నాన్ సెన్స్ గా మాట్లాడకు. సెన్స్తో ఆలోచించిచు… Part 2 180

“నాకు వారానికోసారి నాన్ వెజ్ తప్పనిసరిగా కావాలి”

“సారీ… నేను నాన్ వెజ్ తినను”

“నేను నా విషయం చెప్తున్నాను”

“నేను తినకుండా ఎలా…”

“నేను వండుకుని తింటాను” అనిమిష ఏమీ అన్లేక “సరే” అంది.

“పెళ్లయ్యాక నేను మిమ్మలి “ఒసే’ అనొచ్చా. భార్యను అలా పిలవడం నాకిష్టం”

“అదేం కుదర్దు… కావాలంటే నువ్వు’ అని ఏకవచనంతో పిలవచ్చు”

“ఇంకా ఏమైనా కండీషన్స్ ఉన్నాయా?”

“ఏమీ లేవుగానీ… మనిద్దరి మధ్య వున్న ఈ ఒప్పందం మూడో మనిషికి తెలియకూడదు”

“సారీ… మూడో మనిషికి తెలియకుండా వుండడం నా వల్ల కాదు. ఆరో మనిషికి తెలియకుండా చూడగలను”

“అదేంటి?”

“మీ ఫ్రెండ్ కు తెలుసుగా… తను మూడో మనిషి మా ఫ్రెండ్ కు తెలుసు… వాడు నాలుగో మనిషి మా బామ్మకు ఈ విషయం క్లియర్ గా చెప్పాలి. తప్పదు… ఆరో మనిషికి మాత్రం తెలియనివ్వను. మీరు చెప్పుకుంటే నాకు అభ్యంతరం లేదు”

“సరే… వెంటనే మ్యారేజ్… గుడిలో సింపుల్గా… అన్నట్టు మ్యారేజ్ అయ్యాక నేను మ్యారేజ్ పేరుతో లోన్లు తీసుకుంటాను. వాటి ఇన్స్టాల్ మెంట్స్ నేనే కట్టుకుంటాను… ముందే చెప్తున్నాను”

“మీ ఇష్టం..” భుజాలు ఎగరేసి చేసి అన్నాడు అనిరుద్ర.

టిఫిన్ చేసి కాఫీ తాగి లేచారు. బిల్లు అనిమిషే పే చేసింది.

“కంగ్రాట్స్ అనిరుద్రగారూ… మంచి అమ్మాయిని కొట్టేశారే.. పార్టీ ఇవ్వాలి”

“ఫిఫ్టీ ఫిఫ్టీ అయితే ఓకే. అయినా మీరు జాబ్ కొట్టేశారే అనాలి… అమ్మాయిని కాదు.. పైగా మీ ఫ్రెండ్ ‘అది’ వద్దంది” అన్నాడు అనిరుద్ర.

“అదా…? ఏది?” అంటూ అనిమిష వంక చూసి, “ఏమొద్దన్నావే” అని అడిగింది. అనిమిష మొహం ఇంకా ఎర్రబడింది.

“ఇంటికెళ్లాక అడగండి. ఓసారి ఆలోచించుకోమనండి” చెప్పాడు వాళ్ల ఆటో కదుల్తుండగా.

***

ఒక్క క్షణం షాక్ అయ్యాడు శోభరాజ్. “వ్వా…ట్… మీరు చెప్తోంది నిజమా? మీ పెళ్లా? రేపేనా?” అడిగాడు

“ఇంత సడన్గా పెళ్లేమిటి? దానిక్కూడా నేను కారణం కాదు కదా” అడిగాడు శోభరాజ్.

“ఛఛ… అదేం కాదు సర్… ఎప్పట్నుంచో ప్రేమించుకుంటున్నాం. చిన్న చిన్న ప్రాబ్లమ్స్. ఎవ్వరికీ చెప్పుకోలేని ప్రాబ్లమ్స్… ఇప్పుడు అవన్నీ సాల్వ్ అయ్యాయి… అందుకే రేపే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. సారీ సర్ మిమ్మల్ని డిజప్పాయింట్ చేస్తే”

శోభరాజ్ అనిమిష వంక చూశాడు. అతని మొహంలో చిన్న బాధావీచిక క్షణంలో మెరుపులా మెరిసి మాయమైంది.

“అదేం లేదు మిస్ అనిమిషా… ప్రేమ ఒక గేమ్.. అందులో ఎవరో ఒకరే గెలుస్తారు. అవతలి వ్యక్తి ఓటమిని స్పోర్టివ్గా తీసుకోవాలి. గెలిచిన వాళ్లను మనస్ఫూర్తిగా అభినందించాలి. అడ్వాన్స్ గా కంగ్రాట్స్… ఈ అకేషన్ ని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకోవాలి” అంటూ క్యాబిన్లో నుండి బయటకు వచ్చాడు.

అప్పటివరకూ క్యాబిన్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న యాంగ్జయిటీలో వున్న స్టాఫ్ ఎక్కడి వాళ్లక్కడే సర్దుకున్నారు.

“మైడియర్ సాఫ్… మీకు స్వీట్ న్యూస్… ముందు స్వీట్స్ తినండి” అంటూ ఆర్ముగం వైపు చూశాడు. ఆర్ముగం స్వీట్ ప్యాకెట్ పట్టుకొచ్చాడు.

“అందరూ స్వీట్స్ తినండి… వేడి వేడి సమోసా తినండి… కాఫీ తాగండి… నేను చెప్పే న్యూస్ వినండి”

స్వీట్స్, సమోసా అందరికీ సర్వ్ చేయబడ్డాయి. శోభరాజ్ ఓసారి గొంతు సవరించు, “ఈ రోజు అనిమిష మనకో స్వీట్ న్యూస్ వినిపించబోతున్నారు…” అంటూ అనిమిషవైపు తిరిగి “మీరు చెప్తారా? నన్నే చెప్పమంటారా?” అని అడిగాడు.

అనిమిష సిగ్గుపడిపోయింది. శోభరాజ్ కొనసాగించాడు. “రేపు మన అనిమిష… మిసెస్ కాబోతున్నారు”

అందరూ ఆశ్చర్యంగా చూశారు. బాసే అనిమిషను పెళ్లి చేసుకోబోతున్నారా? వెంటనే స్టాఫ్లో నుంచి నిఖిత, “కంగ్రాట్స్ సర్” అంది.