నాన్ సెన్స్ గా మాట్లాడకు. సెన్స్తో ఆలోచించిచు… Part 2 180

“వద్దు” చెప్పాడు అనిరుద్ర.

“సారీ… ఆ విషయాలన్నీ మీకెందుకు? రెండ్రూపాయలు పెట్టి చాయ్ తాగరుగానీ డీటైల్స్ కావాలి..” అంటూ గొణుక్కుంటూ వెళ్లిపోయాడు.

“వార్నీ వేలెడుకు జానెడంత లేడుగానీ ఎంత డవలప్ అయ్యాడు” బుగ్గలు నొక్కుకున్నాడు కార్తీక్. ఈలోగా ఆ గుంపులోని ఒకావిడ, “అదిగో… పెళ్లికొడుకు” అని కీచుగా అరిచింది.

అందరి దృష్టి అనిరుద్ర మీద పడింది. అప్పుడే బామ్మ ఎంట్రీ ఇచ్చింది.

“రారా అనిరుద్ధుడూ…” అంటూ మనవడ్ని ప్రేమగా లోపలికి తీసుకుపోయింది.

“ఒసే బామ్మా… ఈ సీనేంటి?” చిరాగ్గా అడిగాడు అనిరుద్ర.

“స్వయంవరం… నిన్న టీవీలో నీ ఇంటర్వ్యూ చూసి బందరులో వున్న బండ మామయ్య ‘ఒరే ఒరె… మన అనిరుద్ధుడికి అప్పుడే పెళ్లి వయసు వచ్చిందా? నా ఎరికలో నాలుగైదు ఆరేడు సంబంధాలు వున్నాయని చెప్పాడు. వెంటనే ఆ సంబంధాలను కొరియర్ చేయమన్నాను. అలాగే నాకు తెలిసిన వాళ్లందరికీ ఫోన్లు చేసి పిలిపించాను. కట్నం ఒక లకారం నుంచి పది లకారాల వరకు పలుకుతుంది. చుడీదార్లు, చీరలు, జీన్స్, మిడ్డీలు… నీ ఇష్టంరా… అన్నట్టు పెళ్లి చేసుకుంటే బోనస్గా ఉద్యోగం ఇప్పిస్తానని కూడా అంటున్నారు” బామ్మ మురిసిపోతూ చెప్పుకుపోతోంది.

ఓసారి బామ్మ వంక కోపంగా చూసి బయటకు వచ్చి గట్టిగా అందరికీ వినిపించేలా చెప్పాడు.

“నన్ను అల్లుణ్ణి చేసుకోవాలని మీరందరూ ఉత్సాహపడిపోతున్నారని మా బామ్మ చెప్పింది. రొంబ సంతోషం… అయితే నాకు కట్నం అక్కర్లేదు… శాలరీ… అదే జీతం కావాలి. నాకెంత జీతం ఇస్తారో ఓ కాగితం మీద రాసి, ఓ కవర్లో పెట్టి… మీ పేరు, అడ్రస్ రాసి…” అని ఆగి ఓ మూలన పడివున్న బిందె తీసి అందులోని నీళ్లు ఒలకబోసి, శుభ్రంగా పొడిగుడ్డతో తుడిచి, “ఈ బిందెలో వేసి వెళ్లండి. తర్వాత మీ కొటేషన్సును బట్టి నేను ఎవరి మొగుడిగా ఉద్యోగం చేయాలో ఆలోచించి పెడతాను” అంటూ చేతులు జోడించి చూసేసరికి అక్కడ ఒక్కరూ లేరు.

ఎవరికి వారే గొణుక్కుంటూ మాయం అయ్యారు.

ఎప్పుడైతే తను కష్టపడి అనిరుద్ర కోసం ఏర్పాటుచేసిన స్వయంవరాన్ని అనిరుద్ర డిఫ్యూజ్ చేశాడో… అప్పుడే బామ్మ అలిగింది. ఈ నిరసనను వినూత్న పద్దతిలో వ్యక్తపరిచింది. బామ్మ ముందు చికెన్, మటన్, వెజ్ బిర్యానీలు, చపాతీ, బట్టర్ ఖాన్, తందూరీలు… స్వీట్స్ ఉన్నాయి. వాటిని ఓ క్రమపద్ధతిలో కాకుండా తనకు ఇష్టమొచ్చిన రీతిలో తింటోంది.

“ఒరే అనూ… బామ్మ వరస చూస్తుంటే తినీ తినీ పోయేలా ఉంది. అయినా ఇదేం నిరసన?” అడిగాడు భయం భయంగా కార్తీక్..

“జపాన్ స్టయిల్… అక్కడ మన వాళ్లలా పని మానేసి రోడ్ల మీద బైటాయించి స్ట్రయికులు చేయరు. ఉత్పత్తి పెంచేసి తమ నిరసనను వ్యక్తం చేస్తారు. బామ్మ కూడా అంతే. తింటూ నిరసన వ్యక్తం చేస్తుంది”

“పొట్ట పగిలేలా ఉంది” భయంగా అన్నాడు కార్తీక్. .. “అందుకే సోడాలు కూడా పక్కనే పెట్టుకుంది”

“జోకులాపు… ఏదో ఒకటి చేసి బామ్మ వింత నిరసనకు ఫుల్ స్టాప్ పెట్టించు… లేకపోతే తన చావుకు కారణం నేనేనని రాసి పెట్టి చచ్చినా చస్తుంది” మరింత భయం భయంగా అన్నాడు కార్తీక్.

****

“బామ్మా… నేను ఉద్యోగం చెయ్యాలి. బుద్ధిగా పెళ్లి చేసుకోవాలి. ఈ రెండూ చేస్తే నీ ఆత్మ సంతోషిస్తుందా?”

“ఆత్మ కాదు. నేనింకా చచ్చి పూడ్చలేదు. నా మనసు సంతోషిస్తుంది” చెప్పింది బామ్మ “సరే… త్వరలో నీ కోరిక నెరవేరుస్తా. నువ్వీ తిండి నిరసన మానెయ్” “ఒట్టు…” అడిగింది బామ్మ..

“ఒట్టు” అంటూ బామ్మ తల మీద చెయ్యి వేయబోతుంటే తల వెనక్కి తీసుకొని, కార్తీక్ ని ముందుకులాగి “వీడి తల మీద చెయ్యి పెట్టి… వీడు చచ్చినంత ఒట్టు… అని ఒట్టు పెట్టు… పోతే వాడు పోతాడు… లేదంటే నువ్వు బాగుపడతావ్” అంది బామ్మ.

కార్తీక్ బిక్క చచ్చిపోయాడు. బామ్మ వింత నిరసనకు స్వస్తి చెప్పింది. “ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావ్?” బీచ్లో తల కింద చేతులు పెట్టుకొని వెల్లకిలా పడుకొని, ఆకాశం వంక చూస్తున్న అనిరుద్రను అడిగాడు కార్తీక్.