భ్రాంతి 3 145

కిరీటి మైండ్ లో ఏదో అలారం మోగుతోంది. ‘ఏమంటున్నావురా? దొంగలు గుళ్ళో పడి చచ్చిపోయారా? అసలు ఊళ్ళో వాళ్ళకి ఎలా తెలిసింది దొంగలు పడ్డారని?’ అంటూ ప్రశ్నలు గుప్పించాడు.

‘దొంగోళ్ళు మన సేతికి సిక్కలే. అర్ధరేత్తిరి టయంలో గుళ్ళోనుంచి కేకలు ఇనబడ్డాయి. అట్టాన్టి ఇట్టాన్టి కేకలు కాదు. మడుసులు ఎవరూ అలాగ అరవడం ఎప్పుడూ ఇన్లేదని సెప్పాడు మా అయ్య. జనాలు గుడికాడకి ఎల్లే తలికి గుడి తాళాలు బద్దలు కొట్టున్నాయంట. లోపలికి పోయిన మొనగాళ్ళు వణికిపోతా బయటికొచ్చారు. నీళ్ళ బిందిలో పట్టేతంత రగతం సాములోరి ఇగ్రహం కాడ జూసి అందరికీ మాటలు పడిపోయినయ్యి. పెసిడెంటు గారింటి కాడ రేత్తిరి నించీ పెద్ద పంచాయితీ నడుస్తాంది.’ అంటూ బాంబు లాంటి వార్త చెప్పాడు.

కిరీటి, రంగా ఆ మాట విని షాక్ లో వున్నారు. ‘ఊరు ఊరంతా రేత్తిరి నిద్దర పోలే. ఊళ్ళోకొచ్చే దార్లు మూసేసినారంట. సంత లేపేసినారు పొద్దుగాలే అంటాండారు’ చెప్పుకుపోతున్నాడు గోరు. ఇంతలో రాజన్న వస్తూ కనిపించాడు. వీళ్ళ దగర ఆగి కిరీటితో ‘అబ్బీ, నీకు కుదిరినంక ఓ తూరి పెసిడెంటు గారింటికి పో. మీ అయ్యని రమ్మని కబురంపిండు పెదబాబు. నువ్వు కానబడితే పంపియ్యమండు’ అని చెప్పాడు.

‘వెళ్తున్నా బాబాయి’ అని చెప్పి ప్రెసిడెంటు గారింటికి బయల్దేరాడు కిరీటి. అక్కడంతా కోలాహలంగా వుంది. ఎప్పుడూ రాత్రిళ్ళు ఆయన ఇంట్లో పడుకునే ఇద్దరు పాలెగాళ్ళు కాక ఇంకొక పది మంది జమాజెట్టీలు కాపలా కాస్తున్నారు అక్కడ. పెదబాబు అరుగుమీద కూర్చొని చుట్టూతా వున్న జనాలతో మాట్లాడుతున్నారు. కిరీటిని చూడగానే ‘రేయ్, మీ బాబు పనికి కావల్సిన టయంలో ఎప్పుడూ ఊళ్ళో వుండడా? ఇంత గలాటా జరుగుతాంది, ఇప్పుడా ఊరిడిసి పొయ్యేది’ అంటూ చిందులు తొక్కడం మొదలెట్టారు.

అప్పుడే టీ గ్లాసులతో బయటికి వచ్చిన ఆయన భార్య ‘చాల్లే ఊర్కోండి. ఆచారి పక్కన లేకపోతే కాళ్ళు చేతులు ఆడట్లేదు అని చెప్పాల్సింది పోయి కుర్రాడి మీద అరుస్తారా? అబ్బీ, నువ్వు లోపలికి రా అయ్యా. పంచాయితీ తెమిల్చి లోపలికి రా, ఇంత తిని పో ఊళ్ళోకి. మళ్ళీ ఇంటి మొగం ఎప్పుడు చూస్తావో’ అని పెదబాబుని కసిరి కిరీటిని లోపలికి తీసుకెళ్లింది.

‘ఏమన్నా తిన్నావా బాబూ?’ అని అడిగి కిరీటి సమాధానం చెప్పేలోపే ఓ ప్లేట్ లో ఉప్మా పెట్టి ఇచ్చింది. మంచి ఆకలి మీద వున్నాడేమో కిరీటి మారు మాట్లాడకుండా తినేశాడు. ‘అబ్బీ, రాత్రి గలాటా విన్న కాడ్నించి శైలమ్మ కంటి మీద కునుకు లేకుండా నీ పేరే కలవరిస్తాంది.’ కిరీటి గుండెల్లో రాయి పడింది. నిన్న జరిగింది శైలు ఈవిడకి ఏమన్నా చెప్పిందో ఏమో అని భయపడసాగాడు.

