భ్రాంతి 4 100

ఇక ధనుంజయ్ రిటైర్ అవుదామనుకుంటుండగా సునయనను చూశాడు. దారుణమైన పరిస్థితిలో వున్న ఆ పిల్లను చూసి జాలిపడి తన పంచన చేర్చుకున్నాడు. సునయనను కూడా తన పనులకు వాడుకుందామనుకున్న వినయ్ కు ఆమె జోలికి వెళ్లద్దని వార్నింగ్ ఇచ్చాడు. ఐనా వినయ్ కన్ను ఆమె పైన వుండడం చూసి మెల్లిగా నేరప్రపంచం నుంచి సునయనను దూరం చెయ్యడం మొదలెట్టాడు.

ధనుంజయ్ ఎప్పుడైతే పెంచలాపురం విగ్రహం పట్టుకొని చావుబతుకుల్లోకి పోయాడో అప్పట్నుంచి సునయనను కార్నర్ చేయడానికి ట్రై చెయ్యడం మొదలెట్టాడు వినయ్. ధనుంజయ్ నేర్పిన పాఠాలతో వాడికి చిక్కకుండా నెట్టుకొస్తూంది మన సునయన.

ఇదిలా వుంటే అదే సమయంలో సూరత్ నుంచి పారిపోయి వచ్చిన మాలిని కపూర్ అనే ఒక కారెక్టర్ వినయ్ కు తగులుకుంది. వజ్రాల వ్యాపారకేంద్రం ఐన సూరత్ నుంచి వచ్చిన ఆ మాలిని తను అక్కడ తెలుసుకున్న కొన్ని విషయాలను వినయ్ కి నూరిపోసింది. మళ్ళీ ఉత్తరాదిన జెండా పాతాలని అతడి చెవిలో జోరీగలా పోరింది.

వినయ్ గతం గురించి ఏ మాత్రం తెలియని సునయనను అనేక సంవత్సరాల తర్వాత ఆ కాతియా వంశస్థుడు నేరం చెయ్యమని ఉత్తరాదికి పంపాడు. అందినంత చేజిక్కించుకొని పారిపొమ్మని చెప్పిన ధనుంజయ్ మాటలను గుర్తు తెచ్చుకొని ఇదే తన ఆఖరు దొంగతనం అనుకుంటూ నైనిటాల్ చేరుకుంది సునయన.

**************

బ్రిటిష్ వాళ్ళు మన దేశంలోని ఎండలకు తట్టుకోలేక ఎక్కడ చల్లని ప్రదేశాలు కనిపిస్తే అక్కడ residencies డెవలప్ చేసేసుకున్నారు. అలా వాళ్ళు చేరిన ఒక ప్రదేశమే నైనిటాల్. మన పురాణాల ప్రకారం ఈ ప్రదేశానికి చాలా ప్రాముఖ్యం వుంది. దాని గురించి మరోసారి మాట్లాడుకుందాం. ఇంతకీ అలా బ్రిటిష్ వాళ్ళు, ఆ తర్వాత మిగతా యూరోపియన్ కాలనిస్టులు కట్టుకున్న కొన్ని విల్లాల్లో ఇప్పుడు చాలామంది ధనవంతులు వుంటున్నారు. అలాంటి ఒకానొక విల్లా ఈ “లా విల్లా బ్లూ” – అంటే అచ్చ తెలుగులో నీలి భవనం.

ఈ నీలి భవనంలో వుంటున్న డిసౌజా చాలా వ్యాపారాల్లో వేళ్ళు పెట్టి అన్నిట్లోనూ విపరీతంగా కలిసిరావడంతో చాలా డబ్బు వెనకేసాడు. డబ్బు మదంతో సొసైటీలో మిగతా అందరూ పాటించే రూల్స్ తనకు వర్తించవు అన్నట్టు మారిపోయాడు. ఎవరన్నా సరే తనకు ఏ మాత్రం ఎదురు చెప్పినట్టు అనిపించినా వాళ్ళని డబ్బుతోనో కుదరకపోతే తన మందీ మార్బలంతోనో కొట్టే అలవాటు ఏర్పడిపోయింది. డబ్బు కట్టల్ని విసిరి వింత వింత వస్తువులు పోగెయ్యడం కూడా మొదలెట్టాడు.

