేర్పినవన్నీ గుర్తు చేసుకుంటున్నాడు. మెల్లిగా చేతిని నుదుటి దగ్గరకు తీసుకెళ్ళాడు. కట్టు గట్టిగానే కట్టారు అనుకున్నాడు. చూపులో ఏమన్నా తేడా వుందా అని పరికించి చూస్తున్నాడు. నడకలో తేడా వుందో లేదో ఒక రెండడుగులు అటూ ఇటూ నడిచి చూశాడు. బాలన్స్ ఏమీ తప్పకపోయేసరికి ఊపిరి పీల్చుకున్నాడు. కరెంటు పోయినట్టుంది అక్కడక్కడా కొన్ని కొవ్వొత్తులు వెలిగించారు ఇంట్లో. తలతిప్పి చూస్తే పూజగదిలో సూర్యుడి విగ్రహం కనిపించింది. ఎప్పట్లాగే చీకట్లోనూ కాస్త మెరుస్తోంది.

అలా నడుచుకుంటూ వెళ్ళి దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. చల్లగా వుంది. తీసుకెళ్లి నుదుటికి ఆనించాడు. ఆ చల్లదనానికో ఏమో ఓ నిముషం అయ్యేసరికి లేచినప్పటికంటే ఇప్పుడు పదిరెట్లు మంచిగా ఫీల్ అయ్యాడు. మళ్ళీ విగ్రహాన్ని చేతిలో అటూ ఇటూ తిప్పి చూశాడు. ‘ఏం కావాలి నీకు’ అని మెల్లిగా అడిగాడు.

వెనగ్గా అలికిడి ఐతే తలతిప్పి చూశాడు. శైలు నిలబడి వాడినే విప్పారిన కళ్ళతో చూస్తోంది. రమ్మని చెయ్యి జాపాడు. పరుగున వచ్చి వాడి కౌగిట్లో వాలిపోయింది. ఏదో మాట్లాడడానికి నోరు తెరిస్తే ముద్దు పెట్టి ఆపేశాడు. ‘నేను బాగానే వున్నాను. చిన్న దెబ్బే, పర్లేదు’ అన్నాడు. ఇంకా దీనంగానే చూస్తుంటే ‘నీకు నాకు matching’ అంటూ శైలు నుదుటిపై వున్న గాయం తాలూకు మచ్చని నిమిరాడు. విరిసీ విరియని పెదాలతో ఓ చిన్న నవ్వు నవ్వింది.

ఆమెను అలాగే పట్టుకొని మళ్ళీ విగ్రహాన్ని చూస్తున్నాడు. ‘ఇక వెళ్దాం రారా’ అంటే శైలు వంక చూసి మెల్లిగా ఆమె చేతిని తీసుకొని విగ్రహానికి తాకించాడు. అసంకల్పితంగా వెనక్కు లాగేసుకోబోతుంటే ఆమె చేతిని తనచేతిలో బంధించాడు. భయంభయంగా వాడిని చూసింది శైలు. ‘నీకేమీ కాదు దీన్ని పట్టుకుంటే. గుర్తుందా, పోయినేడాది నువ్వే నా చెయ్యి పట్టుకొని తీసుకొచ్చి అదిగో విగ్రహం తీసుకెళ్లమని చెప్పావు’ అంటే మూగగా తలూపింది. ‘ఇందా అక్కడ పెట్టెయ్యు’ అని విగ్రహాన్ని ఆమె చేతికందించాడు. ఓ నిప్పుకణికను హ్యాండిల్ చేస్తున్నట్టు గబగబా పూజగదిలో పెట్టేసింది.

‘నువ్వు నీ గదిలోకి పోయి పడుకో’ అంటే వెళ్లనని మొండికేసింది. ‘నువ్వు వెళ్ళి పడుకుంటే నేను కూడా కాసేపు పడుకుంటాను’ అంటే ‘నువ్వు పడుకో, నాకు ఎలాగూ నిద్ర రావట్లేదు’ అంది. ‘ఒక కథ చెప్తాను, వింటూ పడుకుందువు’ అని బలవంతాన తీసుకెళ్ళాడు. గది అంతా కొంచెం ఉక్కగా వుంది. వాడే వెళ్ళి కిటికీ తలుపులు తెరిచాడు. ‘ఊ, ఇంక పడుకో’ అంటే బలవంతాన వచ్చి పడుకుంది. ఓ పేపరు చేతిలోకి తీసుకొని ఇద్దరికీ గాలొచ్చేలా విసురుతున్నాడు.

