భ్రాంతి 4 100

కొద్ది నిమిషాల తర్వాత విల్లాలో ఎవరూ ‘మాలిని కపూర్’ ను చూడలేదు. సునయన సుందర్ కారును అక్కడే వదిలేసి గబగబా నడుచుకుంటూ వెళ్లిపోయింది. విల్లా నుండి దూరంగా నడుస్తూ తలపైనున్న విగ్ తీసిపారేసింది. ముఖానికున్న మేకప్ చెరిపేసుకుంది. జనాలు ఎవరూ లేని చోట తను వేసుకున్న బట్టలు తీసేసి చేతిలో వున్న హాండ్ బాగ్ లోంచి ఒక పాత స్కర్ట్, టీ షర్ట్ తీసి వేసుకుంది. కళ్ళలో వున్న కాంటాక్ట్ లెన్స్ తీసి పారేసింది. బాగ్ కూడా అక్కడే వదిలేసింది. కానీ అందులోని loupe మాత్రం తనదగ్గరే అట్టిపెట్టుకుంది. ఇప్పుడు మళ్ళీ కిరీటి ఏ అమ్మాయినైతే చూసి మోజు పడ్డాడో ఆ సునయన మళ్ళీ ప్రత్యక్షమయింది.

తీరిగ్గా తన స్టడీ లోకి వెళ్ళిన డిసౌజా బాక్స్ లో ఐదు వజ్రాలు మిస్ అవడం చూసి శివాలెత్తిపోయాడు. కోపం తీరాక cold blooded గా ఆలోచించాడు. సునయన రూపాన్ని గుర్తున్నంతవరకూ వివరించి తన మనుషుల్ని ఉసిగొల్పాడు. సుందర్ తేరుకున్నాక అతడు చెప్పినదాన్ని బట్టి ఆమెకు ఒకటి కంటే ఎక్కువ రూపాలు వుండొచ్చు అని తెలుసుకున్నాడు. వజ్రాల వ్యాపారంతో సంబంధం వున్న మాలిని కపూర్ అనే ప్రతి ఒక్క మనిషినీ పట్టుకురమ్మని డబ్బు వెదజల్లాడు. దేశంలో ఎక్కడైనా సరే ఎవరన్నా అమ్మాయి వజ్రాలు అమ్మజూపితే తనకు తెలియాలని ఆర్డర్ వేశాడు.

సునయన కోసం వేట మొదలైంది. వినయ్ గాంగ్ తో ఇక ఏ సంబంధం పెట్టుకోకుండా మళ్ళీ తెలుగుగడ్డకి చేరుకుంది సునయన. చేతిలో ఐదు వజ్రాలున్నా వాటిని ఉపయోగించే ధైర్యం మటుకు చేయలేదు. భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతోంది.

మనం మళ్ళీ పెంచలాపురం వెళ్లాల్సిన సమయం వచ్చింది….

‘అమ్మీ, నువ్విట్టా తినకుండా కూకుంటే మేమెట్లా సుఖానుండేది. అడిగడిగి నోరు పడిపోతుండే నాకు. ఏటైనాదో ఓ మాట సెప్పు. ఇయ్యాలంటే ఆదివారం. రేపు కాలేజీకి పోవాల గందా. ఓ ముద్ద కతుకే అమ్మీ’ అంటూ శైలుని బతిమాలుతోంది తన అత్త రుక్కు. ‘పోనీ కిరీటి బాబుని పిలిసి నే మాట్టాడనా’ అని అడగ్గానే మంచం మీద ముఖం దిండులో దూర్చేసి పడుకున్న శైలు ఇంకా ముడుచుకుపోయింది. ‘ఎవరు చెప్పినా వాడింక నాతో మాట్లాడడు’ అని దిండులో గొణుగుతోంది.

రుక్కు నిట్టూర్చి ‘ఇగో, కంచం ఈడ పెడతాండా. పదేను నిమిశాల్లో ఖాలీ కంచం తెచ్చి నాకివ్వాల’ అంటూ పెదబాబుని వెతుక్కుంటూ వెళ్లింది. శైలుకి భోరున ఏడవాలనుంది. కిరీటిని చంపేయ్యాలి అన్నంత కోపంగా కూడా వుంది. రెండు భావాలూ కొట్టుమిట్టాడుతూ restless గా మంచంలో పడి దొర్లుతోంది.

కాలేజీ మొదలయ్యి ఒక వారమే అయింది. బుధవారం రోజున మంచి ఉత్సాహంగా కిరీటి క్లాసుకి వెళ్లింది శైలు. అదిగో అక్కడ్నుంచీ అంతా రచ్చ రచ్చ అయిపోయింది. అప్పట్నుండీ కిరీటి శైలుతో మాట్లాడట్లేదు. ఆదివారం రాత్రయ్యింది. రేపు మళ్ళీ వాడి ముఖం చూడాలి కాలేజీలో. ఏం చెయ్యాలో పాలుపోవట్లేదు శైలుకి.