అతని లేటెస్ట్ మోజు వజ్రాలు. తెల్లగా ధగధగలాడే వజ్రాలే కాక అరుదైన రంగు వజ్రాలు కూడా కొంటున్నాడు ఈ మధ్య. ఇవన్నీ ప్రభుత్వానికి తెలియకుండా సాగిస్తున్నాడు. కొన్న వజ్రాలను certify చేయించడానికి, ముడి వజ్రాలను సాన బెట్టటానికి మన దేశంలో వజ్రాల వ్యాపార కేంద్రమైన సూరత్ నుంచి experts ను కూడా రప్పిస్తున్నాడు. అలా రావాల్సిన expert సుందర్. కానీ వస్తోంది సునయన.

సున్నితమైన సీతాకోక చిలుక తన రెక్కల్ని ఆడించడం వల్ల అంతిమంగా ఎక్కడో పెనుతుఫాను చెలరేగితే దాన్నే butterfly effect అంటారు. మన ఈ కథ దీనికి రివర్స్ అనుకోండి. ప్రపంచంలో ఎక్కడెక్కడో జరిగిన అనేక సంఘటనలు చివరికి పాపం మన పెంచలాపురంలో కిరీటి జీవితాన్ని మార్చేశాయి. ఉత్తరభారతాన జరిగిన నేర ప్రపంచపు అల్లకల్లోలాలు వినయ్ అనే వ్యక్తిని మనవాడికి భౌగోళికంగా దగ్గరగా తెచ్చాయి. అలాగే ప్రపంచంలో మరోచోట జరిగిన సంఘటనలు ఈ సారి ఆ వినయ్ ను, తద్వారా సునయనను మనవాడి జీవితంలోకి డైరెక్ట్ గా తీసుకొచ్చాయి.

అది చెప్పుకునే ముందు సునయన ఎదుర్కొబోతున్న disaster గురించి చెప్పుకోవాలి.

ఉదయం 7:45 కు ‘లా విల్లా బ్లూ’ ముందు ఒక కారు ఆగింది. అందులోనుంచి బూడిద రంగు పాంట్, పింక్ కలర్ చొక్కా, పైన చలి ఆపటానికి కార్డిగన్ వేసుకున్న ఒక అమ్మాయి దిగింది. మనిషి మోడెర్న్ డ్రస్ వేసుకున్నా ముఖం చూస్తే నార్త్ ఇండియన్ లా వుంది. గేట్ సెక్యూరిటీ ఆమెకు సెల్యూట్ కొట్టి ఎవరు కావాలని అడిగాడు. బదులుగా ఆమె డిసౌజా కార్డ్ అతని చేతికందించింది. దాని వెనుక 8:00 am అని మాత్రం రాసుంది. ‘మీరు కావాలంటే డైరెక్ట్ గా వెళ్లొచ్చు, కానీ కారు చెక్ చేశాక మేమే లోపల పార్క్ చేస్తాము’ అని చెప్పాడు గార్డ్.

తల పంకించి చిన్న హాండ్ బాగ్ తీసుకొని లోపలికి వెళ్లింది సునయన. విల్లా అత్యద్భుతంగా వుంది. సునయనకి లోపల చాలా బెరుగ్గా వున్నా ప్రస్తుతం తన కారెక్టర్ లో ఇమిడిపోవడానికి ప్రయత్నిస్తోంది. పల్లెటూరి బైతులా కళ్ళప్పగించి తను నడుస్తున్న గార్డెన్ వే ను, ఫ్రెంచ్ ఆర్కిటెక్చరు ప్రతిబింబిస్తున్న విల్లాని చూడాలని లోపల్లోపల ఉన్నా ఇలాంటి భవనాలకు రావడం తనకు కొత్తేమీ కాదన్నట్టు వెళ్ళి గెస్ట్ సిటింగ్ ఏరియాలో కూర్చుంది. 8 గంటలవగానే ఫ్రాన్స్-వా డిసౌజా పై ఫ్లోర్ నుంచి కిందకు వచ్చాడు.

‘మిస్టర్ డిసౌజా, ఐ యామ్ మాలిని కపూర్ ఫ్రమ్ జోయా కన్సల్టెన్సీ’ అంటూ పరిచయం చేసుకుంది సునయన. ఇది సునయన చేసిన మొదటి తప్పు. సొంత పేరుగానీ, తెలిసిన వాళ్ళ పేరు కానీ ఎప్పుడూ జాబ్ లో వాడొద్దు అని నూరిపోశాడు ధనుంజయ్. కానీ ఈ జాబ్ నేను చేయలేను అని చెప్పినా కూడా తనని ఇందులోకి దించిన వినయ్, మాలినిల మీద వున్న కోపం ఆమెను ధనుంజయ్ నేర్పిన పాఠాలను పెడచెవిన పెట్టేలా చేసింది.