కావలెను – Part 3 102

“అవునూ… ఈ వంటలన్నీ ఎక్కడ నేర్చుకున్నారు?” అడిగింది అనిమిష.

“ఎక్కడా నేర్చుకోలేదు… జస్ట్ ప్రాక్టీస్ ప్రయోగం… అంతే “వ్వా…ట్” అదిరిపడి అంది అనిమిష.

“అవును. మనకు ఒకరి దగ్గర నేర్చుకునే అలవాటు లేదు. కాస్త మెదడుతో ఆలోచించి, టేస్ట్ చూసి చేసేయడమే” అంటూ అన్నం వడ్డించాడు ఆమె ప్లేటులో.

“ఫర్లేదు… నేను వడ్డించుకుంటాను” అంది అనిమిష. “వద్దులే… ఆనక వడ్డించలేదు… జీతంలో కట్… అంటే ప్రమాదం” అన్నాడు అనిరుద్ర.

అనిమష టమోట కర్రీ వేసుకుంది. కాస్త ఉప్పు తక్కువైనా బాగానే ఉంది.అనిరుద్ర డబుల్ ఆమ్లెట్ వేసుకొని తింటున్నాడు.

“అదేంటి… అన్నం తినరా?” అడిగింది అనిమిష.

“తినను… అన్నం బదులు ఆమ్లెట్. ఆ డబ్బులతో ఆమ్లెట్ తింటున్నాను. చాలా బావుంది విజయవాడ రైల్వేస్టేషన్లో బ్రెడ్ ఆమ్లెట్ బావుంటుంది. అప్పట్నుంచి అలా ఆమ్లెట్ వేయడానికి ట్రై చేస్తున్నాను”

“అలా ఒక్కడివే మింగకపోతే కాస్త ఇవ్వొచ్చుగా” అనుకుంది మనసులో. అతను ఆమ్లెట్ తినే విధానం చూసి నోరూరింది అనిమిషకు. అతడు ఆమ్లెట్ తింటూ వుంటే చూడాలనిపిస్తోంది. ఆమ్లెట్ చివర్లు పెదవుల మధ్య పెట్టుకొని తింటున్నాడు. ఆ క్షణం అతని పళ్ల మధ్య వున్న ఆమ్లెట్ ని సగం కొరికేయాలనిపించింది. పెదవులు తడుపుకుంది. గుర్రుగా చూసింది అనిరుద్రవైపు. అనిరుద్ర ఇదేమీ పట్టించుకోకుండా ఆమ్లెట్ తిని, ప్లేటు సింక్లో వేసి… వాష్ బేసిన్ దగ్గరకెళ్లి అద్దంలో మొహం చూసుకుంటున్నాడు. అనిమిష కోపంగా అన్నం ముద్ద నోట్లో పెట్టుకొని ప్లేట్ పక్కనే వున్న ఆమ్లెట్ ని చూసి ఆశ్చర్యపోయింది..

“అది నీకోసమే… ఈ ఒక్క రోజు కాంప్లిమెంటరీ బ్రేక్ ఫాస్ట్” చెప్పాడు అనిరుద్ర.

ఒక్క క్షణం గిల్టీ ఫీలింగ్. అతడి గురించి తనెంత తక్కువగా ఆలోచించింది. ‘కనీసం తన కోసం వండిన అన్నం కాస్త పెట్టినా సరిపోయేది” అనుకుంది.

****

అన్నం టిఫిన్ బాక్స్ లో పెట్టుకొని బయటకు నడిచింది అనిమిష.

“హలో… వన్ సెకన్” పిలిచాడు అనిరుద్ర.

ఆగి ఏమిటన్నట్టు చూసింది. అనిరుద్ర ఓ కవర్ తీసుకొచ్చి ఇచ్చాడు. అరటి ఆకులో మల్లెపూల మాల. అనిరుద్రవైపు చూసింది.

“మల్లెపూలలో మత్తు మందేమీ స్ప్రే చేయలేదు. కొత్తగా పెళ్లయిన అమ్మాయి మల్లెపూలు పెట్టుకోకుండా వస్తే ఆఫీసులో డౌటొస్తుంది. అయినా నన్నో మల్లెపూలు అమ్మే శాల్తీ అనుకో. నీకంతగా ఇష్టంలేకపోతే మల్లెపూల ఖరీదు ఇచ్చెయ్” అని ఆగాడు అనిరుద్ర.

చివుక్కుమంది అనిమిష మనసు. మౌనంగా ఆ మల్లెపూలను జడలో పెట్టుకుంది. అద్దంలో చూసుకుంది. కొత్త అందమేదో వచ్చినట్టు అనిపించింది.

“థాంక్స్…” అంది మనస్పూర్తిగా అనిమిష

“రొంబ వెల్కమ్… అలాగే వెళ్లేముందు బై చెప్పు… అఫ్ కోర్స్ నా కోసం కాదు. చుట్టుపక్కల వాళ్లు చూసి ‘వాహ్’ అనుకోవడం కోసం”

“బై” మనస్ఫూర్తిగానే చెప్పింది. ఆ క్షణం తనే అతని దగ్గరకెళ్లి అతణ్ణి గట్టిగా వాటేసుకుని ‘బై’ చెప్పినట్టు అతను తన నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి హత్తుకున్నట్టు ఫీలయ్యింది. ఆ ఫీలింగ్ ఆమెలో మధురోహలను శృతి చేశాయి.

***

3 Comments

  1. I have read this type of novel after a long time. Really very good. Continue writing such novels. I wish you all the success.

Comments are closed.