భ్రాంతి 4 100

తను, వాడు ఎక్కడ వున్నారో, అందరి ఎదుటా ఇప్పుడు తనన్న మాటలు వాడికి ఎంత గుచ్చుకున్నాయో వాడి కళ్ళలో కనిపించిన hurt చూసి ఆమెకు తలపుకొచ్చేసరికి చాలా ఆలస్యం అయిపోయింది. ‘సారీ మేడమ్’ అంటూ వెళ్ళి కూర్చుండిపోయాడు కిరీటి. క్లాసంతా వాడినే చూస్తుంటే ఇంకా ముడుచుకుపోయాడు. ఆ రోజు కలిగిన ఏకైక లాభం శైలు పెద్ద కరోడా అని స్టూడెంట్ల మదిలో ముద్ర పడడం. కిరీటి లాంటి మంచి స్టూడెంట్ మీదే అరిచేసిందంటే మేడమ్ చాలా స్ట్రిక్ట్ అని ఫిక్స్ అయ్యారు అందరూ. దొంగచూపులు చూస్తూ దొరికిపోతే ఇంకేం చేస్తుందో అని భయపడి అబ్బాయిలు తల దించుకొని వెళ్లిపోతున్నారు ఆమె పక్కనుండి.

కాలేజీ అయిపోయాక వాడిని పట్టుకొని సారీ చెబుదామని చాలా ప్రయత్నించింది శైలు. వాడి ఫ్రెండ్స్ ఇద్దరితోనూ వుండడంతో ఒంటరిగా చిక్కలేదు వాడామెకి. వాడి ఇంటికి వెళ్ళి వెయిట్ చేసింది చాలాసేపు. ‘ఇలా ఎప్పుడూ లేట్ గా రాడమ్మా. ఎందుకో మరి ఇవాళ ఇంతాలస్యం చేస్తున్నాడు. చీకటి పడకముందే ఇంటికి పో. నిన్ను రేపు కలవమని చెప్తాను’ అని రమణాచారి ఆమెను పంపించేశాడు.

మరుసటి మూడు రోజులూ ఆమె కంటబడకుండానే తిరిగాడు కిరీటి. ఇదుగో ఆదివారం రాత్రికొచ్చేసరికి వాళ్ళ తొలి కలహం ఈ స్థాయికి చేరింది. పెదబాబుని పిలిచి రుక్కు ‘ఆచారి గారి పిలగాడు, మన అమ్మి గొడవ పడతాండారు లాగుంది. ఇదేమో మూడంకె యేసుకు కూకుంది. ఇయ్యాల ముద్ద కూడా మింగలేదు. రేపు ఆచారిని కలిసినప్పుడు ఏమైనాదో అడుగు. అరుపులు కాదు, మాటలతో అడుగు’ అంటే యే కళనున్నాడో ప్రెసిడెంటు గారు సరేనన్నారు.

మర్నాడు ఆచారి వచ్చినప్పుడు విషయం కదిపి చూశారు పెదబాబు. రమణాచారి నిట్టూర్చి ‘రాజన్న కొడుకునడిగితే చెప్పాడు. శైలమ్మ క్లాసులో ఏదో అందట కిరీటిని. వాడు కూడా మూడ్నాలుగు రోజుల్నుంచీ మాటామంతీ లేకుండా కూర్చున్నాడు’ అన్నారు. ‘ఛస్, ఆడి అలక కబుర్లు ఎవడడిగాడు ఎహె. పంతులమ్మ అన్నాక ఓ మాట అంటది. దానికే ఆడు ఇంత బెట్టు చేస్తాడా? రేపొచ్చి ఆడు అమ్మితో మామూలుగా మాట్టాడాల అంతే’ అని తేల్చి చెప్పారు.

రమణాచారి నవ్వుతూ ‘నా కొడుకు మామూలు మనిషి ఐతే నేను కూడా అదే చెబ్దును వాడికి’ అన్నారు. ఇంతలో ఆయన ముఖంలో నవ్వు మాయమైంది. ‘వాడి విషయంలో చాలా తప్పు చేశానురా. సవతి తల్లి బాధ పెడుతుందేమో అనే ఆలోచించాను కానీ ఓ ఆడతోడు లేకపోయేసరికి వాడు బయటకు చెప్పాల్సినవి అన్నీ లోపల్లోపల దాచేసుకోవడం గమనించలేకపోయా. రేపు ఉద్యోగం, పెళ్లి ఇవన్నీ ఎలా సంభాళిస్తాడో అని భయం వేస్తోంది’ అంటూ బాధపడ్డారు.

ఎంతో అరుదుగా తప్పించి వాళ్ళ పిలుపులు అరేయ్, రా ల దాకా వెళ్ళదు. రమణాచారి నిజంగానే బాధలో వున్నాడని తెలుసుకున్న పెదబాబు ఆయన్ని ఓదార్చి ‘అన్నీ మంచిగానే జరుగుతాయి, బాధపడాకు ఆచారీ. ఈ కాలం పిలగాళ్లలా కాదాడు. మంచి మనసుంది. అది సాలు’ అన్నారు. ‘ఐనా మీవోడి పెళ్లి గురించి ఇప్పుడప్పుడే తొందర్లేదు కదా నీకు. ఈ ముచ్చట ఇను. శైలమ్మను ఓ అయ్య సేతిలో పెడదామని సూస్తాండా. అదేమో పెళ్లి మాటంటేనే ఎగిరెగిరి పడతాంది. బాబ్బాబు, కాస్త మంచి కుర్రాడు దొరికితే ఓ కన్నేసి వుంచరా సామీ, దాని మనసు నే మారుత్తా’ అన్నారు. శైలు ఈ మాటలన్నీ వింది. తనతో ఎలాగోలా మాట్లాడకపోతే కిరీటిని పీక పిసికెయ్యాలని నిశ్చయించుకుంది.

