నాన్ సెన్స్ గా మాట్లాడకు. సెన్స్తో ఆలోచించిచు… Part 2 180

“ఏంటి… మీ ఛానల్ విశేషాలు?” అడిగింది అనిమిష ద్విముఖను.

“నేను చేసిన ‘ఏం చేయాలనుకుంటున్నారు?’ ప్రోగ్రామ్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది అనిరుద్ర ఫోన్ నంబర్ కావాలని అడిగారు. మా ఛైర్మన్ పర్మిషన్ తో నేను అనిరుద్రను ఇంటర్వ్యూ చేయాలని అనుకుంటున్నాను. డిఫరెంట్ ఇంటర్వ్యూ అవుతుంది” ద్విముఖ చెప్పింది.

“నీకు అతడి గురించి డీటైల్స్ తెలుసా?” అడిగింది అనిమిష

“డీటైల్స్… అంటే ఫోన్ నంబర్ తెలుసు. గుర్తుండే నంబర్” అని కళ్లు మూసుకొని టకటకా చెప్పింది. “92462-02616”.

“అతనికిదేం పిచ్చి… మొగుడిగా జాబ్ చేయాలన్న ఆలోచన వింతగా లేదూ” అనిమిష అంది.

“ఇలాంటి వింతయిన విషయాలు రోజూ ఎన్నో జరుగుతున్నాయి. విదేశాల్లో ఇలాంటి వింతలకు కొదవేమీ లేదు. ఆ మధ్య ఓ ప్రకటన వచ్చింది వెబ్ సైట్లో… ఆత్మను అమ్ముతున్నారన్న ప్రకటన అది. విచిత్రమేమిటంటే… ఆ ఆత్మను ఓ శాల్తీ కొనేశాడు కూడా…” ద్విముఖ చెప్పింది.

అనిమిష ఆలోచిస్తోంది. ద్విముఖ అనిమిష మొహం వంక పరిశీలనగా చూసి అడిగింది.

“ఏంటో అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు? ఏదైనా విశేషం ఉందా? ఉంటే చెప్పు… నాకు చేతనైన సహాయం చేస్తాను”

“అదేం లేదు…” అంది ఏదో ఆలోచిస్తూ అనిమిష.

“నీకు ఇంకో విశేషం తెలుసా? అదీ అనిరుద్రకు సంబంధించిందే…” అంది హుషారుగా ద్విముఖ.

“ఏంటది?” క్యూరియాసిటీతో అడిగింది అనిమిష

“ఇవాళ అతను పేపర్ లో భర్త పోస్టు కావాలని ప్రకటన కూడా ఇచ్చాడు” అంది హ్యాండ్ బ్యాగ్ లో నుంచి పేపర్ తీసి టీపాయ్ మీద పెట్టి.

అనిమిష ఆ పేపర్ తిరగేసింది. ఆరో పేజీలో ఓ కార్నర్ లో వచ్చిందా ప్రకటన. ఆ ప్రకటన చదువుతుంటే చిన్నపాటి ఉద్వేగం కలిగింది అనిమిషలో.

“ఈ ప్రకటన గురించే మా ఛానల్లో డిస్కషన్.. అందుకే నేనీ వివివిఐపీని ఇంటర్వ్యూ చేయాలనుకుంది” ద్విముఖ చెప్పింది.

ఆ రాత్రి ఒక నిర్ణయానికి వచ్చింది అనిమిష. ఆ నిర్ణయమే అన్ని సమస్యలకు పరిష్కారం అనుకుంది. ‘తన సమస్యలకు పరిష్కారం దొరకాలంటే ఒకే ఒక మార్గం. ఇప్పుడు బాల్ అనిరుద్ర కోర్టులో ఉంది’ అనుకుంది అనిమిష .

* * *

బాదం చెట్టు కింద వున్న మంచమ్మీద కూర్చొని రెండు చేతులూ తల మీద పెట్టుకున్నాడు కార్తీక్. అతని పక్కనే తల కింద చేతులు పెట్టుకొని వెల్లకిలా పడుకున్నాడు అనిరుద్ర. మంచం మీద మొబైల్ ఫోన్. ఆ ఫోన్ ఉదయం నుండి నాన్ స్టాప్గా మోగుతూనే ఉంది.

****

“అనూ… ఎంత పనిచేశావు? నువ్విచ్చిన యాడ్ ఏమిటోగానీ ఉదయం నుండి సౌండ్ పొల్యూషన్ ఎక్కువైంది. ఫోన్ నంబర్ ఇచ్చినవాడివి నువ్వే మాట్లాడొచ్చుగా. ముందు నన్ను మాట్లాడమంటావ్. అబ్బ… నీ ఐడియా చూశాక నాకు యాడ్ ఇవ్వాలనిపించింది. అయినా మొగుడి పోస్ట్ కు ఇంత డిమాండ్ ఉంటుందా? అయినా ప్రపంచంలో ఎవరికీ రాని ఐడియాలు నీకే ఎలా వస్తాయిరా….” నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే వున్నాడు కార్తీక్.

అప్పుడే మొబైల్ ఫోన్ మళ్లీ మోగింది. కార్తీక్ భయం భయంగా మొబైల్ చేతిలోకి తీసుకొని ఓకే బటన్ నొక్కి మెల్లిగా ‘హలో’ అన్నాడు.

“నేనూ హలోనే డియర్… మా ఆయన దుబాయ్ లో ఉన్నాడు. టెంపరరీ మొగుడి పోస్టు ఖాళీగా ఉంది. చేస్తావా?” గొంతులో విస్కీ వున్నట్టు హస్కీగా వుంది అవతలి గొంతు.

కార్తీక్ బెదిరిపోయి మొబైల్ ని అనిరుద్రకు ఇచ్చాడు. అనిరుద్రకు విషయాన్ని షార్ట్ హ్యాండ్ లాంగ్వేజ్ లో చెప్పాడు. ఫోన్ కట్ చేసి నవ్వుతూ చెప్పాడు అనిరుద్ర.