అక్కడ కిరీటి ఇంకా మాచెడ్డ మూడ్ లో వున్నాడు. ఇప్పటిదాకా వాడిని ఎవరూ ఎప్పుడూ కోపంలో వుండగా చూడలేదు. ఇప్పుడు వాడికున్న మూడ్ కోపమా, ఇంకోటా తెలియక తలపట్టుకుంటున్నారు ఆచారి గారు. ఎప్పుడో ఒకసారి నోరువిప్పి ఏదో ఒక మాటన్నా అనేవాడు. ఈ రెండు మూడు రోజులనుండి మరీ మూగాడిలా కూర్చుని వుంటున్నాడు. గోరు, రంగా కూడా వాడిని కదిలించడానికి భయపడుతున్నారు.

ఆరు రోజుల క్రితం కిరీటి డిగ్రీ రెండవ సంవత్సరం క్లాసులు మొదలయ్యాయి. మన మిత్రుల గాంగ్ లో కిట్టి లేకపోవడం వాళ్ళకి పెద్ద లోటుగా తెలుస్తోంది. చిన్నప్పటినుండి తమతో కలిసి వున్న కిట్టి హఠాత్తుగా ఇలా మాయమవడం జీర్ణించుకోలేకున్నారు. అయినా కాలేజీ కొత్త సంవత్సరం మొదలైన రంధిలో ఆ లోటు కొంత మరుగున పడింది. బుధవారం నాడు శైలు తొలిసారిగా కిరీటి క్లాసుకి వచ్చింది. Attendance తీసుకుంటుంటే కుర్రాళ్ళంతా ఆమెను దొంగచూపులు చూస్తున్నారు. అమ్మాయిలు ఆమె చీరకట్టు, hair style లేజర్ కళ్ళతో స్కాన్ చేస్తున్నారు.

శైలుని అందరూ విప్పారిన కళ్ళతో అలా చూస్తూ వుంటే కిరీటికి ఇబ్బందిగా వుంది. తనువులు దగ్గరైన తర్వాత కిరీటి, శైలు ఇద్దరూ ఒకరినొకరు చూసుకునే విధానం మారిపోయింది. రాజా గారి ఎస్టేట్ నుండి తిరిగొచ్చిన తర్వాత వాళ్ళిద్దరికీ ఏకాంతం లభించడం గగనం అయింది. కేవలం రెండంటే రెండు సార్లు ఎవరి కంటా పడకుండా కలవగలిగారు ఇద్దరూ. అప్పుడు కూడా వేడివేడి ముద్దులు, కౌగిళ్లు తప్పించి ముందుకు వెళ్ళే అవకాశం రాలేదు.

మొదటి క్లాసు కాబట్టి శైలు పాఠమేమీ చెప్పదులే అనుకుంటున్న స్టూడెంట్స్ కి నిరాశ కలిగిస్తూ ఈ సంవత్సరంలో సిలబస్ లో ఏముందో ఏమిటో చెప్పుకుపోతోంది శైలు. ‘Prose, poetry తో పాటు మీరు కొన్ని సాఫ్ట్ స్కిల్స్ కూడా నేర్చుకోవాల్సి వుంటుంది. One of them is public speaking’ అంటూ ‘ఇప్పుడు మీరు ఏ లెవెల్ లో వున్నారో నాకు తెలియాలి అని క్లాసులో ఒక నలుగురైదుగురు స్టూడెంట్లను ముందుకు వచ్చి వాళ్ళకి తోచినది ఒక రెండు నిమిషాలు మాట్లాడమంది.

Of course, కిరీటిని సెలెక్ట్ చేసింది. తనను రమ్మని పిలవనందుకు గోరు దేవుళ్లందరికీ దండాలు పెడుతున్నాడు. ఒక నలుగురు స్టూడెంట్లు వాళ్ళకి వచ్చిందేదో మాట్లాడి వెళ్లారు. కిరీటి చాలా ఇబ్బందిగా వచ్చి నుంచున్నాడు. ఇంతమంది తనకేసి చూస్తుంటే వాడికి నోట్లోనుండి మాట పెగలట్లేదు. ‘ఊ, మాట్లాడరా ఏమన్నా’ అంది శైలు. ఎంతో కష్టం మీద ఏదో కొంచెం మాట్లాడాడు కిరీటి. వాడికున్న anxiety లో తప్పులు మాట్లాడుతున్నాడా ఏమిటి అనేదేమీ పట్టించుకోవట్లేదు.

శైలు వాడి introvert స్వభావం గురించీ, మాట్లాడడంలో వాడికుండే ఇబ్బంది ఏమీ ఆలోచించకుండా వాడి మీద అరిచేసింది. ‘ఏంట్రా నసుగుతున్నావు? లాస్ట్ ఇయర్ నేను, నిక్కీ చెప్పిందంతా ఎక్కడికి పోయింది. ఏంటి అంతా గాలికొదిలేశావా’ అంది. మామూలుగా వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు ఎలా అయితే వాడ్ని బెల్లిస్తుందో అలానే అంది. తనకు వాడితో వున్న చనువుతో ఎంత మాట వస్తే అంతా అనేయడం అలవాటైపోయింది శైలుకి. క్లాసులో మిగతా స్టూడెంట్లు ఎవరూ లేకపోతే కిరీటి కూడా మామూలుగానే react అయ్యేవాడేమో.