మొదటి పీరియడ్ అవగానే రెండో పీరియడ్ మాథ్స్ లెక్చరర్ వచ్చే ముందు శైలు కిరీటి క్లాస్ రూమ్ లోకి వచ్చింది. అందరూ దెబ్బకి సైలెంట్ అయిపోయారు. గోరు కిరీటి డొక్కలో పొడిచి గుమ్మం వైపు సైగ చేశాడు. కిరీటి తలెత్తి చూస్తే శైలు వాడ్నే చూస్తోంది. తల దించకుండా వాడు కూడా ఆమెనే చూస్తున్నాడు. ‘కిరీటీ, బ్రేక్ లో స్టాఫ్ రూమ్ కి రా’ అని ఒక మాట చెప్పి వాడి సమాధానం కోసం చూడకుండా వెళ్లిపోయింది. అందరూ మళ్ళీ వాడివైపు చూస్తుంటే బెంచ్ మీద తల పెట్టుకుని కళ్ళు మూసుకున్నాడు కిరీటి.

‘రేయ్, ఆయమ్మికి నీమీద ఎందుకురా అంత కోపం’ అంటూ గోరు కదిపి చూశాడు వాడ్ని. ‘ఇవాళ వెళ్ళి కనుక్కుంటాను’ అని ఒకమాట చెప్పి ఊరుకున్నాడు కిరీటి. బ్రేక్ టైమ్ లో స్టాఫ్ రూమ్ కి వెళ్తే చాలామంది లెక్చరర్లు వున్నారక్కడ. శైలు ఓ మూలన కూర్చుని ఉంది. దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు కిరీటి. ‘కూర్చోమని స్పెషల్ గా చెప్పాలా నీకు’ అంటే ఎదురుగా వున్న కుర్చీలో కూర్చున్నాడు. లోగొంతుకలో ఒకటే ప్రశ్న అడిగింది వాడిని.

‘ఏరా, కనీసం సారీ చెప్పే ఛాన్స్ కూడా ఇవ్వవా?’

‘మేడమ్’ అంటూ మొదలెడితే చురుగ్గా చూసింది వాడివంక. ‘అలా చూడొద్దు. ఇక్కడ నిన్ను బైట ట్రీట్ చేసినట్టు చెయ్యలేను. ఆ హద్దు లేకపోతే నాకు చాలా కష్టం’ అన్నాడు. ‘ఏమన్నా మాట్లాడాలంటే ఇక్కడ వద్దు. సాయంత్రం మా ఇంటికి రండి. నేను మంచి టీ పెడతాను’ అని చెప్పి ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా వచ్చేశాడు. నమిలి మింగేయ్యాలన్నంత కోపంలో వున్న శైలు వాడు అలా కామ్ గా చెప్పేసరికి ఐస్ అయిపోయింది. పోనీలే మాట్లాడుతున్నాడు అదే చాలు అనుకుంది.

ఇంటికి వెళ్ళిన తర్వాత కిరీటి ఆచారితో ‘శైలుని టీ కి రమ్మని పిలిచా నాన్నా’ అని చెప్పాడు. రమణాచారి తల పంకించి ‘మంచిది, ఏమన్నా వుంటే మాట్లాడుకొని తేల్చుకోండి. ఐనా మనింటి పిల్లలాంటిదేరా తను. చిన్నచిన్నవి చూసీ చూడనట్టు వదిలెయ్యాలి. నేను పెదబాబు దగ్గరుంటాను. మాట్లాడుకున్నాక శైలుని నువ్వే తీసుకొచ్చి ఇంటి దగ్గర వదులు. పెదబాబు కూడా సంతోషిస్తాడు’ అని చెప్పి వెళ్ళాడు.

సాయంత్రం ఇంటికి వెళ్తూ దారిలో కిరీటి దగ్గర ఆగింది శైలు. బైట వరండాలోనే కూర్చుని ఏదో చదువుకుంటున్నాడు వాడు. శైలుని చూడగానే పుస్తకం పక్కన పడేసి వచ్చి లోపలికి తీసుకెళ్ళాడు. ‘ఒక్క నిముషం కూర్చో, టీ తీసుకొస్తా’ అంటూ వంటగదిలోకి వెళ్ళాడు. అలా కూర్చుందో లేదో ఇక ఆత్రం ఆపుకోలేక వాడి వెనకాలే వెళ్లింది. స్టౌ ముందు నుంచుని టీ గిన్నెలోకి దీక్షగా చూస్తున్నాడు. వెనకనుండి వాడ్ని వాటేసుకొని మునివేళ్ళమీద నిలబడి గడ్డం వాడి భుజంపై ఆనించి తను కూడా చూస్తోంది. వాడేమీ రియాక్షన్ చూపించకపోయేసరికి మెల్లిగా చెవిలో గాలి ఊదింది. విదిలించుకోవడం లాంటివి ఏమీ చెయ్యకపోయేసరికి ఇంకొంచెం బోల్డ్ గా వాడికి నొక్కుకుపోయింది. గిన్నెలో పాలు పోసి శైలుని వెనుకనుంచి లాగి తన పక్కన నిలబెట్టుకొని నడుం చుట్టూతా చెయ్యి వేసి పట్టుకున్నాడు.