నాన్ సెన్స్ గా మాట్లాడకు. సెన్స్తో ఆలోచించిచు… Part 2 180

“ట్రై చేయడాలు… లైన్లు వేయడాలు నాకు ఇష్టం ఉండదు. అయినా నాకు కన్నో కాలో వంకర అయి పెళ్లికావడంలేదన్న సమస్య లేదు… కేవలం నా హైటే సమస్య…” కాసింత విచారంగా మొహం పెట్టి అంది భావన.

“అవునవును… నీకో విషయం తెలుసా భావనా? బాస్ నీ పక్కన నిలబడితే… నువ్వే హైట్ అనిపిస్తావ్”

“అందుకే హైహీల్స్ మానేశాను. ఫ్లాట్ చెప్పులే వేసుకుంటున్నాను” చిన్నగా నవ్వి అంది భావన.

“అవును నాకో డౌట్… మగవాళ్లు హైట్… ఆడవాళ్లు పొట్టిగానే ఎందుకుండాలి అలాంటివాళ్లనే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారా?”

“ఏమో… ఓ నవల్లో చదివిన గుర్తు… ఓ క్యారెక్టర్ నాలాంటి క్యారెక్టరే… దేవుణ్ణి వేడుకుంటుంది. ‘దేవుడా… వచ్చే జన్మలో అయినా నన్ను పొట్టిగా పుట్టించు లేదా ఈ మగవాడి మనసులో విశాలమైన భావాలనైనా పుట్టించు’ అని, నాలాగే తనకూ హైట్ ఓ ప్రాబ్లెమ్…” భావన అలా మాట్లాడుతున్నప్పుడు ఆమె గొంతులో విషాదంతో కూడిన జీర ధ్వనిస్తోంది.

“ఇంతకీ ఇంధ్రధనుస్సులు ఎప్పుడు కనిపిస్తాయి?” భావన ఫీలింగ్స్ గమనిస్తూ టాపిక్ ను డైవర్ట్ చేస్తూ అడిగింది నిఖిత.

“అనిమిష రానీ…” భావన నవ్వి అంది.

“సాయంత్రం బాస్ పర్మిషన్ ఇస్తే ఎగ్జిబిషన్ కు వెళ్లాలి” అంది నిఖిత.

“అదేంటి మొన్ననే వెళ్లావుగా..”

“చెన్నై వాళ్లు పెట్టిన ఎగ్జిబిషన్ అది… అందులో ఓ చీర చూశాను. దాదాపు యాభై వేల రంగులున్నాయట… ఆ రంగులన్నీ బాస్ మొహంలో అనిమిషను చూసినప్పుడు కనిపిస్తాయట”

“ఇంకేంటి… కొనేసుంటావ్?”

“లేదు నా దైవాన్ని అడిగాను”

“నీ దైవమా… తిరుపతి వెంకటేశ్వర స్వామా?”

“కాదు… నా ఇంటి దైవం… అదే మా ఆయన్ని అడిగాను. “కావాలంటే రేపే దుబాయ్ వెళ్దాం. సింగపూర్ వెళ్దాం. బోర్గా వుంది వెరైటీ కావాలంటే పాకిస్తాన్ వెళ్దాం. ఎంచక్కా నువ్వు పాకిస్తాన్ ప్రెసిడెంట్ ముషారఫ్ ని ఇంటర్వ్యూ చెయ్యొచ్చు. అంతేగానీ పది వేలు పోసి చీర కొంటానంటే నేనొప్పుకోనంతే…” అని జార్జ్ బుష్ లా అడ్డంగా మాట్లాడాడు” కచ్చగా అంది నిఖిత.

. “అంటే పాకిస్తాన్ కు వెళ్లే ఐడియా కూడా ఉందా? ప్రపంచంలో ఇలాంటి వెరైటీ ఐడియాలు మీ ఆయనకు తప్ప మరెవ్వరికీ రావేమో”

“ఏం చేయమంటావ్ భావనా… ఆయనకు ఎక్కడికీ వెళ్లకపోతే తోచదు… ఇంట్లో వుంటే ఎటైనా వెళ్తామని అంటాడనే ఈ జాబ్ చేస్తున్నాను. అయినా నాకు అప్పుడప్పుడూ బోర్ కొడ్తుంది. మన బాసాసురుడు ఇచ్చే జీతం… నా షాపింగులకే సరిపోదు” నిట్టూరుస్తూ అంది నిఖిత.

“క్వయిట్ కామన్… క్వయిట్ నేచురల్… క్వయిట్ ఇంట్రెస్టింగ్…” అంది నవ్వి భావన. హ్యాండ్ బ్యాగ్ తన టేబుల్ మీద పెట్టి బాస్ క్యాబిన్ వైపు నడిచింది.

***