నాన్ సెన్స్ గా మాట్లాడకు. సెన్స్తో ఆలోచించిచు… Part 2 180

“గుడ్ మాణింగ్ సర్” క్యాబిన్లోకి వెళ్తూనే శోభరాజ్ ని విష్ చేసింది అనిమిష.

“వెరీ గుడ్మాణింగ్… ఏంటీ ఇవ్వాళ కూడా లేటేనా? అయినా మీరు హాయిగా ఓ టూ వీలర్ తీసుకోవచ్చుగా… కంపెనీ లోన్ ఇస్తుంది. పెట్రోల్ అలవెన్స్ ఇస్తుంది” శోభరాజ్ అన్నాడు. “నాకు బస్ లేదా ఆటోనే కంఫర్ట్ సర్… టూ వీలర్ కొని… డ్రైవింగ్ నేర్చుకొని, లైసెన్స్ తీసుకొని… వద్దు సర్”

శోభరాజ్ అనిమిష వంక చూసి, “కాఫీ తాగుతారా?” అని అడిగాడు.

“నో థాంక్స్…” అంది తల వంచుకునే అనిమిష

శోభరాజ్ తన సీటులోంచి లేచాడు. అనిమిష దగ్గరికొచ్చి, “అనిమిషా… నేను పదే పదే మీ వెంటపడ్డం… మిమ్మల్ని ‘ఐస్’ చేయడానికి ప్రయత్నించడం ఇదంతా మీకు అనిపిస్తోందా? అమెచ్యూర్డ్గా ఫీలవుతున్నారా?”

ఒక్క క్షణం ఆ మాటలతో తడబడింది.

“అదేం లేదు సర్…” అంది. నిజానికి బాస్ ప్రవర్తన ఆమెకు ఇబ్బందిగానే ఉంది.

“చూడండి అనిమిషా… నేను చాలా విషయాల్లో స్టెయిట్… మీ విషయంలోనే స్ట్రెయిట్ ని క్రాస్ చేయాల్సి వచ్చింది. మీరంటే నాకిష్టం. ఓ బాస్గా నేను ఇలా మాట్లాడకూడదు అఫ్ కోర్స్…. నేనిప్పుడు బాస్గా మాట్లాడ్డం లేదు. ఓ మగవాడిగా మాట్లాడుతున్నాను. ఓ అబ్బాయికి అమ్మాయి నచ్చిందనుకోండి అప్పుడా అబ్బాయి ఏం చేస్తాడు? ఐ లవ్యూ చెప్తాడు. రైట్…”

అనిమిష అవుననీ, కాదనీ అన్లేదు.

“కానీ నాలాంటి థర్టీ ప్లస్ అబ్బాయి మాత్రం… సారీ అబ్బాయి అనకూడదు… ఆ వయసు దాటిపోయాను కదూ…” అని ఆగి, “నాలాంటి థర్టీ ప్లస్ వ్యక్తి ‘ఐ మ్యారీ యూ’ అంటాడు. మిస్… ఐ మ్యారీ యూ… ఐ మీన్ ఇట్…” అన్నాడు శోభరాజ్.

ఒక్క క్షణం కలవరపడింది. ఇన్నాళ్లూ తన పట్ల అతను కన్సర్న్ చూపిస్తుంటే… అతడు తనను ప్రేమిస్తున్నాడన్న విషయం అర్థమైనా దానిని సీరియస్గా తీసుకోలేదు. అతను ప్రేమించుకుంటే తనకేంటి? తను ప్రేమించడం లేదు కదా అనుకుంది. ఇప్పుడు స్ట్రయిట్గా… పెళ్లి ప్రపోజ్ చేశాడు.

“మిస్ అనిమిషా వాడ్డూయూసే… మీ పెద్దవాళ్లతో మాట్లాడడానికి కూడా రెడీ…” అనిమిష ఇబ్బందిగా కదిలి, “నేను వెళ్తాను సర్” అంది.

“మీరు వెళ్లొచ్చు… బట్ నా ప్రపోజల్ ఆలోచించండి” బయటకు వెళ్తాన్న అనిమిషమే చూస్తూ అన్నాడు శోభరాజ్.

***

అనిరుద్ర ఇంటికి వచ్చేసరికి ఇంటి ముందు జనం కనిపించారు. అందులో ఎక్కువమంది స్త్రీలే వుండడం గమనార్హం.

“అనూ… కొంపదీసి బామ్మ గాయబా? యిట్స్ గానా? పోయిందే నా?” చిన్న ఆ ఇచ్చి క్లారిఫికేషన్ కోసం అడిగాడు కార్తీక్.

“అది పోదు… నా పెళ్ళో… నా కొడుకు బారసాలో చూసికానీ పోదు…” వుండగానే ఓ టీ కుర్రాడు అక్కడికొచ్చాడు.

‘ఛాయ్… ఛాయ్… గరమ్ ఛాయ్” అంటూ ఆ మహిళా గుంపును అభిమన్యుడు మల్లె ఛేదించుకొని వెళ్తూ అరుస్తున్నాడు.

అనిరుద్ర ఆ టీ కుర్రాణ్ణి పిలిచి, “బాబూ… ఏంటా హడావిడి…” అని అడిగాడు. ఆ కుర్రాడు ఎగాదిగా చూసి, ‘చాయ్ కావాలా?’ అని అడిగాడు.