కావలెను – Part 3 102

“హలో… బావున్నారా సార్… అనిమిషను పిలుస్తాను. ఉండండి” అంది.

“అక్కర్లేదు… మా ఆవిడకు స్లిప్ ఇచ్చి వెళ్తామని వచ్చాను. ఇది తనకు ఇవ్వండి” అంటూ ఓ స్లిప్ ఇచ్చాడు. దాని మీద టమోటా… పదహారు రూపాయలు కిలో, పచ్చిమిర్చి… పద్దెనిమిది రూపాయలు… వంకాయలు పన్నెండు రూపాయలు.. మొత్తం నలభై ఆరు రూపాయలు.. కొత్తిమీర రెండు రూపాయలు, కరివేపాకు రెండు రూపాయలు… మొత్తం యాభై రూపాయలు. అనిరుద్ర సార్ ఇచ్చినది నలభై రూపాయలు. బాకీ పది రూపాయలు… నాగలక్ష్మి, కూరగాయలమ్మి చేవ్రాలు… అని ఉంది.

అది చూడకూడదనుకుంటూనే చూసి, “ఇదేంటి సార్?” అని అడిగింది భావన క్యూరియాసిటీ ఆపుకోలేక.

“బిల్లు… మా ఆవిడ బిల్లు కావాలంది. ఎందుకైనా మంచిదని ఆఫీసుకొచ్చి ఇస్తున్నాను. అన్నట్టు ఈ పాన్ కూడా మా ఆవిడకివ్వండి. తనకు భోం చేయగానే ‘కామత్ స్వీట్ పాన్’ తినడం అలవాటు.

“మంచిది కాదు మొర్రో’ అన్నా వినదు. మర్చిపోకుండా ఇవ్వండి” అంటూ మరో మాటకు అవకాశమివ్వకుండి వెనుదిరిగాడు అనిరుద్ర.

అనిమిష భయపడ్తూనే భావన దగ్గరికొచ్చింది. అప్పటికే భావన ఈ విషయాన్ని నిఖితకు పాస్ చేసింది.

“ఇదేం బావోలేదు అనిమిషా… మీ ఆయన్ని చూస్తుంటే జెంటిల్మెన్ లా ఉన్నాడు. అయినా కూరగాయలకు కూడా లెక్కలు అడుగుతావా.. మరీ అంత అనుమానం పనికిరాదే… పాపం… నాగలక్ష్మి అట… ఆవిడ చేవ్రాలు కూడా రాసుకొచ్చాడు. బంగారంలాంటి ఆయన్ని లెక్కలడుగుతావ్… ఆ పాప పరిహారానికి లక్షోత్తుల నోము నోయాల్సిందే” చెప్పింది నిఖిత.

భావన అనిరుద్ర ఇచ్చిన పాన్ని అనిమిషకు ఇచ్చి, దాంతోపాటు కూరగాయలు రేట్లు వున్న స్లిప్ కూడా ఇచ్చింది..

అన్నం తిని కోపంగా పాన్ని బయటకు గిరాటు వేయబోయింది. అయినా స్వీట్ పాన్ని గిరాటు వేయడం ఇష్టంలేక నోట్లో పెట్టుకొని అనిరుద్రను ఊహించుకుంటూ నమిలి నమిలి తినేసింది అనిమిష.

****

ఆఫీసు వదలగానే కూరగాయల మార్కెట్ కు వెళ్లింది. రెగ్యులర్గా కూరలు కొనే నాగలక్ష్మి దగ్గరకెళ్లింది.

“నమస్తే మేడమ్… బావున్నారా? అయినా ఇదేం బావోలేదు మేడమ్… పాపం సార్ ఎంత బాధపడ్డారు. మా ఆవిడ నమ్మడం లేదు. బిల్లు ఇవ్వమని అడిగారు. నాతో కాగితం రాయించారు. అయినా సారు చాలా మంచోరు…” నాగలక్ష్మి చెప్పుకుపోతోంది. అనిమిష కూరగాయలు కొనకుండానే ఇంటికొచ్చింది. అనిరుద్రను కరిచేయాలన్నత కోపంగా ఉందామెకు.

* * *

“అసలు మీరేమనుకుంటున్నారు? ఆఫీసుకు వచ్చి బిల్లు ఇస్తారా? నాగలక్ష్మితో చెప్పిస్తారా?” గయ్మంది ఇంటికి వస్తూనే అనిమిష.

“నువ్వేగా బిల్లు అడిగావ్… అందులో నా తప్పేముంది…” తాపీగా అన్నాడు. ఏమనాలో అనిమిషకు తోచలేదు. తనేమంటే అతనేమంటాడోనన్న భయం కూడా ఉంది.

“త్వరగా ఫ్రెషప్ అయి వస్తే వేడి వేడి కాఫీ రెడీ చేసి పెడతా… ఆ తర్వాత చల్లారింద లాభం లేదు” అన్నాడు అనిరుద్ర. ఆలస్యం చేస్తే చల్లారిన కాఫీ ఇస్తాడన్న భయంతో బాత్రూమ్లోకి దూరింది ఫ్రెషప్ అవ్వడానికి.

***

రోజులు గడిచిపోతున్నాయి. అనిరుద్రతో క…లి…సి…వుం…డ…డం… అనిమిషలో కొత్త ఆశలను చిగురింపజేస్తుంది. ఇద్దరి మధ్య గిల్లికజ్జాలు వున్నా, అతను ఆమెను ఎంత ఇరిటేట్ చేసినా అందులో ఏదో మత్తు వున్నట్టు అనిపిస్తోంది. మరో పక్క ఆమె సమకూర్చుకోవాల్సిన డబ్బు కూడా జమ అవుతూ వస్తోంది. అనిరుద్ర కాలిక్యులేటెడ్గా ఉంటాడు. ఓ రోజు సినిమాకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఎవరి డబ్బులు వాళ్లే పెట్టుకోవాలనుకున్నారు. ఆటోలో వెళ్లారు. కనీసం ఆటో డబ్బులైనా అనిరుద్ర ఇస్తాడనుకుంది. తన వంతుకు సగం డబ్బు ఇచ్చి కామ్గా థియేటర్ వైపు నడిచాడు.
మరోసారి సన్నజాజులు జడలో పెట్టుకోవాలని అనుకుంది. అదీ అనిరుద్ర కొనిపెడితే పెట్టుకోవాలని… సన్నజాజులు తెచ్చిచ్చి అందులో సగం డబ్బులు డిమాండ్ చేశాడు. అనిరుద్ర ఎలా ప్రవర్తించినా ఆమెలో ఉక్రోషం కలుగుతుందేగానీ ద్వేషం కలగడంలేదు. స్వీట్ పెయిన్ లా ఉంది.

****

“అప్పుడే మీ పెళ్లయి ఆరు నెలలు దాటిందంటే ఆశ్చర్యంగా ఉంది” అంది ద్విముఖ.

3 Comments

  1. I have read this type of novel after a long time. Really very good. Continue writing such novels. I wish you all the success.

Comments are closed.