జీవితం 505

ఇప్పటికీ అంతే. యల్.వి.యల్.కి వీరాభిమానిని. బీటాను సెక్స్ పరంగా ఊహించుకో లేదు గాని తీటాను చూస్తేమాత్రం తీటగా వుండేది. ఆ శరీరాన్ని చుట్టేసుకుంటే ఎంత మెత్తగా వుంటుందో అనుకునే వాణ్ని. ఏమైనా తీటా నన్ను చూడ్డం లేదుగా, ఆమె చూపు రాజాగాడి మీదగా వుంది అన్న ఆలోచన డామినేట్ చెయ్యడంతో ఆమె పట్ల విరక్తి చెందాను. అసలింతకీ వాళ్లకి మేం ర్యాంకులిచ్చిన సంగతి తెలిసిందా? వాళ్ళెవరూ అబ్బాయిలతో మాట్లాడేవాళ్ళు కాదు. కాలేజి ఆవరణలో ఒక అబ్బాయి, ఒక అమ్మాయి మాట్లాడుతూ వుంటే చుట్టూ వరండాలలోంచి, క్లాస్ రూముల్లోంచి, కొన్ని వందల కళ్ళు గమనిస్తూ ఉండేవి. వాళ్ళను ప్రిన్సిపాల్ చూస్తే మాత్రం బ్యాండే. అయినా వాళ్ళు కూడా తగిన జాగ్రత్తలు తీసుకునే ఆ మీటింగులు పెట్టుకునే వాళ్ళని నా అనుమానం. మా క్లాస్ వాళ్ళైతే ఏనాడూ అలా కనపడలేదు.

అసలింతకీ రాజాగాడు తీటాను పట్టాడా? రెండేళ్ళు ఒకే క్లాస్ లో ఉన్నాం. ఏమన్నా జరిగిందా? ఏమీ జరగలేదనే నా అభిప్రాయం. రాజాకి తీటా మీద కంటే తీటాకే రాజా మీద క్రష్ అని నా అనుమానం. నాకేమో తీటా మీద క్రష్. ఆమె దృష్టిలో నేను పడనే లేదు. ఒకవేళ పడితే మాత్రం ఏమన్నా పొడిచే వాణ్నా. ఊహూ..ఆమే చొరవ తీసుకోవాలి, నాతో మాటలు కలపాలి, ప్లేసు, టైము, అన్ని ఏర్పాట్లూ చెయ్యాలి, నన్ను తీసుకెళ్లాలి. సీక్రెసీ జాగ్రత్తలు తనే తీసుకోవాలి. అప్పుడు మనం ఏదైనా చెయ్యొచ్చు. ఇదీ నా మైండ్ సెట్. ఆమె నన్ను పట్టించుకోక పోవడం కరెక్టే కదూ. ఇదిలా ఉంచితే, రాజా గాడు పంతులమ్మల్ని కూడా కామెంటు చేసే వాడు. ఇంగ్లిష్ లెక్చరర్ సువర్ణకుమారికి వెంకాయమ్మ అని పేరు పెట్టాడు. ఆమె కుర్ర లెక్చరర్. యం.ఏ. పాసవ్వగానే ఉద్యోగంలో చేరింది. పాతికేళ్ళు ఉంటాయేమో. అప్పటికింకా పెళ్లి కాలేదు. ముఖం బాగుండేది. మంచి హైటు, చక్కటి చీర కట్టు, వంపుసొంపుల శరీరం. ఆ ముఖంలో కాస్త చిరునవ్వుంటే ఎంత బాగుండేదో. మా 60మంది అబ్బాయిలమూ ఆమె అడుగులకు మడుగులొత్తే వాళ్ళం కాదూ. పాపం ఆమె వ్యక్తిగత విషయాలేమిటో గాని, ఎప్పుడూ చాలా సీరియస్ గా వుండేది. అబ్బాయిల్ని తిడతా వుండేది. పాపులర్ అవ్వాల్సిన ఆమె అన్ పాపులర్ అయింది. ఒక రోజు ఆమె క్లాసు లోకి ఎంటర్ అవుతుండగానే ‘వెంఖాయమ్మా’ అని అందరికీ వినపడేట్లు అరిచాడు రాజశేఖర్. ఎవర్రా అది అని కోపంగా అరిచింది మేడం. రాజశేఖర్ వంక అనుమానంగా చూసింది. వాడు బుద్ధిమంతుడు లాగా తలొంచుకుని టెక్స్ట్ బుక్కు పేజీలు తిప్పుతున్నాడు. చెప్పండి ఎవరా కూత కూసింది. ఎవడా రాస్కెల్, స్కౌండ్రల్, ఇడియట్, ఫూల్,…….తిడుతూనే వుంది. ఎవ్వరూ కిక్కురు మనలేదు. అందరికీ తెలుసు నేరస్థుడెవరో. అమ్మాయిల్లో మేడం అంటే ఇష్టం, రాజా మీద కోపం వున్న వాళ్ళున్నారు. వాళ్ళు కూడా నోరు విప్పలేక పోయారు. అంతకు ముందు వరకు నేను ఆవిడ క్లాస్ చాలా ఎంజాయ్ చేస్తూ ఉండే వాణ్ణి. పాఠం ఏమీ ఎక్కేది కాదు. ఆమెని చూస్తూ తన్మయం చెందే వాణ్ణి. సౌందర్యారాధన. పది,పన్నెండేళ్ళు ముందు పుట్టిఉన్నట్లయితే ఈ అందాన్ని సొంతం చేసుకునే వాణ్ని కదా అనుకునే వాణ్ణి. ఆ కోపం చూసి భయమేసింది. ముందు పుట్టి ఉండక పోవటం కరెక్టేలే అని సమాధాన పడ్డాను.

