సాక్షాత్కారం అయ్యింది 110

మా తండ్రి నేను యమ ధర్మరాజు ఆ గదివద్ద దాగి ఉండడం చూసాము .మా తండ్రి హనుమంతుడు ఎలాగైనా యముడిని ఆపాలని బయలుదేరారు. ఇంతలో లక్ష్మణుడుని యముడు కలసి మీద చెయ్యి వేసి మా వైపు నవ్వుతూ రామమందిరం వైపు వెళ్లారు. మేము వెంబడించాము .రాముని యమధర్మరాజు నమస్కరించి మీతో ఏకాంతం గా సృష్టి రహస్యం గురించి మాట్లాడాలి .ఎట్టి పరిస్థితిలోను ఏకాంతానికి విఘాతం కలుగకూడదు,అది ప్రళయకారకం అన్నారు. అప్పుడు రాముల వారు లక్ష్మణుని ఎవ్వరైనా తమ సమావేశానికి ఆటంకం కలిగిస్తే వారికీ మరణ దండన అని ఆజ్ఞాపించారు.

చేసేది లేక మేము కాపలా కు కూర్చున్నాము .

శ్రీరాముడు మా తండ్రి ని పిలిచి భూదేవి ప్రతాపం వల్ల వచ్చిన నెరలు చూపించి ,వాటిలో తన అంగుళీకము పడిందని తీసుకు రమ్మని చెప్పారు, నేను తీసుకువస్తానని చెప్పినా వినకుండా అది సీతాదేవి ఉంగరం అవ్వటం వాళ్ళ మా తండ్రి సర్పరూపం ధరించి ఆ అంగుళీకము తీసుకురావడానికి వెళ్లారు. నేను వెంబడించాను.

ఇంతలో ఒక ఘోరం జరిగి పోయింది.

దుర్వాస మహర్షి రాముని వృత్తాంతం తెలుసుకొని కలవడానికి వచ్చారు. లక్ష్మణుడు రాముని కలవడానికి కుదరదని నచ్చచెప్పారు.దుర్వాసుడు కోపం తో ఊగుతూ అయోధ్య నగరం ఎడారి గా మారి శ్మశానం అవుతుందని శపించబోగా ఆయన్ని లక్ష్మణుడు ఆపి రాములవారికి విషయం చెప్పడానికి వెళ్ళాడు. యముడు రామునితో అవతారపరిసమాప్తి గురించి చెబుతున్నారు. అప్పుడు వారికి లక్ష్మణుని వల్ల ఆటంకం కలిగింది. విషయం రాముల వారికి చెప్పి లక్ష్మణుడు వెళ్లిపోయారు.

యముని, రాముని సమావేశానికి అడ్డు వచ్చిన వారికి మరణదండన అని రాజాజ్ఞ కాబట్టి అరణ్యం మధ్యకు వెళ్లి తనకు తాను శిరచ్చేదనం గావించుకున్నాడు లక్ష్మణుడు. అలా అనంతనాగుడు అనంతవిశ్వము లో కలిసిపోయాడు.

మేము రాముని అంగుళీకము గురించి వెతుకుతూ పాతాళ లోకం లోకి వెళ్ళాము .అక్కడ ఎన్నో భయంకర సర్పాలు మమ్మల్ని చుట్టుముట్టి నాగలోకానికి తీసుకు పోయాయి.అక్కడ నాగరాజు వాసుకి మా తండ్రిని చూసి నమస్కరించి అయ్యా దేని కొరకు మా రాజ్యానికి వచ్చారు అని అడిగారు. అప్పుడు మా తండ్రి తన రామాయణం అంతా చెప్పి జరగబోయే విషయాలు కూడా ఆయనకు తెలియకుండానే చెప్పసాగారు.తనుచెప్పే కధ విషాదాంతం అవ్వడం చూసి తేరుకుని బాధతో నేను రాముని సీత గురించి చెప్పను,ఇప్పుడు సీతారాముని అంగుళీకము గురించి చెప్పండి.

అప్పుడు వాసుకి నవ్వుతూ ఎందుకు రామునిసీత,సీతారాముడు అని కలిపి మాట్లాడుతున్నారు అని అడిగారు .

అప్పుడు మా తండ్రి ఎవరు ఎలాగ వారిని విడదీయాలని చూసినా గాని, నా నాలుక మాత్రం వారిని విడదీయ లేవు అని అన్నారు .

అప్పుడు వాసుకి ఇలా అన్నారు ” నీవు సీతారాములను కలసిఉండాలనుకుంటున్నావు .మరిప్పుడు వారిద్దరిని కలపడానికి ప్రయత్నిస్తున్న యముడిని ఎందుకు శాయశక్తులా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నావు” అన్నారు.

వాసుకి తో ఏకీభవించలేక మా తండ్రి వాసుకి ని ఆ అంగుళీకము ఎక్కడ ఉన్నదో చెప్పమని ప్రాధేయపడడ్డారు.