వెళ్ళండి బాబుగారూ 1 226

“అడిగింది చేసెయ్యడమంటే.. ఏమడుగుతుందంటావు?”
“కామిని ఇంకేం అడుగుతాదండీ”! దానికెంత సేపూ అదే కావాల!” బుర్ర గిర్రున తిరిగిపోయింది సాంబయ్యకి.
“కొంచం మెల్లగా నడవరా బాబూ” బ్రతిమాలుకున్నాడు ఎంకడు వినిపించుకోలేదు. అతని చేతిని ఇంకా గట్టిగా పట్టుకుని మరింత వేగం పెంచి నడుస్తూ….
” మా అయ్య నేర్పించిన ఆంజనేయ దండకం చదివి దణ్ణం పెట్టుకుని గుమ్మం దగ్గర రెండు అగరొత్తులు ఎలిగించి పెట్టొచ్చానండీ… అవక్కడట్టా ఎలుగుతుండగానే మనమక్కడ కెళ్ళిపోవాలండీ, అయ్యారిపోయాయా, మరింకింతే సంగతులు .. ఆవిడ గదిలోంచి బయటకొచ్చి యిలయ తాండవమాడేత్తారు… అసలే వొంటిమీద సిన్న దారపు పోగన్నాలేదు!” ఆఖరి వాక్యం కొంచం స్వరం తగ్గించి చెప్పాడు.
“ఏంటీ అమ్మగారి వొంటి మీద బట్టల్లేవా”
“ఆవిడ గారి ఓంటిమీద కామినుందంటే మీరింకా బట్టంటారేమిటండీ..” విసుక్కున్నాడు ఎంకడు.
“అసలు కామినీ పిశాచి లచ్చణమే అదిగదండీ? అది వంటి మీద పడ్డాదంటే మరింక గుడ్డుంచ నివ్వదు… మమూలు దెయ్యాలకీ దీనికీ గదే దిపరెన్సండీ… ఊ .. తమరడుగెయ్యాల….” తొందరపెట్టాడు.
” మొన్నా మద్దెన అదేదో ఊళ్ళో ఇలాగే జరిగిందండీ.. ఆ ఎదవెవడో ఆ కామిని సరదా తీర్వడం మానేసి మంత్ర గాడిని కేకేసేడంట. ఆడొచ్చి బాగానే దానిని సీసాలో కెక్కించి పట్టుకుపోయాడంట.. ఆడలా సందు మలుపు తిరిగెళ్ళిన కాసేపటికే కధ అడ్డం తిరిగిందంటడందీ. ఆ సీసాలోకెక్కించిన కామిని పిశాచానికి స్నేహితురాలో ఏంటో అండీ.. ఆటికీ స్నేహాలుంటాయ్ కదండీ… అదొచ్చి అమాంతంగా ఆ ఆడమనిషిని పెళ్ళున ఓ దెబ్బేసిందంటండీ.. అంతే! ఆ మనిషి రకతం కక్కుకుని అక్కడికక్కడే దబ్బున పడిపోయిందంటండీ… పాపం .. మనూరి పెద్ద మనిషే ఎవరో చెబుతుంటే యిన్నాను.. అందుకే, తమర్ని ఆచార్లు కేదీ కబురు పెట్టించొద్దన్నాను అని ఎంకడు గుక్క తిప్పుకోకుండా చెప్పేసరికి ఇల్లు చేరువయింది.
గడియ తీసి గది తలుపు లోపలికి తొయ్యబోయి అంతలోనే చట్టున చెయ్యి వెనక్కి తీసేసుకున్నాడు వాడు…
“అదేమిట్రా! అలా వెనక్కి జరిగి పోయావేం?” కంగారుగా అడిగాడు సాంబయ్య అరుగు మెట్లు ఎక్కుతుండగానే అతనికి ముచ్చెమటలు పట్టెసాయి.
“నేనిక్కడ నిలబడతాను … తమరెల్లి సక్కబెట్టుకు రండి”
“నాకేంటో ఇదిగా ఉందిరా … నువ్వూ రా…”
వద్దు బాబుగోరూ .. బాగుండదు .. యిందాక ఆవిడా వాలకంతో మిమ్మల్ని పిలుత్తూ పెరట్లో కొచ్చినప్పుడు చూడ్డానికే వొళ్ళు సచ్చిపోయింది…. ఇంట్లో ఇంకెవరూ లేకపోతే ఏమో! ఆ కేకలకు పక్క వాళ్ళు లేచిపోతారని మరిక సిగ్గు సంపేసుకుని , అమాంతం ఎనక నుంచి ఓటేసుకుని గదిలోకి లాక్కొచ్చి పడేశాను. దానికే బోల్డు శమై పోయింది. అదేం బలమో పిశాచి బలం! యిరుగుకీ పొరుగుకీ తెలిసినా పరువు పోయే సంగతై పోయిందండీ.. మరింకెల్లండయ్యగోరూ… నేనిక్కడే కాపుంటాను…” నెమ్మదిగా నచ్చ జెప్పాడు ఎంకడు…