కిరీటి ముఖంలో భయం చూసి ‘భయపడాకు, ఈ కొన్ని నెలలుగా నువ్వు, నిక్కమ్మ లేకుంటే నా బిడ్డ ఏమైపోయేనో. ఎప్పుడు చూసినా మీ ఇద్దరి మాటలే దానికి. ఓ పాలి దాన్ని చూసిరా. అట్నే నీ సేత్తో ఏమన్నా తినిపియ్యి. నా వల్ల కాటల్లేదు దానితో ఏమన్నా కతికియ్యడం. తొరగా పోయిరా, ఆయన లోపలికొస్తే నిన్ను పనిలో ముంచేస్తాడు’ అని ఉప్మా ప్లేట్ ఇచ్చి శైలు గదిలోకి పంపింది.

గదిలో శైలు మంచమ్మీద పడుకొని ఉంది. మూడంకె వేసుకొని చేతులు కాళ్ళ మధ్య పెట్టుకొని చిన్న బాల్ లా ముడుచుకొని వుంది. కోడి నిద్రలో వుందేమో కిరీటి అడుగుల చప్పుడు వినగానే చటుక్కున తల ఎత్తి చూసింది. వాడ్ని చూడగానే లేచి కూర్చుని పెద్ద పెద్ద కళ్ళతో వాడ్నే చూస్తోంది. కిరీటి తన పక్కన కూర్చోగానే వాడ్ని తన చేతులలో చుట్టేసి మొహం వాడి ఛాతీలో దాచేసుకొని ఏడవడం మొదలెట్టింది.

ఆమెను అలాగే పొదివి పట్టుకొని ఒక రెండు నిమిషాలాగి ‘శైలూ, ప్లీజ్ ఆపు. ఎందుకేడుస్తున్నావు? చూడు’ అంటూ పైకి లేపాడు. ‘రాత్రి జనాలతో పాటు వెళ్ళావా?’ అని అడిగింది. ‘నువ్వు నమ్మవు, నేను రాత్రి నిద్ర లేవలేదు. గోరు చెప్పేవరకు ఏం జరిగిందో కూడా తెలీదు నాకు’ అన్నాడు.

‘థాంక్ గాడ్, నువ్వూ నీ మొద్దు నిద్ర.’

‘మీ అత్తయ్య నువ్వు నా పేరు కలవరించావని చెప్పారు’ కొంచెం బెరుగ్గా అన్నాడు కిరీటి. ఈసారి వాడ్నింకా గట్టిగా పట్టుకొని వుండిపోయింది. ‘నాకెంత భయమేసిందో తెలుసా నీ గురించి? దొంగలు విగ్రహం పట్టుకుని రక్తం కక్కుకున్నారని చెప్పారు. నిన్న నువ్వు కూడా విగ్రహం పట్టుకెళ్ళావు ఇక్కడ్నుంచి. నీకేమన్నా ఔతుందేమో అని రాత్రి అంతా ఎంత గాభరా పడ్డానో.’

‘నేనేమన్నా దొంగనా, నాకేమన్నా అవడానికి?’ నవ్వుతూ అడిగాడు. కానీ శైలు నవ్వే మూడ్ లో లేదు. ‘అది కాదురా, నిన్న నువ్వు చక్కగా ఊరేగింపు కోసం పవిత్రంగా వస్తే నేను…నేను… నిన్ను పట్టుకొని, ముద్దు పెట్టుకొని పిచ్చిదాన్లా behave చేశాను’ అంటూ వణికిపోసాగింది.

‘శైలూ, డోంట్ వర్రీ. నాకేమీ కాలేదు. వాళ్ళు రక్తం కక్కుకున్నారని ఏంటి గ్యారంటీ? ఏదన్నా తగిలి వాళ్ళ కాళ్ళు చేతులు కోసుకుపోయి వచ్చిన రక్తమేమో అది. అసలు జరిగింది ఎవరన్నా చూసారా? పూర్తిగా వివరం తెలీకుండా ఇలా భయపడితే ఎలా? మనకు తెలిసిందల్లా ఎవరో గుడి తాళాలు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారని మాత్రమే’ అంటూ సముదాయించాడు. శైలు కొంచెం శాంతించడం చూసి మెల్లిగా ఉప్మా తినిపించాడు. ‘రెస్ట్ తీసుకుంటావా, నేను మళ్ళీ కలుస్తాను’ అని అడిగాడు.

3 Comments

  1. Superb bro story ilane continue chyndi manchi flow lo undhi madhyalo apakandi dayachesi

  2. Ilanti vedavapooku stories ni continue ga post chestaru.

    1. Indhulo vedapuku em undhi Andi.. ante story motham sex untene adhi story na Ila unte story avadha Andi … Dengudu stories kavali ante xossipy site undhi andhulo adhi visit chyndi…. Ayina istam lekapothe silent ga undochu ga endhuku comment petti mari gelukovadam… Sorry emina athiga matldithe ?…

Comments are closed.