కావలెను – Part 3 102

“ఈ ఐడియా బాగానే వుంది… మా ఆయనో నేనూ ముగ్గులేయిస్తాను” అని ఓ ఫెమినిస్టావిడ. సూటిగా ఎవరికి వారు కామెంట్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అనిరుద్ర మాత్రం ఇవేమీ

పట్టించుకోకుండా ముగ్గుల పుస్తకం చేతిలో పట్టుకొని అది చూస్తూ చుక్కలు పెట్టకుండానే ముగ్గు ‘ వేస్తున్నాడు… ఆర్టిస్టు బొమ్మ గీసినట్టు.

అనిమిష బయటకు రావడం చూసి ఎదురింటి బామ్మ, “ఏంటమ్మాయ్… ఎంత కొత్తగా పెళ్లి కూతురివి అయితే మాత్రం… మొగుడితో ముగ్గేయించడమేమిటమ్మా.. చోద్యం కాకపోతే…” అంది. సరిగ్గా అప్పుడే ఆటో దిగిన ద్విముఖ అనిరుద్ర ముగ్గు వేస్తున్న దృశ్యం చూడనే చూసింది.

అనిరుద్ర ముగ్గు వేసి… దాని కింద ‘ఏ ముగ్గు డిజైన్ బై అనిరుద్ర’ అని ముగ్గుపిండితో రాసి, డేట్ వేశాడు టైమ్తో సహా..

అనిరుద్ర ముగ్గు గిన్నెతో లోపలికి అడుగు పెట్టడంతోనే అనిమిష గయ్మంది. “మీకసలు బుద్ధి ఉందా? పొద్దున్నే ఎవడు ముగ్గు వేయమన్నాడు” అంది.
“సో… మధ్యాహ్నమో రాత్రో వేయమంటావా? అయినా ముగ్గు ఎప్పుడు వేయాలో చెప్పు… బుద్ధి ఉందా అని తిడితే దానికి ఎక్స్స్ట్రా ఛార్జి చేయాల్సి వస్తుంది” అన్నాడు అనిరుద్ర.

అప్పుడే లోపలికి అడుగుపెట్టిన ద్విముఖ తన క్యారీబ్యాగ్ లో వున్న టిఫిన్ అందిస్తూ, కొత్త దంపతులు కదా అని నా వంతుగా అయ్యర్ హోటల్ నుండి టిఫిన్ పట్టుకొచ్చాను.

వస్తూనే మంచి సీన్ చూశాను. వాహ్ క్యా సీన్ హై… మా కెమెరామేన్ ని తీసుకురాలేదు …

“మొగుడేసిన ముగ్గు’ అని ఓ ప్రోగ్రామ్ తయారుచేసేదాన్ని” నవ్వుతూ అంది.

“మగవాడు ముగ్గులు వేయకూడదా? ఇవి ఆడవాళ్ళే చేయాలి… ఇవి మగ చేయాలి అని రాజ్యాంగంలో ఎక్కడా లేదే” అన్నాడు అనిరుద్ర. .. ”

“నిజమే… మీరు హండ్రెడ్ పర్సంట్ కరెక్ట్… ముందు టిఫిన్ చేయండి. చల్లారిపోతుంది మీకిష్టమని అయ్యర్ హోటల్ నుంచి తెచ్చాను” అంది ద్విముఖ.

“ఇంత శ్రమపడి పొద్దున్నే తీసుకురావాలా? మేము చేసుకుంటాంగా” అంది అనిమిష.

“ఏదో ఫస్ట్ డే అని తెచ్చాను”

“నువ్వు కూడా మాతో జాయినవ్వు…” అంది అనిమిష ప్లేట్స్ లో టిఫిన్ సర్దుతూ.

“మా కార్తీక్ వుంటే బావుండేది. వాడికి అయ్యర్ హోటల్ ఇడ్లీలంటే చాలా ఇష్టం అన్నాడు అనిరుద్ర.

“ఎందుకు? తేరగా వచ్చాయనా?” అని నాలుక కరుచుకుంది అనిమిష.

3 Comments

  1. I have read this type of novel after a long time. Really very good. Continue writing such novels. I wish you all the success.

Comments are closed.