కావలెను – Part 3 102

“ఫోన్ చేసి రమ్మనండి” అంది ద్విముఖ.

“అక్కర్లేదు… నేను వచ్చేశాను” రొప్పుతూ వచ్చి అన్నాడు కార్తీక్.

“అరె.. అదేంట్రా… నీకప్పుడే ఇడ్లీ వాసన వచ్చిందా?” అడిగాడు అనిరుద్ర.

“కాదు ద్విముఖ కనిపించింది. నేను జాగింగ్ చేస్తుంటే ద్విముఖగారు ఇడ్లీలు ప్యాక్ చేయించుకోవడం చూశాను. ఖచ్చితంగా మీకోసమే అని అర్ధమైంది. నేనూ మీతో జాయిన్ అవ్వొచ్చని ద్విముఖగారిని పిలిచాను. అప్పటికే ఆటో కదిలింది…”

“అలాంటప్పుడు మరో ఆటో ఎక్కి రావొచ్చుగా. ఇలా పరుగెత్తుకుంటూ రావడమెందుకురా?”

“పాయింట్ నెంబర్ వన్… జాగింగ్ కదా అని పర్సు తేలేదు. పాయింట్ నెంబర్ టు… నీకు తెలుసుగా నాకు కుక్కలంటే ఎలర్జీ అని. నేను ఆటోని పిలుస్తూ పరుగెడుతుంటే ఓ కుక్క వెంటపడింది. అది ఆడకుక్కేమో… దాని బాయ్ ఫ్రెండ్ కుక్క గర్ల్ ఫ్రెండ్ కుక్క వెంటపడింది. ఆ రెండూ నా వెంటపడ్డాయి. జాగింగ్ కాస్తా రన్నింగ్ అయింది. పాయింట్ నెంబర్ త్రీ… ఆలస్యమైతే మీరెక్కడ నాకు టిఫిన్ మిగల్చకుండా తినేస్తారేమోనన్న భయం…” !

ద్విముఖ నవ్వింది. అనిమిష టిఫిన్ నాలుగు ప్లేట్లలో సర్దింది. నలుగురు టిఫిన్ చేశాక కాఫీ తాగి బయల్దేరారు. కాఫీ తానే కలుపుతానని చెప్పి కాఫీ కలిపి అందరికీ ఇచ్చింది అనిమిష. ద్విముఖ, కార్తీక్ వెళ్లిపోయారు.

***

“ఏం కూరలు వండను” నేల మీద కూర్చొని కూరగాయల్ని నేల మీద పరిచి అడిగాడు అనిరుద్ర.

“కూరలా.. బహువచనం లేదు… ఏకవచనమే… ఏదో ఒకటి వండండి” అంది అనిమిష.

“అదేంటి డాళింగ్… మూడు కూరలు… రసం… సాంబారు… వడియాలు… గడ్డ పెరుగు… మన మెనూలో ఇవేమీ ఉండవా?”

“ఆ ఉంటాయి… మీరు తాజ్ బంజారా ఛైర్మన్ కూతురినో, టాటా బిర్లాల వారసులో చేసుకుంటే… ఈ కూరలన్నీ వారం రోజులు రావాలి. ఒక పచ్చడి… ఒక కూర… రసం చాలు…”

“ఎట్లీస్ట్ కాస్త మజ్జిగ కూడా ఉండదా?”

“ఉండదు. అది వుంటే నా సంపాదనంతా వాటికే సరిపోతుంది” అనేసి అనిమిష బాత్రూమ్లోకి వెళ్లింది.

“హలో… బాత్రూమ్లో వున్న మహారాణి… ఆమ్లెట్ వేసుకోవచ్చా… అసలే మనకు నాన్ వెజ్ లేకుండా ముద్ద దిగదు… ఆమ్లెట్ వుంటే అడ్జస్ట్ చేసుకుంటాను” గట్టిగా అరిచి అడిగాడు అనిరుద్ర.

“వేసుకోవచ్చు… ఎగ్ ఆమ్లెట్ కు అయ్యే గ్యాస్ మీ అకౌంట్లోకి వస్తుంది” బాత్రూమ్లో నుండే చెప్పింది అనిమిష.

“రొంబ థాంక్స్” అంటూ కూరలు తరగడం మొదలుపెట్టాడు.

టైం చూసుకుంది అనిమిష. తొమ్మిదిన్నర. కిచెన్ లోకి తొంగి చూసింది. కిచెన్లో నుండి ఘుమఘుమలు… అనిరుద్ర సీరియస్గా కూర కలుపుతున్నాడు.

“తొందరగా… ఆఫీసుకు టైం అవుతోంది” అరిచింది అనిమిష.

“వన్ మినిట్ ప్లీజ్…” అంటూనే అనిరుద్ర డిషెస్ ఒక్కోటి తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టాడు.

3 Comments

  1. I have read this type of novel after a long time. Really very good. Continue writing such novels. I wish you all the success.

Comments are closed.