‘కథ చెప్తానన్నావు’ అంటే ‘ఎక్కడ మొదలు పెట్టాలా అని ఆలోచిస్తున్నాను’ అన్నాడు. వాడి చేతిలో చెయ్యి వేసి వుండిపోయింది శైలు. మెల్లిగా తనకొచ్చిన కల ఒకటి చెప్పడం మొదలెట్టాడు. వాడు కథ చెబుతుంటే శైలు కళ్ళముందు ఏదో తెరవేసి చూపించినట్టు చిత్రాలు కనిపిస్తున్నాయి.

అనగనగా ఒక ఊరిలో ఓ ముసలాయన, ఆయన పేరు పెంచలయ్య. అతడికున్న ఆస్థల్లా నాలుగైదు బర్రెలే. మన కథ మొదలయ్యే రోజున పశువులు కాసుకుంటూ సెలయేటి ఒడ్డున చెట్టు కింద సేద తీరుతున్నాడు. ఇక సాయంకాలమైంది. ఇంటికి చేరేముందు బర్రెలకు నీళ్ళు పట్టించడానికని తీసుకెళ్తుంటే ఆయన కాలికి ఏదో తగిలింది.

ముందు ఏదో మోడు తాలూకా వేరు అనుకున్నాడు. పెద్దగా పట్టించుకోలేదు. వరుసగా ఓ నాలుగైదు రోజులు అలానే తగులుతుంటే చిరాకేసి దాన్ని పెకలిద్దామని ఓ రోజు కొడవలి తీసుకొచ్చాడు. బర్రెల్ని వాటిమానాన వదిలేసి రోజూ కాలికి అడ్డం పడుతున్న దానిదగ్గర కూర్చుని మట్టిబెడ్డల్ని పెళ్లగిస్తున్నాడు. తవ్వి తీస్తే ఓ మట్టిముద్ద బయటికొచ్చింది. అది ఏ మొద్దు వేరులానూ లేదు. చూడడానికి చిన్నగానే వుంది కానీ బాగా బరువుంది. ఏమై వుంటుందా అనే కుతూహలంతో దాన్ని తీసుకెళ్లి సెలయేట్లో కడిగి చూశాడు.

మట్టి కరిగిపోతున్న కొద్దీ ముసలాయన కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవవుతున్నాయి. చివరకు ఒక విగ్రహం ఆయన చేతిలోకొచ్చింది.
గాభరాగా చుట్టూతా చూశాడా ముసలాయన. దగ్గర్లో ఎవరూ కనిపించలేదు. మిలమిలా మెరిసిపోతున్న విగ్రహాన్ని తీసుకెళ్లి తన జోలెలో పెట్టేశాడు. చాలా బీద కుటుంబం ఆ ముసలాయనది. పెంచలయ్యకి ఒక కొడుకు కూడా వున్నాడు. అతడి పేరు మున్నా. పెళ్ళయి ఇద్దరు చిన్న పిల్లలు కూడా వున్నా ఇంకా కుదురు లేదు మున్నాకి. గాలితిరుగుళ్ళకి బాగా అలవాటు పడ్డాడు.

ఆర్ధిక పరిస్థితి అంతంతమాత్రంగా వున్న పెంచలయ్యకి ఆ విగ్రహం చూసేసరికి ఆనందం, భయం ఒకేసారి కలిగాయి. విగ్రహం అమ్మేస్తే తమ కష్టాలు తీరుతాయి అన్న ఆశ, ఈలోపే ఎవరన్నా దాన్ని తీసేసుకుంటేనో అన్న భయమూ దొలిచేస్తున్నాయి ఆయన్ని. ఇంటికి త్వరగా చేరుకొని ఎవరికీ కనబడకుండా తన ముల్లె తీసుకెళ్లి తలగడకింద దాచాడు. ఓ రాత్రివేళ లేచి ఇంట్లో అందరూ నిద్రలో వున్నారు అని నిశ్చయించుకొని విగ్రహాన్ని బయటకు తీశాడు.

1 Comment

  1. Bro emindhi story update em levu story apesara leka ayipoindha konchm chppndi

Comments are closed.