కావలెను – Part 3 102

అర్ధరాత్రి ఒంటి గంటకు మెలకువ వచ్చింది. అదీ ఆమెకు అనిరుద్ర కలలో రావడం వల్లనే. మళ్లీ అనిరుద్ర కలలోకి వచ్చాడు. ఈసారి జీన్స్ ప్యాంట్తో కలలోకి వచ్చాడు. తన మీదికి వంగి వికృతంగా నవ్వి… రేప్ చేస్తా… అన్నట్లు వచ్చిన కల అది. ఇప్పుడు అనిరుద్ర ఎం చేస్తున్నాడు… జీన్స్ ప్యాంటు వేసుకొని కత్తి బ్యాక్ ప్యాకెట్లో పెట్టుకొని రావడం లేదు కదా..

పోనీ ద్విముఖకు ఫోన్ చేస్తే, తనని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుంది. లాభం లేదు. తనే చెక్ చేసుకోవాలి. వెంటనే హ్యాండ్ బ్యాగ్ లో నుండి అనిరుద్ర గదికి వేసిన తాళం తాలూకు తాళం చెవిని తీసుకొని అనిరుద్ర పడుకున్న గదివైపు వచ్చింది. తాళం తీసి మెల్లగా తలుపు తీసి షాకయ్యింది. లోపల అనిరుద్ర లేడు. ఆమె గుండె కొట్టుకోవడం క్షణకాలం ఆగినట్టనిపించింది.
‘ఇదెలా సాధ్యం? అంటే… తనకు కలొచ్చినట్టుగానే…’ ఆమె గుండె వేగం పెరిగింది. గబగబా కిచెన్ లోకి వెళ్లి కూరగాయలు తరిగే చాకు తీసుకుంది. మెల్లిగా హాలులోకొచ్చింది. అనిరుద్ర పడుకున్న గది మొత్తం వెతికింది. తర్వాత తన గదిలోకి వచ్చి షాకైంది. బాత్రూంలో నుండి నీళ్ల శబ్దం.

తన బాత్రూంలో ఎవరున్నారు? ఏ దొంగ వెధవైనా వచ్చాడా? అసలీ అనిరుద్ర ఎక్కడికి ” వెళ్లాడు?

మెల్లిగా గొంతు తగ్గించి, “ఏమండీ… ఏమండీ… ఉన్నారండీ” అని పిలిచింది.

అప్పుడే బాత్రూమ్ డోర్ తెరుచుకుంది. చాకును కుడిచేతిలో బిగించి పట్టుకుంది. అయినా చెయ్యి వణుకుతోంది. బాత్రూమ్ పక్కనే నక్కింది. ఆగంతకుడు బయటకు రాగానే ఒక్క పోటు పొడవాలని డిసైడైపోయింది. బాత్రూమ్ నుండి బయటకు వచ్చిన శాల్తీని చూసి మరోసారి షాకయ్యింది. ఆ వ్యక్తి అనిరుద్ర.

చాకుతో పొడవబోయి ఆగిపోయి…

“మీరా… నువ్వా?” అని అడిగింది.

“మీరా… నువ్వా… రెండూ కాదు.. ఒక్కటి నేనే” అన్నాడు అనిరుద్ర.

“పడగ్గది బయట తాళం వేస్తే ఎలా వచ్చారు? పైగా నా గదిలోకి?” అడిగింది అనిమిష.

“నీకసలు బుద్ది ఉందా? మెదడు తక్కువ మొద్దు… ఇంకా నయం… గదిలో నేను లేనప్పుడు తాళం వేశావు. అయినా నీకింత అనుమానం అయితే ఎలానే…” టపటపా నాలుగు దులిపేశాడు. అనిమిషకు ఏడుపొక్కటే తక్కువ.

అది గమనించి కాస్త తగ్గి, “ఈ ఇల్లేమైనా మైసూరు ప్యాలెస్ అనుకున్నావా? ఉన్నది ఒక్క బాత్రూమ్. అదీ అటాచ్డ్… అదీ నీ గదిలోనే వుంది. రాత్రి మెలకువ వచ్చి చూస్తే నువ్వు పడుకున్నావు. డిస్ట్రబ్ చేయడం ఎందుకని… బయటకు వెళ్తే… దిక్కుమాలిన సంత… బాత్రూమ్లు లేవు దరిదాపుల్లో, తిరిగొచ్చి చూసేసరికి నా గదికి తాళం ఉంది. నీ గది ఓపెన్ చేసి ఉంది. అర్జంటు కదానని బాత్రూమ్ కి వెళ్లాను. ఇదిగో ఇదే లాస్ట్ వార్నింగ్. నా గదిలో అటాచ్డ్ బాత్రూమ్ అయినా కట్టించు… రాత్రి నీ గది తలుపులు తెరిచైనా ఉంచు” అంటూ తన గదివైపు వెళ్లబోయాడు. మళ్లీ ఆగి, “బయట నుండి తాళం వేసే బిజినెస్ మానెయ్” అన్నాడు.

****

పొద్దున్నే నిద్రలేచి బద్ధకంగా ఒళ్లు విరుచుకొని బయటకు వచ్చి షాకైంది అనిమిష – అనిరుద్ర వాకిలి ముందు ముగ్గు వేస్తున్నాడు. చుట్టపక్కల వాళ్లంతా ‘షో’ చూస్తున్నారు.

“ఇదేంటి… అంతా రివర్స్… జంబలకిడి పంబలా ఉందే” అని ఒకావిడ.

“పెళ్లాం అంటే ఎంత ప్రేముంటే మాత్రం… ఇలా వాకిలి ఊడ్చి, కడిగి ముగ్గు పెట్టడమేమిటి?” అని ఇంకొకావిడ.

3 Comments

  1. I have read this type of novel after a long time. Really very good. Continue writing such novels. I wish you all the success.

Comments are closed.