వెళ్ళండి బాబుగారూ 1 226

ప్రతీ సంవత్సరం లాగే ఆ సంవత్సరం కూడా మాయదారి తుఫాను ఆ ఊరిని పగపట్టినట్టు ముంచిపారేసి వెళ్ళిపోయింది. జరిగిన నష్టం గురించి అరుగు దగ్గర చేరిన ఆ ఊరి రైతాంగం మహా సీరియస్ గా చర్చ సాగిస్తోంది.
ప్రభుత్వం ముందుగా తగిన హెచ్చరికలు చేయక పోవడం వల్లనే రైతాంగం మరీ దెబ్బ తిని పోయిందని ఒకరంటే, వాయుగుండం బయల్దేరిందని ముందుగా చెబితే మాత్రం పంట కోయించేసుకుని నువ్వింటికి తెచ్చేసుకుంటావా ? పాయింటు లేకుండా మాట్లాడకు అని గదమాయించాడు సిట్టింగ్ పార్టీ కి చెందిన రైతు. ఆ మాటకు మరొక రైతు “తుఫాను ప్రకృతికి సంబంధించింది గనక అది మన ప్రాప్తాన్ని బట్టి జరుగుతుందని అనుకోవాల్సిందే అని వేదంత దోరణిలో అన్నాడు. అందరూ తలోక పాయింటు మీద వాదనలు చేసుకుంటున్నారు రసవత్తరంగా.
అరుగు చివర గోడకానుకుని సిగిరెట్టు కాలుస్తూ లక్షణంగా జారబడి కూచ్చుని కుతూహలంగా ఆ వాదనలు వింటున్న సాంబయ్య దగ్గరికి మెల్లగా వచ్చి “అయ్యగారూ” అని పిలిచాడు పాలేరు.
పాలేరు వైపు తల తిప్పి ఏంటి అన్నట్టు విసుగ్గా చూశాడు సాంబయ్య
“తమరో సారి ఇంటికి రావాలయ్యగారూ” యిషయం దారిలో మనవి చేస్తాను ” అవతలి పక్కన కూచ్చున్న మనిషికి కూడా వినపడనంత మెల్లగ, రహస్యంగా గొణిగాడు పాలేరు ఎంకడు.
సాంబయ్య ఏదో అనబోయాడు కాని వాడి మొహంలో కనిపిస్తున్న ఆందోళన అదీ చూసి, ఏమయ్యిందో అనుకుంటూ, “కబురొచ్చింది.. నేను ఇంటికి పోతున్నా” అని పక్కనున్న వాళ్ళతో చెప్పి అరుగు దిగిపోయాడు.
అప్పటికే ఎంకడు రోడ్డు మీద దూరంగ నిలబడ్డాడు.
” ఏమిట్రా ఏంటీ సంగతీ” కొంచం గాభరాగానే అడిగాడు సాంబయ్య.
“సంగతి అని చిన్నగా అడుగుతారేంట్తయ్య గారు.. మా పెద్ద గొడవొచ్చి పడిపోయిందయ్యగారు” ఇంటివైపు దారితీస్తూ అన్నాడు ఎంకడు.
వాడి సమాధానంతో మరింత కంగారు పడిపోతూ ” నీ యబ్బా! ఆ చెప్పేదేంటో సరిగ్గా చెప్పేడవరా” అని కసిరాడు.
“అమ్మగారి మీద కామినీ దెయ్యం వాలిందండీ.. నా నా గత్తరా చేసి పారేసిందండీ” నడక వేగం పెంచుతూ బాధగా చెప్పాడు వాడు.
టక్కున ఆగిపోయాడు సాంబయ్య….
అతని గుండె ఓ క్షణం ఆగి మళ్ళీ కొట్టుకోడం మొదలెట్టింది.