కావలెను – Part 3 102

“యస్ మేడమ్… టెడ్డీబేర్ కావాలా వద్దా.. మీకైతే యాభైకే…” అన్నాడు అనిరుద్ర.

“ఇదేంటి… అసహ్యంగా… ముందు ఆటో ఎక్కండి” అంది ఆటోడ్రైవర్ తనను చూస్తున్నాడేమోనని ఫీలవుతూ.

“సారీ… మా బాస్ జీతం ఇవ్వలేదు. అందుకే పార్ట్ టైం బిజినెస్ చేస్తున్నాను. అన్నట్టు నీకు అన్నం వండి పెట్టాను. బాగా మెక్కి పడుకోవచ్చు. నాకు వద్దు” చెప్పాడు మెల్లిగా అనిమిష చెవిలో అనిరుద్ర.

ఆటోవాడు విచిత్రంగా రియర్ వ్యూ మిర్రర్ లో నుండి చూస్తున్నాడు.

“ఏయ్ టెడ్డీ బేర్.. కమ్ హియర్… అటు పక్క పాలియో కారులో నుండి ఓ మిడిల్ ఏజ్ ఆంగ్లో ఇండియన్ పిలిచింది.

“కమింగ్ మేడమ్…” అంటూ అటు వెళ్లాడు అనిరుద్ర.

అనిమిషకు ఇరిటేటింగ్ గా ఉంది. ఎప్పుడు అనిరుద్ర వస్తాడా? ఎప్పుడెప్పుడు దులపాలా? అని ఎదురుచూస్తోంది. తొమ్మిది అయింది. పది దాటింది. అయినా రాలేదు. కోపం క్రమక్రమంగా తగ్గుతోన్నట్టు అనిపించింది. కోపం స్థానే ఇంకా రాలేదే… అన్న ఆదుర్దా చోటు చేసుకుంది.

ఆ ఆదుర్గా స్థానే… పాపం అతనికి డబ్బుతో ఏం అవసరమో… తను ఇచ్చినా బావుండుననే ఫీలింగ్ చోటు చేసుకుంది. అతని కోసం పదకొండున్నర వరకూ ఎదురుచూసి తలుపు దగ్గరగా వేసి తన గదిలోకి వెళ్లి పడుకుంది. ఈసారి తన గదికి బోల్ట్ పెట్టలేదు.

***

ఎవరో తనను పిలిచినట్టు అనిపించి ఉలిక్కిపడి కళ్లు తెరిచింది అనిమిష, ఒక్క క్షణం కంగారు… భయం… “ఏంటి… నా గదిలోకి వచ్చావ్?” కంగారుగా అడిగింది అనిరుద్రని.

“ఒక్కసారి అలా హాలులోకి వస్తావా?” అడిగాడు అనిరుద్ర.

“ఎందుకు?” అనుమానంగానే అడుగుతూనే లేచింది.

హాలు చీకటిగా అనిపించింది. హాలు లోపలికి అడుగు పెట్టి షాకయింది. హాలు మధ్యలో టేబుల్ మీద కేక్… క్యాండిల్స్ వెలిగించి ఉన్నాయి. కేక్ మీద… ‘హ్యాపీ బర్త్ డే టు అనిమిష’ అన్న అక్షరాలు….

“మెనీ మోర్ హ్యాపీ రిటర్న్ ఆఫ్ ది డే” చప్పట్లు కొట్టి అన్నాడు అనిరుద్ర. అనిమిష షాకయ్యింది. అప్రయత్నంగానే ఆమె కళ్లు చెమ్మగిల్లాయి.

“కమాన్ కేక్ కట్ చెయ్…” అంటూ చాకు చేతికి ఇచ్చాడు. ‘కీ’ ఇచ్చిన ఉమెన్ రోబోలా ఆమె కేక్ దగ్గరకి వెళ్లి కేక్ కట్ చేసింది.

3 Comments

  1. I have read this type of novel after a long time. Really very good. Continue writing such novels. I wish you all the success.

Comments are closed.