అత్తయ్యకు ఓ ఫ్రెండ్ ఉండేవాడు 295

ఎంత చిన్న అవసరం వచ్చినా శ్రీనివాసరావు తిప్పరాజు మీద ఆధారపడేవాడు. ఇద్దరి మధ్య మెసేజ్ లు అందజేయడం దగ్గర్నుంచి, ఎక్కడ కలుసుకోవాలో అన్న ప్లేస్ ల నిర్ణయం వరకు తిప్పరాజే చేసేవాడు. అతను తెలివైన వాడు కావడం వల్ల చొరవ వున్న వాడవడం వల్ల వాళ్ళిద్దరికీ సుఖపడడం తప్ప మరి ఎలాంటి అవాంతరాలు లేకపోయాయి. ఇలాంటి కొత్త సంబంధాలు ఎంత జాగ్రత్తగా వున్నా, దాగవు. శ్రీనివాసరావుకీ, రాధకీ మధ్య ఎంతో కొంత అనుబంధం ఏర్పడిందని వూరు వూరంతా పసిగట్టేసినా అదెంత గ్రేడ్ లో వుందో మాత్రం ఎవరికీ ఖచ్చితంగా తెలియదు.

వూరు చెవులు కొరుక్కుంటున్న సమయంలో వూరి పెద్దకూ ఈ విషయం తెలిసింది. వృద్దుల ఆశ్రమానికి స్థలం ఇచ్చే విషయంలో ఆయన పునరాలోచనలో పడ్డాడు. అలాగని స్థలం ఇవ్వనని బ్లెంట్ గా రాధకు చెప్పలేకపోయాడు. నిజానిజాలు తెలుసుకున్న తరువాత నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించుకుని నన్ను పిలిపించారు. “ఇద్దరూ ఈ వూరు కాదు. ఈ వూర్లో చాలాకాలం వుండే అవకాశం వుండడం వల్ల వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంబంధం కొనసాగుతుందో నాక్కావాలి.

సాక్ష్యాదారాలతో నువ్వు దాన్ని నిరూపించాలి” అని ఆయన నాకు కేసు అప్పగించాడు. సరేనని ఒప్పుకున్నాను. రెండోరోజు నుంచి దర్యాప్తు ప్రారంభించాను. పని ఒప్పుకున్న తరువాత తప్పదు కదా. రోజూ సాయంకాలం పక్క వూరు కెళ్ళి రాత్రి బాగా పొద్దుపోయే వరకు అక్కడే వుండి వచ్చేదాన్ని. ఎవర్ని దారి చూపించడానికే చంద్రుడు ఆకాశంలో వెలుగుతున్నట్టు దారంతా వెన్నెల పరుచుకుని వుంది. గాలి ఎక్కడో భయపడడం వల్ల చల్లబడిపోయినట్టు చలి పెడుతోంది. దూరంగా వున్న వూరు లైట్ల కాంతిలో వెలుగుల నదిలో కదలకుండా నిలబడిపోయిన దీపపు దొన్నెలా కనిపిస్తోంది.

ఎందుకయినా మంచిదని పొలాలగుండా కాకుండా ఏటిపక్కనున్న కాలిబాటన బయల్దేరింది లిఖిత. “నేను తోడొచ్చి దిగబెడతానమ్మా…” అని గిరిజ భర్త అన్నా వద్దంది. ఎందుకనో ఇప్పుడు ఎవరినీ భరించే స్థితిలో లేదామె. ఒంటరితనమే మధురంగా వుంది. అది ప్రేమ లక్షణమేమోనని చాలాసార్లు తనలో తనే అనుకుంది. ఆమె ఎస్.టి.కాలనీ దాటింది. భూమి అంతా ఏరే ఆక్రమించుకున్నట్టు ఆ ప్రాంతమంతా ఇసుకతో నిండి వుంది. గుబురు పొదలు రోడ్డును ఇరుకు చేస్తున్నట్టు విస్తరించి వున్నాయి.