గౌతమి కొడుకు 1578

అప్పుడు జాంబవంతుడు, “పరశురాముడు సృష్టించిన ఈ దక్షిణ జంబూ ద్వీపంలో తరాల కొద్దీ రాజులను, రాజ్యాలను పరిరక్షించడానికి నియమింపబడిన వారిలో నేను ఒకడిని మా అందరికీ అధినాయకుడు ఒకరు ఉన్నారు. త్వరలో నీకు తెలుస్తుంది. మీ ముత్తాత శ్రీముఖ శాలివాహనుడు. బాలకుడిగా వచ్చిన ఆయనకు బాహుబల సంపన్నునిగా మార్చింది మేమే.
ఆయన గొప్ప వీరుడు ఒక్క కత్తి వేటుతో 15 మందిని చంపిన ఘనుడు. ”
అప్పుడు శాతకర్ణి ఆశ్చర్యంతో అది ఎలా సాధ్యం జాంబవంతుల వారు అని అడిగాడు.
మీ ముత్తాత ఆయుధం పేరు ఉరిమి. మూడు కత్తులు ఒక్క పిడితో చేయబడి ఉంటాయి, కత్తులకు వంగే గుణం ఉంది. కత్తిని తాడులా గుండ్రంగా చుట్టి ఒక్క ఉదుటన వదిలేవాడు ,చుట్టూ చక్రంలా తిప్పేవాడు. ఆదృశ్యం ఇప్పటికీ నా ముందు కదలాడుతుంది అని చెప్పాడు.
“నా ముత్తాత గురించి ఇంకా వివరాలు చెప్పండి” అన్నాడు శాతకర్ణి.అప్పుడు జాంబవంతుల వారు, కాలమే నీకు కధగా చెబుతుంది నాయనా అన్నారు.
“ నీవు వచ్చిన కార్యమేమి “ అని అడిగాడు.
“నేను ఈ తాళపత్ర గ్రంధంలోని రెండో వాక్యం కోసం వచ్చాను, నన్ను దక్షిణామూర్తి గారు ఇక్కడికి అరుణాచలం నుండి పంపారు ” అని అన్నాడు.
ఆ తాళపత్రం చూశాడు జాంబవంతుడు, అగ్నితో నీటి దీపం వెలిగించవచ్చు అని చదివారు. “నాయనా ఆ జలాలు ఋష్యముఖి పర్వతం మీద ఉన్నాయి, అక్కడ మాతంగ ముని ఆశ్రమం ఉన్నది, ఆ ఆశ్రమ౦లోని కొలనులో ఆ నీరు దొరుకుతాయి.మామూలు వ్యక్తులకు అక్కడ ప్రవేశం నిషిద్దం. ఆ కొలనుకు యక్షులు కాపలాగా ఉంటారు. నీవు శక్తిహీనుడిలాగా ఉన్నావు. కావున నీవు సరైన శిక్షణ నా వద్ద తీసుకోవలసి ఉంటుంది. సాధువు చెప్పారు. “నిన్ను మల్లయుద్ధంలో వానరులు ఓడించారని”. .
నీ కుండలిని బట్టి నీవు ఈ జంబూద్వీపానికి చక్రవర్తిని అవుతావు. అతులిత బలసంపన్నుడివి అవ్వాలి. నేను నీకు శిక్షణ ఇస్తాను.
మొదట నీవు అంజనాద్రి పై ఉన్న మూలికలు తీసుకురావాలి, ఈ సాధువు నీతో పాటు వస్తారు. ఆ మూలికలు స్వయం ప్రకాశాలు, అని చెప్పి పంపించారు.”
అంజనాద్రి అక్కడున్న చాలా పెద్ద పర్వతం, నిండా దట్టమైన వృక్షాలు ఉన్నాయి వానరులు చెట్ల మీదనుంచి దూకుతూ వెళుతున్నారు. శాతకర్ణిని నేలమీద నుంచి రమ్మన్నారు.
శాతకర్ణి నవ్వుతూ నా బాల్యమంతా వృక్షాల ఒడిలోనే జరిగింది అని ఒక్క ఉదుటన చెట్టు ఎక్కి ఊడల సాయంతో చెట్లపై దూకుతూ వెళ్ళాడు.
ఆశ్చర్యపోవడం వానరుల వంతయ్యింది. వారం రోజుల తర్వాత అక్కడి మూలికలు, పండ్లు తినడం వల్ల దేహదారుఢ్యం పెరిగింది శతకర్ణికి, ఆఖరికి అంజనాద్రి మీదకు చేరుకున్నారు.
ఇంతలో గాలివానలో వచ్చి శాతకర్ణి తప్పిపోయాడు. అక్కడ ఒక చిన్న గుహలో చేరుకున్నాడు శాతకర్ణి.
ఆ గుహలో వృద్ధదంపతులు ఉన్నారు. “వారి వద్దకు వెళ్ళి నేను మూలికల కోసం వచ్చి తప్పిపోయాను అని చెప్పాడు “,శాతకర్ణి.