ఆల్ఫా అంటే మహీపాల్ గాడికి మహా క్రేజ్. నేను కూడా కొంచెం ఆయిల్ పోశా. ఒరే వసుంధర అంటే అర్ధం తెలుసా అన్నా. చెప్పరా అన్నాడు. వసుంధర అంటే భూమిరా, మహి అన్నా భూమేరా, నువ్వు మహీపాల్ అంటే భూమిని పాలించే వాడివి, వసుంధరను ఏలుకునే వాడివి అన్నాను. వాడు పొంగి పోయాడు. నాకు పార్టీ యిచ్చాడు. అంటే ఉడిపి హోటల్లో మైసూర్ బజ్జీ, కాఫీ. మరప్పట్లో అదే బ్రహ్మాండం. ఇంటర్ అయ్యాక వాళ్లిద్దరికీ మెడిసిన్ సీట్లు వచ్చాయి. ఐతే ఒక కాలేజీలో కాదు. చెరొక కాలేజీలో. నాకప్పుడు రాలేదు. వాడికి, నాకు గ్యాప్ వచ్చింది. వాడు ఫోర్త్ ఇయర్ లో పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకున్నాడు. పెళ్ళికి నన్ను పిలవలేదు. అది పరవాలేదు. నాతో ఒక మాట చెప్పొచ్చుగా. వాడు చేరిన కాలేజీలోనే నెక్ష్టు బ్యాచిలో చేరానుగా. వాడి కోసం నేను ఆల్ఫా దగ్గరికి వెళ్లి కాళ్ళు పట్టుకుని బతిమాలే వాణ్ణిగా. “నీ కోసం వాడు ప్రాణాలివ్వడానికి రెడీగా వున్నాడు, వాణ్ని కనికరించావంటే నీకొక పుణ్యం, ఒక లాభం దక్కుతాయి, వాడి ప్రాణాలు కాపాడిన దాని వవుతావు – అది పుణ్యం. జీవితాంతం నీ చెప్పు చేతల్లో వుండే మొగుడు దొరుకుతాడు – అది లాభం.” అని ప్రాధేయ పడితే ఆమె హృదయం కరిగేది కాదూ? అదేమన్నా పాషాణమా? వాడికి పోయి అడగటానికి దమ్ము చాలలేదు. సదా మీ సేవలో అన్నట్లు నేనొకణ్ణి వున్నాను కదా, నన్ను వాడుకోవచ్చుగా. వాడికి సాయపడే అవకాశం ఇవ్వనందుకు వాడి మీద కోపం వచ్చింది. అసలు వాడి ప్రేమ నిఖార్సయినదేనా అని డౌట్ వచ్చింది. డిగ్రీని, భార్యను తీసుకుని అమెరికా వెళ్ళాడు, బాగానే సెటిలయ్యాడు. ఆమధ్య అంటే మూడేళ్ళకిందట ఇండియాకు వచ్చాడు. ఒక పార్టీలో కలిశాము. ఆల్ఫా ఇంగ్లాండు లో ఉంటున్నదని ఉవాచ. ఏరా ఆల్ఫాను మర్చిపోయినట్లేగా అన్నాను. నో అని ఉద్వేగంగా అన్నాడు. ఆల్ఫా నా హృదయంరా అన్నాడు. వాడికి ఇప్పటికీ ఆల్ఫాఅంటే క్రష్ వుందట. నీ బొందలే అనుకున్నాను. నేనే సన్నాసి ననుకుంటే వీడు నన్ను మించిన సన్నాసిలాగున్నాడే అనుకున్నాను. నేనెట్లా సన్నాసిని అంటే రుక్కూ గురించి చెప్పాలి.

రుక్కూ గుర్తుకు రాగానే నా గుండె కలుక్కుమంది. మైండు బ్లాక్.
ఒద్దు ఇప్పుడు రుక్కూ గురించి ఒద్దు. రుక్కూ జ్ఞాపకాలు పక్కకు జరిపి మరల ఇంటర్ జ్ఞాపకాల్లోకి వెళతాను. పారిజాతం, కామాక్షి, కుమారి – వీళ్ళ గురించి చెప్పాలి.[/size]

పారిజాతం నాకంటే ఏడాది పెద్దది. నేను ఇంటర్లో చేరాను. తను పియుసి లో చేరింది. మా కాలేజి మేం ఉంటున్న ఇంటికి దగ్గరే. నడిచి వెళ్ళే వాణ్ణి. ఆమెని ట్యుటోరియల్ కాలేజీలో చేర్చారు. వాళ్ళ ఊళ్ళో కాలేజీ లేదు. వాళ్ళ నాన్నగారు, మా నాన్నగారు మంచి ఫ్రెండ్సు. మొదట హాస్టల్లో చేర్చారు గాని, మధ్యలో ఒకసారి బాగా జ్వరం వచ్చింది. అప్పుడు మాఇంటికి తీసుకొచ్చి వైద్యం చేయించారు. తగ్గిన తర్వాత హాస్టల్ వద్దు మా ఇంట్లోనే వుండి చదువుకో అన్నారు మా అమ్మా నాన్నా. వాళ్ళ కాలేజీ కూడా మా ఇంటికి దగ్గరే. మా పేరెంట్సు ని అత్తయ్య, మామయ్య అని పిలిచేది. మొదట్లో ఈమెను ప్రత్యేకంగా గమనించలేదు.